అనుబంధాల భూమిక(గోరాశాస్ర్తీయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరాశాస్ర్తీగారు ‘స్వతంత్ర’కు సంపాదకులుగా వున్నప్పుడు మా అన్నయ్య ‘పిచ్చిశ్రీ’ వగైరా పిచ్చిపిచ్చి పేర్లతో ‘పొలిటికల్ సెటైర్’ రాసేవాడట. తను ఏలూరులో లోహియా సోషలిజమ్‌లో మునిగితేలుతూ వుండేవాడు.
తను హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పనిసరిగా మా ఇంట్లో అంటే మా పుట్టింట్లో అంటే మా అక్క లక్ష్మీదేవిగారింట్లో వాళ్ళిద్దరూ కలుసుకునేవారట. ఇద్దరూ కలిసి మందు పుచ్చుకునేవారట. అప్పటికే నాకు పెళ్లయి వేరే మా యింటికి వెళ్ళిపోయాను. అలా ఒక రోజు మాటల్లో ‘‘ఎవరో రమాదేవట, రేడియో స్టేషన్‌లో పనిచేస్తోందట. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏవో శీర్షికలు చూస్తోందట. యువ మాస పత్రికలో తరచూ ఆవిడ కథలు పడుతూంటాయట. ఆవిడ్ని కలుసుకోవాలంటే ఎలాగ అని ఆలోచిస్తున్నాను’’అన్నారట. మా అన్నయ్య నవ్వాపుకుని ‘‘ఈ విషయాలన్నీ మీరు చెప్పాకే నాకు తెలిసాయి. అసలావిడ్ని ఎందుకు కలవాలనుకుంటున్నారు’’ అనడిగాడట.
‘‘హిందూ పత్రికలో లాగ మన తెలుగు దినపత్రికలో ‘మిడిల్’లేదు. హిందూలో నాతో స్వతంత్రలో పనిచేసిన శాంతా రంగాచారి మిడిల్ రాస్తోంది. ఆంధ్రభూమిలో కూడా అలాంటి ‘మిడిల్’ మొదలుపెట్టాలని వుంది. అది రాయడానికి ఒక రచయిత్రికోసం అందరి దగ్గరా వాకబు చేస్తున్నాను. అలా ఆవిడ పేరు నాకు చాలామంది చెప్పారు. బాగా చదువుకున్నారట. చేయి తిరిగిన రచయిత్రులకు కూడా వారి పరిధి తక్కువవడంవల్ల వివిధ విషయాల మీద మిడిల్ రాయలేరు. ఎంతైనా పెద్ద చదువులు చదువుకున్న రచయితలకు వివిధ విషయాల మీద అవగాహనకు అవకాశముంటుంది’’ అన్నారట.
‘‘పదండి వెళదాం వాళ్ళింటికి. తాను నా చెల్లెలే’’ అన్నాడు మా అన్నయ్య.
‘‘ఇంతవరకూ నాకు ఆ సంగతి చెప్పనే లేదు. సరైన వ్యక్తినే అడిగానన్నమాట’’ అన్నారట గోరాశాస్ర్తీ.
ఇద్దరూ మా యింటికి వచ్చారు. గోరాశాస్ర్తీగారిని గురించి వినడమే కాని, నేనెప్పుడూ ఆయనను చూడలేదు. జుట్టు నెరిసి, పళ్లు జారిపోయి, ఎడతెగకుండా దగ్గుతూ వున్నారు. ‘‘మీ ఆరోగ్యం సరిగా వున్నట్టు లేదు. సూటిగా వుండే మీ సంపాదకీయాలు చదివినవారెవరూ మిమ్మల్నిలా ఊహించుకోలేరు’’ అన్నాను.
‘‘అవును ఈమధ్యనే హఠాత్తుగా ఆరోగ్యం పాడయింది. దానికి గల కారణం నాకే తెలుసు... అది ఆత్మీయుల మరణం! అయితే మీరు ఆంధ్రభూమి చదువుతారన్నమాట.’’
‘‘హైదరాబాద్ నుంచి వెలువడే తెలుగు దినపత్రిక మీదొక్కటేగా, గోల్‌కొండ పత్రిక మూసేస్తారట. అయినా అది పెద్దగా వార్తలను అందించదు’’ అన్నాను.
