సినిమాల్లో... ‘స్వాతంత్య్ర భారత ప్రశస్తి’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశం స్వతంత్ర దేశంగా రూపొందాక తెలుగు సినీ గీతాల్లో స్వతంత్య్ర భారతావని గూర్చి ఆంధ్రదేశాన్ని అంటే తెలుగుతనాన్ని సినీ సాహిత్యంలో గీత రచయితలు అక్షరబద్ధం చేసిన సందర్భాలను ఒకసారి అవలోకిస్తే..
భారత స్వాతంత్య్ర గాథ కథావస్తువుగా తీసుకుని నటి, గాయని కృష్ణవేణి నిర్మించిన ‘మన దేశం’(1949) చిత్రంలో సముద్రాల ‘జయహో జయహో మహాత్మాగాంధీ.’ జయ విజరుూభవ భారత ధాత్రి అంటూ అటు గాంధీని, యిటు మాతృదేశాన్ని శ్లాఘించాడు.
‘మరో ప్రపంచం’లో మహాత్ముడు కలలుగన్న మరో ప్రపంచం రావాలని ఆశించారు శ్రీశ్రీ. ఆ గీతం మరో ప్రపంచం పిలిచిందీ- దీనిని ఆనాటి కాలచక్రం. మొన్నటి రణభేరి చిత్రాల్లో వాడుకున్నారు.
భారతమాత, భారత జాతి పరంగా వచ్చిన గీతాలను అవలోకిస్తే... నాటి సంచలన చిత్రం ‘గృహలక్ష్మి’(1938)లో ‘లెండు భారతీయులారా.. నిదుర లేవండోయ్, కల్లు మానండోయ్ బాబు- కళ్ళు తెరవండోయ్’’ అంటూ తాగుడుపై శంఖారావం పూరించారు సముద్రాల. సంఘం’చిత్రంలో భారత వీర కుమారిని నేనే అన్న మకుటంగల గీతంలో ‘స్వార్థంతో కుల, మత భేదముతో సతతము పోరే భారతావనిలో శాంతి జ్యోతి వెలిగిస్తా’అని నాయిక చేత అనిపించారు తోలేటి వెంకటరెడ్డి.
ఆయనే నాటి (1950) దేశ పరిస్థితిని చూచి ‘జీవితం’లో ‘ఇదేనా నా దేశం. ఇదా భారతదేశం’అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి గీతాస్ఫూర్తితో కొసరాజు- ‘భారతదేశం సక్కని పాడియావురా
అడిగినన్ని పాలిచ్చు అమ్మ తల్లిరా’ అన్నారు ‘ప్రజానాయకుడు’ చిత్రంలో. ‘భలే రాముడు’ చిత్రంలో రాసిన సదాశివబ్రహ్మం రచన, కథానాయిక సావిత్రిపై చిత్రీకరించిన నృత్యగీతం ‘భారత వీర ఓ భారత వీరా’ పల్లవితో ప్రారంభించి, భారతదేశం ఏవిధంగా ప్రగతి సాధించాలో తెలుపుతూ’’ ‘యంత్రాగారపు పొగ గొట్టాలు అంతరిక్షమున కందాలి. అంతులేని వృత్తి ఉద్యోగాలందరికీ కల్పించాలి. వడివడిగా సిరి వర్ణించేసి తరలించాలి దారిద్య్రాన్ని. భారతమాత ప్రపంచమునకే తలమానికమనిపించాలి’అని ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.
బాలయోగినిలో మరో కవి-
‘వందే వందే భారతమాతా/ భారతమాతా భాగ్యోపేతా’’- అని కీర్తించారు.
రాయప్రోలు సుబ్బారావుగారి గీతం-
‘ఏ మీఠమెక్కినా, ఎవ్వరెదురైనా/ పొగడరా నీ తల్లి భూమి భారతిని/ నిలుపరా నీ జాతి నిండు గౌరవము’- దీనిని ‘అమెరికా అబ్బాయి’లో ఉపయోగించుకున్నారు. ‘కోడలు దిద్దినకాపురం’లో ‘నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నువ్వుమరవొద్దు’అన్న గీతంలో సంఘాన్ని సంస్కరించిన మహనీయులకు నివాళులర్పించారు సి.నారాయణరెడ్డి. ఆయనే దేశ పతనావస్థను, పరిస్థితిని విశే్లషిస్తూ ‘ఎక్కడికెళుతుంది? దేశం ఏమైపోతుంది. హిమశైల శిఖరంపైకా, పాతాళ కుహరంలోకా’ అంటూ ఆవేశంగా ప్రశ్నించారు ‘బంగారు మనిషి’ చిత్రంలో!
