అనుకున్నవన్నీ జరగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న సినిమాలు చేయాలంటేనే భయమేస్తుంది. ఎందుకంటే చిన్న సినిమాల విషయంలో ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకురావాల్సి వుంటుంది. ఆ విషయంలో చాలా కష్టం ఉంది అని అంటున్నాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. టాలీవుడ్‌లో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా తనదైన మార్క్ సంపాదించుకుని సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆయన బ్యానర్‌లో సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుంటారు. తాజాగా ఆయన బ్యానర్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘లవర్’. రాజ్‌తరుణ్, రిద్దికుమార్ జంటగా అనీశ్‌కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై హర్షిత్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 20న విడుదలవుతుంది. ఈ సందర్భంగా దిల్‌రాజుతో ఇంటర్వ్యూ..
* మీ లవర్ సినిమా గురించి?
- ‘అలా ఎలా?’ సినిమా చూసిన నాకు డైరెక్టర్ అనీశ్‌కృష్ణ సినిమాను బాగా చేశాడనిపించింది. ఓ సందర్భంలో తను నన్ను కలిస్తే.. మంచి స్టోరీ ఉంటే చెప్పు చూద్దాం అని అన్నాను. 2016లో తను ఓ స్టోరీలైన్‌ను చెప్పాడు. నాకు నచ్చింది. అనీశ్ కథను డెవలప్ చేశాడు. 2017లో బిజీగా ఉండటంతో ఈ సినిమా చేయలేకపోయాం. మా నెక్స్ట్ జనరేషన్‌లో హర్షిత్ మూడు, నాలుగేళ్లుగా సినిమా నిర్మాణంలో మాతోపాటు ఉంటున్నాడు. తను నాతో ‘ఓ సినిమాను పూర్తిగా అప్పగించండి.. నేను ఎగ్జిక్యూట్ చేస్తాను’ అన్నాడు. స్టోరీ మొత్తం రెడీ అయిన తర్వాత హర్షిత్‌ను ఓసారి వినమన్నాను. ‘నీకు నచ్చితే నేను ఇన్‌వాల్వ్ కాను’ అన్నాను. హీరో ఎవరు? అని అనుకున్న సమయంలో చాలా రోజులుగా రాజ్‌తరుణ్‌తో సినిమా చేయాలనుకుంటున్నాం, కాబట్టి ఈ సినిమా చేద్దామని అనుకున్నాం.
* కొత్త జనరేషన్‌ని పరిచయం చేస్తున్నారా?
- అవును.. హర్షిత్‌కు సినిమాలంటే ఇష్టం... పరిశ్రమకు కొత్తవాళ్ళు రావాలి. కాబట్టి ఈ సినిమా బాధ్యతను హర్షిత్‌కు అప్పగించాను. ఈ సినిమా కోసం నేను ఐదు కోట్ల బడ్జెట్ ఇచ్చి సినిమా చేయమని అన్నాను. నేను ఇప్పటివరకూ ఏ సినిమాను ఐదు కోట్లలో నిర్మించలేదు. మ్యూజిక్‌లో నాకు డిఫరెంట్‌గా కావాలని హర్షిత్ అనుకున్నాడు. అందుకనే.. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు చెప్పాడు. నేను షాక్ తిన్నాను. మ్యూజిక్ మొత్తానికి మనం ఇంత ఖర్చుపెట్టమని నేను తనకు చెప్పాను. రాజ్‌తరుణ్ అప్‌కమింగ్ హీరో.. తనకు రెండు మూడు సినిమాలు అనుకున్నంత సక్సెస్ కాలేదనేది వాస్తవం. తనకు ఈ సినిమాలో వున్న క్లైమాక్స్ డిఫరెంట్‌గా వుంటుంది. అది కూడా బడ్జెట్‌లో అంగీకరించాను. నేను హర్షిత్ అడిగినవన్నీ అరెంజ్ చేయడంతో తను సినిమాను చక్కగా నిర్మించాడు. సినిమా ఫస్ట్ కాపీ చూశాం. అంతా బావుంది. సినిమా విజువల్‌గా బావుందని అంటున్నారు. క్లైమాక్స్ బావుందని అందరూ అప్రీసియేట్ చేస్తున్నారు. సినిమా అనుకున్న బడ్జెట్ కన్నా నలభై శాతం ఎక్కువైంది. ఈ రోజుల్లో ఐదు కోట్లలో క్వాలిటీ సినిమా తీయడమంటే చాలా కష్టం. అయితే ఈ రోజు తెలుగు సినిమా మార్కెట్ పెరగడం మంచిదే.
* ‘లవర్’ ఎలా ఉంటాడు?