‘‘ఆంధ్రభూమిలో ‘మిడిల్’ అంటే సంపాదకీయం పక్కనే ఆ పేజీ మధ్యలో వుండే వ్యాసం కాని మరే పేరుతోనైనా పిలిచే రచన వుంటుంది. ఆదివారం మినహాయించి మిగతా ఆరురోజులూ రాయాలి.’’
‘‘ఆ మిడిల్ పేరేమిటి?’’ అన్నాను.
‘‘ఏం పెడదామా అనుకుంటున్నాను... ‘విపులాచపృథ్వీ’ అని పెడితే ఎలా వుంటుంది?’’ అన్నారు.
‘‘చాలా బావుంది అన్నాం నేనూ, మా అన్నయ్య.’’
‘‘ఆషామాషీగా రాసేయకు, జాగ్రత్తగా రాయి’’ అన్నాడు మా అన్నయ్య.
‘‘అసలెప్పుడయినా నేను రాసినవి చదివితే కదా నేను ఎలా రాస్తానో నీకు తెలిసేది’’ అన్నాను.
‘‘నాకీ సాహిత్యం మీద పెద్ద మమకారం లేదు. నేను లోహియాగారి పుస్తకాలను తెలుగులో అనువదించే పనిలో ఉన్నాను. ఆయన సిద్ధాంతాలమీద నమ్మకమున్న రచయితలెవరయినా మీకు తెలిస్తే చెప్పండి శాస్ర్తీగారూ’’ అన్నాడు.
అంతకుముందే నేను రేడియో స్టేషను పనికి ఉద్వాసన చెప్పాను. నా ఆరోగ్యం కూడా దెబ్బతింది. రోజూ 14, 15 గంటలు ఏదో వ్యాపకంతో వుండే నేను అన్నీ వదిలేసుకోవడంవల్లనో ఏమో ఆరోగ్యం దెబ్బతింది. మా అమ్మాయి పుట్టాక. అప్పుడప్పుడే కోలుకుంటున్నాను. మా డాక్టరు గారినడిగాను. ‘‘సికింద్రాబాద్ వెళ్ళడం, రావడం, అక్కడ ఒక గంట కూర్చుని రాయడమే కదా. అయినా మీరు ఏమీ చేయకుండా విశ్రాంతి తీసుకోలేరనుకుంటా’’ అని నవ్వుతూ డాక్టరు రంగారావుగారు ఒప్పుకొన్నారు. అయితే ఆయనొక కండిషన్ పెట్టారు- ‘‘ఒక నెల రోజులయ్యాక తిరిగి నిర్ణయం తీసుకుందురుగాని. ఆరోగ్యం ముందు’’ అన్నారు.
అలా 1962 డిసెంబరులో ఆంధ్రభూమి ఆవరణలో అడుగుపెట్టాను. గోరాశాస్ర్తీగారు కూర్చునే గదిలోనే నాకు ఒక బల్ల కుర్చీ వేయించారు.
‘‘మీరు కావలసినంత టైము తీసుకోవచ్చు. నాలుగు గంటల లోపు ఇస్తే చాలు’’ అన్నారు.
నేను ఒక ముప్పావు గంటలో టిపికల్‌గా వుండే అంశం మీద రాసి ఇచ్చేసాను. ‘‘అప్పుడే అయిపోయిందా... నేనింకా నా సంపాదకీయం దేనిమీద రాయనా అన్న ఆలోచనలోనే వున్నాను’’ అని నేను రాసింది చదివారు.
‘‘మీరు రాసింది బావుందా లేదా అని నేను చదవలేదు. ఇంత త్వరగా ఎలా రాసారా అని చదివాను. ఇక ముందు అచ్చయ్యాక మరుసటిరోజు పత్రిక వచ్చినప్పుడే చదువుతాను’’ అన్నారు.
ఒకరోజు ఆంధ్రభూమి పత్రిక రాగానే చూస్తే గోరాశాస్ర్తీగారి సంపాదకీయానికి పూర్తి వ్యతిరేకంగా వుంది నా మిడిల్. నేను కొంచెం బాధపడ్డాను కాని, ఆయనేమీ అనలేదు. పైగా ‘‘ఆంధ్రభూమికి రాసేవారందరూ సంపాదకుడి అభిప్రాయాలతో ఏకీభవించాలని లేదు’’ అన్నారు.
