సినీ రచయిత్రిగా ఓ రికార్డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినీ చరిత్రలో సుమారు ఏడువేలు చిత్రాలు రాగా వాటిల్లో నవలల ఆధారంగా రూపొందినవి సుమారు 75 చిత్రాలు. అంటే, ఒక శాతం అన్నమాట. మళ్లా ఈ నవలల ఆధారంగా వచ్చిన చిత్రాలలో అగ్రతాంబూలం యద్దనపూడి సులోచనారాణికి దక్కుతుంది. సుమారు 15 చిత్రాలు ఆమె వ్రాసిన నవలల ఆధారంగా చిత్రాలు రూపొందాయి.
అన్నపూర్ణలో అక్షరాభ్యాసం..
తొలి దశలో శరత్‌బాబు రాసిన నవలలు చిత్రాలుగా వచ్చాయి. ఆ తరువాత కోడూరి కౌసల్యాదేవి రాసిన చక్రభ్రమణం ఆధారంగా అన్నపూర్ణ సంస్థ డా.చక్రవర్తి తీసి ఘనవిజయం సాధించడంతో మహిళా రచయిత్రుల సినీ రంగ ప్రవేశానికి మార్గం సుగమమైంది. 1966లో కె.విశ్వనాధ్‌ను దర్శకుడిగా పరిచయం చేసిన ఆత్మగౌరవం చిత్రానికి కథ రచన గొల్లపూడి మారుతిరావు, యద్దనపూడి సులోచనారాణి. దాంతో ఆమె సినీరంగ అరంగేట్రం ప్రారంభమైంది. ఆమె రాసిన నవలల పేరుతోనే అధిక సంఖ్యలో చిత్రాలు రూపొందడం విశేషం. విజేత నవల ఆధారంగా అన్నపూర్ణ సంస్థ తీసిన చిత్రం విచిత్రబంధం (ఆదుర్తి-అక్కినేని-వాణిశ్రీ). ఆ తరువాత ఆదుర్తి-అక్కినేని కాంబినేషన్‌లో రూపొందిన ఆ సంస్థ తీసిన నవలా చిత్రం బంగారుకలలు. లక్ష్మి, వహిదా రెహమాన్ ప్రధాన పాత్రలు పోషించారు. 1970లో వచ్చిన (జైజవాన్) యోగానంద్ -అక్కినేని-్భరతి వచ్చిన చిత్రానికి 1969 ప్రాంతాల్లో వచ్చిన ఇండో-పాకిస్తాన్ యుద్ధం కథా వస్తువుకు నేపథ్యం. ఆ తరువాత బ్యానర్ మార్చినా అదే నిర్మాత అంటే దుక్కిపాటి మధుసూదన్‌రావు ఈమె నవలలని చిత్రాలుగా మలచినవి రాధాకృష్ణ (శోభన్‌బాబు-జయప్రద), ప్రేమలేఖలు (జయసుధ-మురళీమోహన్) ఈ రెండింటికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం ఒక ప్రత్యేకత. ఆయన దర్శకత్వంలోనే రూపొందిన మరో యద్దనపూడి నవలా చిత్రం మధురస్వప్నం. దీనికి నిర్మాత కృష్ణంరాజు కాగా, ఆయన సరసన జయసుధ కథానాయికగా నటించారు.
రామానాయుడు గోల్డెన్ టచ్
పాఠకుల అభిమానాన్ని విశేషంగా పొందిన జీవనతరంగాలు నవలను అదే పేరుతోనే తాతినేని రామారావు దర్శకత్వంలో శోభన్‌బాబు-వాణిశ్రీ ప్రధాన పాత్రలుగా రూపొందింది. నిజానికి సహజ సన్నివేశాలతో, అంతకుమించి సహజమైన కథ, కథనాలతో ఆ చిత్రం జయభేరి మ్రోగించింది. ఆత్రేయ రాసిన టైటిల్‌సాంగ్ ‘ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో’ అన్నది గొప్పగా కథకు అన్వయింపబడి మానవ జీవిత సంబంధ బాంధవ్యాల విలువను ఎలుగెత్తి చాటింది. ఆనాటి నాగరికత వెర్రివేషాలు వేస్తున్న పాశ్చాత్య నాగరికతా సంస్కృతికి ప్రతీకగా లక్ష్మి పాత్రను రూపొందించారు. ఆ తరువాత ఆ సంస్థ తీసిన సంచలన చిత్రం సెక్రటరి. కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో అక్కినేని-వాణిశ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక చెప్పుకోదగ్గ విషయమేమంటే చిత్రంలో టైటిల్స్ చూపిస్తున్నపుడు పాత్రల పేరు వేసి, ఆ పాత్రల్ని ధరిస్తున్న నటీనటుల ఫొటోల్ని పక్కన చూపించారు. అంటే, ఆ పాత్రలు, ఆ కథ ఎంతగా పాఠకుల్ని ఉర్రూతలూగించాయో ఊహించవచ్చు. ఆ తరువాత ఆ సంస్థ తీసిన చిత్రం అగ్నిపూలు (కె.బాపయ్య-కృష్ణంరాజు-జయప్రద). ఇతర చిత్రాల్లో నిర్మాత శ్రీకాంత్ నహాతా, కె.ఎస్.ఆర్.దాస్-కృష్ణంరాజు-జయప్రద కాంబినేషన్‌లో తీసిన చిత్రం ‘గిరిజా కళ్యాణం’.
