ఆయన స్నేహం.. ఒక వ్యసనం (గోరాశాస్ర్తీయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరాశాస్ర్తీ షష్ఠిపూర్తి మహోత్సవానందంలో అక్షర పరిచయాన్ని గుర్తు చేసుకున్న నండూరి రామమోహన రావు వ్యాసం

గోరాశాస్ర్తీగారు ‘ఆంధ్రభూమి’ ఎడిటర్‌గా నేను దాదాపుగా ఎరగనట్టే. మద్రాసులో ‘తెలుగు స్వతంత్ర’ ఎడిటర్‌గానే ఆయనతో నా పరిచయమంతా.
అప్పట్లో ఆయన బస రాయపేట హైరోడ్డులో అజంతా హోటల్‌పైన ఒక ఫ్లాట్‌లో. ఆంధ్ర వారపత్రికలో ఉద్యోగం చేస్తూ నేను ట్రిప్లికేన్‌లో. మూడు నాలుగేళ్ళపాటు ఆత్మీయత అనదగినంత గాఢ స్నేహం మా ఇద్దరిమధ్యా. దాదాపు రోజూ, లేదా రోజువిడిచి రోజు, సాయంత్రాలు ఆయన ఇంట్లో అనధికార సాహిత్య గోష్ఠులకు హాజరయ్యేవాణ్ణి. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపై, సాహిత్యాలపై గంటల తరబడి కబుర్లు కొనసాగేవి. ఇంగ్లీషు, రష్యన్, ఫ్రెంచి, తెలుగు సాహిత్యాలపై ఆయన సాధికార వ్యాఖ్యలతో టైం ఎలా గడిచేదో మాకు తెలిసేది కాదు. ఇంటికి పోయేటప్పుడు ఆయన దగ్గిర్నించి ఏ హెన్రీ మిల్లర్ పుస్తకమో, ఈవ్‌లిన్ వాఁ, విలియం సారోయాన్ లాంటి వాళ్ళ సరికొత్త పుస్తకాలో పట్టుకుపోయి చదివేవాణ్ణి. ఆయనతో సాహిత్య చర్చ మహార్జముగా వుండేది.
అయితే, మాట మహా పెళుసు, ఎదుటివాడిని, ఎదుట లేనివాడిని కూడా ఏదో వెక్కిరించనిదే, వేళాకోళం చేయనిదే ఆయనకి తోచేది కాదు. ఆయన హేళనకి గురికానివాళ్ళు అరుదుగా వుండేవారు. అయితేనేం, ఆయనతో స్నేహం ఒక వ్యసనంలాంటిది. కృష్ణశాస్ర్తీగారి తర్వాత గోరాశాస్ర్తీ అంత మంచి కాన్వర్‌జేషనలిస్ట్ మరొకరు లేరనిపించేది. ప్రతిమాటలో మాంచి ఇంటలెక్చువల్ విగరూ పొగరూ రవ్వంత వగరూ ఉట్టిపడేవి. మొత్తంమీద స్నేహితులను సూదంటురాయిలా ఆకర్షించేవాడు.
ఇప్పుడూ అంతేనేమో, నాకు తెలియదు మరి. పాతికేళ్ళ తర్వాత ఈమధ్యనే ఆయన్ని మళ్లీ హైదరాబాద్‌లో చూశాను. భౌతికంగా మారారుగాని, మానసికంగా ఎంత మారారో తెలుసుకునేటంత సేపు ఆయనతో మాట్లాడే అవకాశం కలగలేదు. అయినా, గోరాశాస్ర్తీగారంటే నాకు మంచి వయస్సులో, ఉమ్మస్సులో వున్న గోరాశాస్ర్తీగారే మనస్సులో మెదులుతారు.