- కథ గురించి చెప్పాలంటే.. ఓ అనాథ కుర్రాడు. వాడు జీవితంలో తన కుటుంబాన్ని మిస్ అవుతాడు.. తన భార్య, పిల్లలకు అద్భుతమైన లైఫ్‌ను ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. అందుకే తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమిస్తాడు. లవ్‌స్టోరీస్‌తోపాటు రాయలసీమ అనంతపూర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ ఇది. ప్రేమకథా చిత్రాలు అన్ని దాదాపు కథాపరంగా ఒకేలానే ఉంటాయి. అయితే ట్రీట్‌మెంట్ మారుతుంది.
* ఈ సినిమా విషయంలో టెన్షన్ పడుతున్నారా?
- నేను సాధారణంగా ప్రెషర్ తీసుకోను. కానీ ఈ సినిమాకు ప్రెషర్ తీసుకుంటున్నాను. అందుకు కారణం హర్షిత్ నిర్మాతగా చేస్తున్న తొలి సినిమా ఇది. నిర్మాతగా నేను జయాపజయాలను సాధారణంగా తీసుకుంటాను. సినిమా రేంజ్‌ని సక్సెస్ ఫెయిల్యూర్ డిసైడ్ చేస్తాయి. ఎందుకంటే.. సినిమా హిట్ అయితే ఎవరూ బడ్జెట్ గురించి ఆలోచించరు.
* గత ఏడాది ఏకంగా సూపర్‌హిట్స్ అందుకున్నారు.. మరి ఈ ఏడాది?
- నిర్మాతగా గత ఏడాది డబుల్ హ్యట్రిక్ సాధించిన నేను.. ఈసారి మూడు సినిమాలనే నిర్మిస్తున్నాను. నిర్మాతగా ఆరు సినిమాలు చేసి సక్సెస్ కొట్టడం సులభం కాదు. కానీ ఇలాగే ప్రతి ఏడాది ఆరు సినిమాలు చేసి సక్సెస్ కొడతాను అనుకోవడం కష్టమే. అన్నిసార్లూ మనం అనుకున్నవన్నీ జరగవు.
* ఇంత అనుభవం వున్న మీరు ఎందుకు చిన్న సినిమాలు తీయడంలేదు?
- నిజానికి చిన్న సినిమాలు చేయాలంటే భయమేస్తుంది. ఎందుకంటే చిన్న సినిమాల విషయంలో ప్రేక్షకుడిని థియేటర్‌వరకు తీసుకురావాల్సి ఉంటుంది. ఉదాహరణకు ‘కేరింత’ సినిమా తీశాను. నచ్చలేదు. మళ్లీ తీశాను. విడుదలైన తర్వాత సినిమా బాగున్నా కలెక్షన్స్ రాలేదు.. సక్సెస్ టూర్‌లు చేసినా లాభం లేకపోయింది. అలా పెట్టిన డబ్బును రాబట్టుకునేసరికి చాలా కష్టమైంది. అదే సమయాన్ని వేరేదానికి ఖర్చుపెడితే ఫలితం వేరేలా ఉంటుంది. అందుకే ఓ మోస్తరు హీరోతో సినిమాలు చేస్తే.. మినిమం ప్రేక్షకుడు థియేటర్‌కు వస్తాడు.
* వరసగా మల్టీస్టారర్స్ ప్లాన్ చేస్తున్నారు?
- మల్టీస్టారర్ అన్నది ఏదీ ప్లాన్ చేసి చేయడంలేదు. కథను బట్టి అలా కుదురుతుంది. ఎఫ్2తోపాటు ఇంద్రగంటి సినిమా రెడీ అవుతుంది. అలాగే హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘దాగుడు మూతలు’ స్క్రిప్ట్ రెడీ అవుతుంది. కథ అనుకున్నాం కానీ అది ఇద్దరికీ నచ్చడంలేదు. మరి అదే సినిమా చేస్తామా? లేక షిఫ్ట్ అవుతామా అని తెలియడానికి మరో వారం, పదిరోజుల సమయం పట్టేలాంది.
* మహేశ్ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడ?
- మహేశ్ 25వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది. తర్వాత గోవా షెడ్యూల్. మళ్లీ హైదరాబాద్ షెడ్యూల్.. మళ్లీ అమెరికా షెడ్యూల్ ఉంటుంది. మహేశ్ సినిమా షూటింగ్ యూరప్‌లో కూడా ఉంటుంది.
* తదుపరి చిత్రాలు
- ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న శ్రీనివాస కళ్యాణం సినిమాను బొమ్మరిల్లు రిలీజ్ డేట్ ఆగస్టు 9న విడుదల చేస్తున్నాం. అక్టోబర్ 18న హలో గురూ ప్రేమకోసమే రిలీజ్.. ఎఫ్ 2 సంక్రాంతి రిలీజ్.. ఏప్రిల్ 5న మహేశ్ 25వ సినిమా రిలీజ్ కానున్నాయి. గల్లా అశోక్ సినిమా సెప్టెంబర్‌లో స్టార్ట్ అవుతుంది.

- శ్రీ