ఈ దిశగా రెండు పాటల్ని సవివరంగా చెప్పుకోవాలి. ‘బడిపంతులు’ చిత్రంలో-
‘భారతమాతకు జేజేలు/ బంగరు తల్లికి జేజేలు/ ఆసేతు హిమాచల సస్యశ్యామల/ జీవధాత్రికి జేజేలు/ త్రివేణి సంగమ పవిత్ర భూమి
నాలుగు వేదములు పుట్టిన భూమి/ గీతామృతమును పంచిన భూమి/ పంచశీల బోధించిన భూమి’ అంటూ భారతదేశ సమగ్ర స్వరూపానికి జేజేలు పలికారు ఆచార్య ఆత్రేయ. ఆగస్టు 15వ తేదీన, జనవరి 26వ తేదీన అటు రేడియోల్లోనూ, ఇటు టి.వి.ల్లోనూ మనల్ని ఆలోచింపజేసే శ్రీశ్రీ గీతం- (స్వరకర్త: పెండ్యాల)
‘పాడవోయి భారతీయుడా/ స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి/ సంబరపడగానే సరిపోదోయ్/ సాధించిన దానికి సంతృప్తిని చెంది/ అదే విజయమనుకొనుటే పొరపాటోయ్’- అని హెచ్చరిక చేసి ‘అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు అలుముకొన్న నీ దేశం ఎటు దిగజారు’అంటూ సూటిగా సమాజాన్ని ప్రశ్నించారు. 1971 ప్రాంతాల్లో వున్న దేశ పరిస్థితిని గమనించి సంకేతం అన్నారు మరో కవి ‘గాంధీ పుట్టినదేశం’ చిత్రంలో! ఆనాటి అంటే 1971 ప్రాంతాల్లో వున్న దేశ పరిస్థితిని గమనించి చలించిపోయిన రచయిత ఆరుద్ర ‘గాంధీ పుట్టిన దేశమా ఇది. నెహ్రూ కోరిన సంఘమా ఇది. రామరాజ్యం సామ్యవాదం సంభవించే కాలమా’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఆ గీతంలోని చరణాలు ‘సమ్మె ఘరావ్ దొమ్మి, బస్సుల దహనం లూటీ శాంతి సహనం సమధర్మంపై విరిగెను గూండాలాఠీ, హెచ్చెను హింసాద్వేషం- ఏమవుతుందీ దేశం?’ అన్నది ఈరోజున మనం ప్రతిరోజు పత్రికల్లో చూస్తున్న యథార్థ సంఘటనలే! కవి క్రాంతిదర్శి కాబట్టి ఈనాటి రాజకీయ స్వరూపాన్ని ఆనాడే అంటే నలభై యేళ్ళనాడే విశే్లషించారు ఆరుద్ర. నాటి స్వాతంత్య్ర పోరాటాన్ని కళ్ళకు గట్టినట్టుగా అక్షరబద్ధంచేసిన శ్రీశ్రీ గీతం (అల్లూరి సీతారామరాజు చిత్రంలో) ‘తెలుగువీర లేవరా, దీక్షబూని సాగరా’ ఇందులో అక్షరలక్షలు విలువచేసే వాక్యం సీతారామరాజును ఉద్దేశించి-

‘తెల్లవారు గుండెల్లో నిదురించిన వాడా
మా నిదురించిన పౌరుషాన్ని రగిలించినవాడా
నిదురవద్దు, చెదరవద్దు నింగి నీకు హద్దురా!’అంటూ కీర్తించారు.
తెల్లుగతల్లి’ని శ్లాఘిస్తూ శంకరంబాడి సుందరాచారి వ్రాసిన ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ
మా తన్నతల్లికి మంగళ హారతులు’గీతాన్ని బుల్లెట్, రాక్షసుడు వంటి చిత్రాల్లో వాడుకున్నారు. తాతినేని ప్రకాశరావు చిత్రం ‘పల్లెటూరు’లో వేములపల్లి శ్రీకృష్ణ రచన ‘చెయ్యెత్తిజైకొట్టు తెలుగోడా- గతమెంతో ఘనకీర్తి గలవోడా’ గీతానికి యన్.టి.రామారావు అభినయంతో ప్రాణంపోశారు. అందులోనే మరో గీతం- ‘ఆంధ్రుడా లేవరా, బిరాన లేవరా- ఆంధ్రమాత వీరమాత అనెడి పేరు నిల్పరా!’ ‘అంతా మనవాళ్లే’ చిత్రంకోసం తాతాజీ తాపీ ధర్మారావు వ్రాసిన గీతం ‘పాడరా ఓ తెలుగువాడా- పాడరా ఓ కలిమిరేడా’/ పాడరా మన తెలుగుదేశపు- భవ్యచరితుల దివ్యగీతం! ‘బలిపీఠం’ చిత్రంలో వినిపించిన గీతం ‘కలిసి పాడదాం తెలుగు పాట- కలిసి సాగుదాం వెలుగుబాట’ తెలుగు మహిళ ఔన్నత్యాన్ని రూపురేఖల విలాసాన్ని వయ్యారంగా లలిత లాలిత్యంగా, కవితాత్మకంగా దేవులపల్లి కృష్ణశాస్ర్తీ ‘అమెరికా అమ్మాయి’కోసం వ్రాసిన గీతం రమణీయం, కమనీయం, చిరస్మరణీయం.
‘పాడనా తెలుగుపాట’ పల్లవి గల గీతంలో చరణం ‘వళ్ళంతా వయ్యారికోక, కళ్ళకు కాటుక రేక, మెడలో తాళి కాళ్ళకు పారాణి’- దృశ్యపరంగా, చిత్రీకరణ పరంగా అత్యద్భుతం.
ఏమయినా ఆ కవుల రచనాస్ఫూర్తితో ఏ ఒక్క ఆంధ్రుడు ప్రభావితమైనా ఆ రచయితల జన్మధన్యమైనట్టే!
*

- ఎస్.వి.రామారావు