ఆ రోజుల్లో ఆయన నడిపిన ‘తెలుగు స్వతంత్ర’కి తెలుగు పత్రికా రంగంలో ఒక విశిష్ట స్థానం వుండేది. ఎందరో భావి సాహిత్య ప్రసిద్ధులకు ఆనాడు తెలుగు స్వతంత్ర తన గొడుగు నీడలో చోటిచ్చింది. ఆరుద్ర ‘త్వమేవాహం’ అందులోనే వచ్చింది. బైరాగి ‘నూతిలో గొంతుకలు’ తెలుగు స్వతంత్రలోనే మొదటగా వినబడ్డాయి. సి.నారాయణరెడ్డిగారిని బాగా ప్రోత్సాహించింది శాస్ర్తీగారే. శ్రీశ్రీ రాసిన ‘ఓ మహర్షీ! ఓ మహాత్మా!’ ఎంత గొప్ప కవిత! అన్నట్టు శ్రీశ్రీ ప్రాసక్రీడలు కూడా తెలుగు స్వతంత్రలోనే వచ్చాయి. శాస్ర్తీగారు చలంగారి చేత మళ్లీ మ్యూజింగ్స్ రాయించారు. కొడవటిగంటి కుటుంబరావుగారి చేత ప్రామాణికమైన సినిమా రివ్యూలు రెగ్యులర్‌గా రాయించేవారు. కొ.కు మారుపేరుతోరాసిన కేయాన్ ఆనంద్ సెటైర్ కథలు కూడా శాస్ర్తీగారే వేశారు. శ్రీవాత్సవ ఏటేటా సాహిత్య వార్షిక సమీక్షలు రాసేవారు. సరే డాక్టర్ శ్రీదేవి ‘కాలాతీత వ్యక్తులు’ సీరియల్ ఎంత పాపులర్ అయిందో చెప్పనక్కరలేదు. ఇలా ఈ జాబితాను ఎంతైనా పొడిగించవచ్చు.
ఎంత చేసినా ఈ పత్రిక సర్క్యులేషన్ నాలుగంకెలు దాటదేమండీ బాబూ అని శాస్ర్తీగారు చిరాకుపడుతూ వుండేవారు. ఆయన చిరాకు ప్రొఫెషనల్ రైవల్స్‌గా నాకూ, మా సూరంపూడి సీతారామ్‌కూ లోపల ఆనందంగానే ఉండేది. ‘‘అంతేనండీ! మంచి పత్రికలు చదివే అలవాటు మనవాళ్ళకి లేదని’’ ఆయన అనేవాడు. సర్క్యులేషన్ సంగతి అలా వుంచితే, ఇప్పటివరకు తెలుగులో వచ్చిన మంచి పత్రికలు పదింటిలో విధిగా వుండే పత్రిక ‘తెలుగు స్వతంత్ర’ అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు.
రచయితగా జగమెరిగిన గోరాశాస్ర్తీని గురించి ప్రత్యేకించి చెప్పవలసిన పనేముంది? ఆయన భాష చాకులాంటిది. దాంతో తన భావాలను చెక్కి చెక్కి ప్రదర్శిస్తాడు. బాకులాంటిది కూడా. అది పొడుస్తున్నట్టు వుంటుంది. ప్రపంచంతో ఆయన ఎప్పుడూ రాజీపడలేదు. వ్యవస్థతో ఆయనకెప్పుడూ సరిపడలేదు. ఎడా పెడా బాణాల వర్షం కురిపించే గాండీవం లాంటిది శాస్ర్తీగారి కలం. దాని వాడి తగిలినవాడికే తెలుస్తుంది. తెలుగు స్వతంత్రలో ‘వినాయకుడి వీణ’ వారం వారం చదవడం ఒక గొప్ప అనుభవంగా వుండేది.
గోరాశాస్ర్తీగారు ఎన్నో గొప్ప కథలు, నాటికలు రాశారు. అన్నిటిలోకి నాకు మహా ఇష్టమైంది ‘ఆశ ఖరీదు అణా’. రేడియోలో వినగానే నేనూ, మా సీతారామ్ దాన్ని అడిగి తీసుకుని ఆంధ్రవారపత్రికలో ప్రచురించాము. పాఠకులు ఎంతో అభిమానించిన రచనల్లో అదొకటి. శాస్ర్తీగారి ఆర్ద్రతకి, జీవిత వేదాంతానికి అది దర్పణం లాంటిది. శాస్ర్తీగారు రెండో ఆవృత్తాన్ని కూడా పూర్తిచేయాలని ఈ శుభ సమయంలో మనసారా కోరుకుంటున్నాను.

- నండూరి రామమోహనరావు