విక్టరీ హస్తం
ఉషాకిరణ్ పతాకంపై నిర్మాత రామోజీరావు విక్టరీ మధుసూదనరావు దర్శకత్వంలో శరత్‌బాబు-చంద్రమోహన్ కాంబినేషన్‌లో తీసిన కాంచనగంగ చిత్రానికి మూలం సులోచనారాణి నవల ప్రేమదీపిక. అంతకుముందే సులోచనా రాణి కథతో సారథివారు దగ్గుబాటి మధుసూదరావు నిర్మాతగా తీసిన ‘ఆత్మీయులు’ (అక్కినేని - వాణిశ్రీ కాంబినేషన్) చిత్రానికి మూలం సులోచనారాణి అందించిన కథ. తరువాత దానిని నవలగా ప్రచురించారు. విక్టరీ దర్శకత్వం వహించిన మరో నవల చండీప్రియ. దీనిని అంజలీ పిక్చర్స్‌వారు నిర్మించగా శోభన్‌బాబు-జయప్రద ప్రధాన పాత్రలు పోషించారు.
సంచలన నవల మీనా
అప్పట్లో సులోచనా రాణి రాసిన నవల మీనా ఎంతగానో సంచలనం సృష్టించింది. దానిని విజయకృష్ణ పతాకంపై విజయనిర్మల దర్శకత్వంలో రూపొందగా అందులో కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి, చంద్రమోహన్, చంద్రకళ, ఎస్.వరలక్ష్మి వంటి హెమాహేమీలు నటించారు. గతంలో వచ్చిన చిత్రాల కథను కొద్దిపాటి మార్పులతో మక్కీగా కాపీకొట్టేస్తున్న ఈరోజుల్లో ఇటీవల సుప్రసిద్ధ రచయితా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీనా చిత్ర స్ఫూర్తితో ‘అఆ’ అనే పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించారు. సమంత-నితిన్-నదియా-నరేష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆ చిత్రం టైటిల్స్‌లో మీనా రచయిత్రి సులోచనారాణి పేరును మర్యాదపూర్వకంగా ఉదహరించడం త్రివిక్రమ్ సంస్కారానికి నిదర్శనం.
ఊహాలోకాలు..
సులోచనారాణి నవలలు సహజ సన్నివేశాలతో అలరిస్తూనే పాఠకుల్ని ఊహాలోకాల్లో విహరింపజేశాయి. కథానాయకుడు కొద్దిపాటి ఉన్నత స్థానానికి చెందినవాడు కావడం, అతని చుట్టూ మహిళా పాత్రలు పరిభ్రమించినా కథానాయిక తన ప్రత్యేక వ్యక్తిత్వంతో నిలబడడంతో ఆయా చిత్రాలలో మహిళా పాత్రలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ దిశగా ఆలోచిస్తే నటీమణులు వాణిశ్రీ, విజయనిర్మల, జయప్రద, జయసుధ ప్రత్యేకంగా కనిపిస్తారు. కథానాయకుడుగా పలు చిత్రాలలో నటించి నవలా నాయకుడు అనిపించుకున్నారు శోభన్‌బాబు. ఏమైనా పురుషాధిక్యతగల సినీరంగంలో ఒక నవలా రచయిత్రిగా విజయబావుటాను ఎగురవేసి తన ప్రత్యేకతని నిలుపుకున్న మహారాణి యద్దనపూడి సులోచనా రాణి. ఆవిడ ఈరోజున కీర్తిశేషులైనా ఆమె కలం నుంచి వెలువడ్డ నవలలు, ఆమె సృష్టించిన పాత్రలు చిరస్థాయిగా రసజ్ఞ ప్రేక్షక హృదయాలలో కదలాడుతుంటాయి.

- ఎస్వీ రామారావు