ఒకరోజున నేను మిడిల్ రాసేసి బయలుదేరబోతూ వుండగా ‘ఒక గంట ఇంటర్వ్యూలో కూర్చోగలరా’’ అన్నారు.
ఇంటర్వ్యూ మొదలయింది. ఇద్దరు విలేఖరుల్ని ఎంపిక చేయాలి. పది మంది దాకా వచ్చారు. ఒకతను తాను ఎన్నో కథలు రాసానన్నాడు. ఒకతను రెండు నవలలు రాసానన్నాడు. అయితే ఎవరూ పత్రికానుభవం వున్నట్టు చెప్పలేదు. ఆయనకు విసుకొచ్చినట్టుంది. మరొకతను వచ్చాడు. అతను రాగానే ‘‘చూడు బాబూ! నువ్వు కథలూ కాకరకాయలు రాయడంలో పేరెన్నికగన్న రచయితవు కావొచ్చు. పత్రికకు వార్తలు రాయగల అనుభవం ఏమయినా వుంటే చెప్పు అన్నారు’’ కాస్త విసుగ్గా.
ఆ వచ్చినతను చిన్నబుచ్చుకున్నట్టు కనపడ్డాడు. నేను కల్పించుకుని ‘‘మిర్చీ, మసాలా చేర్చకుండా వార్తలు యథాతథంగా రాయగలవా విలేఖరిగా అన్న ఉద్దేశంతో అలా ఆయన అడిగారు’’ అన్నాను. ఆయన తేరుకున్నాడు. ‘‘అవకాశం ఇస్తే రాయగలను’’ అన్నాడు.
గోరాశాస్ర్తీగారు అందుకుని ‘‘సరే ఒక నెల టైమిచ్చి చూస్తాను. సరిగా రాయగలిగితే నువ్వు విలేఖరిగా కొనసాగవచ్చు’’ అన్నారు.
‘బ్రతుకు జీవుడా’ అన్నట్టుగా అతను బయటపడ్డాడు.
అతను వెళ్ళాక ‘‘మీరలా కటువుగా అడిగితే పాపం వాళ్ళు బిత్తరపోతున్నారు...’’ అన్నాను.
‘‘నిజమే- పొరపాటే. అసలు వాళ్ళు వచ్చింది విలేఖరి ఉద్యోగానికి. తామేదో గొప్ప కథకులమని, నవలా రచయితలమని మొదలుపెడతారు. నేను అలాంటి సోదిరాయుళ్ళని ఎక్కువసేపు భరించలేను. థ్యాంక్స్. మీరు సర్దిచెప్పారు కదా అతను బిత్తరపోతుంటే’’ అన్నారు.
ఆయన సంపాదకీయాలలో ఒకటి ఇంకా గుర్తుంది నాకు. ‘‘మన శంకరాచార్యులుగారు తనువు చాలించారు. ఆయనను గురించి సంపాదకీయం రాస్తూ. మనకు మన మత ప్రవక్తలు ఎంతటివారు పోయినా చీమ కుట్టినట్లయినా వుండదు. తగిన విధంగా స్పందించరు. అదే ఏ పోపుగారికో కాస్త గాయమయినా హోరెత్తిపోతూ రాసేస్తారు’’ అన్న ధోరణిలో రాసారు.
తరవాత వరుసగా అప్పటి మన రాష్ట్ర ప్రభుత్వం తీరుపైన కారణాలతో సహా దుమ్మెత్తిపోస్తూ రాశారు. కొత్త ముఖ్యమంత్రిగారు ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. ఆయన ఏ విధంగా పరిపాలన చేపడితే బావుంటుందో కూడా సూచిస్తూ కొన్ని సంపాదకీయాలు రాశారు. ఆయన సంపాదకీయాలు అప్పటి ప్రభుత్వం మీద కొంత ప్రభావం చూపాయనే చెప్పాలి.
కొత్తగా పాలన చేపట్టిన ముఖ్యమంత్రిగారు గోరాశాస్ర్తీగారు ఏదడిగినా చేసే పరిస్థితి. ఆయన వెళ్ళి ముఖ్యమంత్రిగారికి శుభాకాంక్షలు కూడా చెప్పినట్టు లేదు.
‘‘నేను పత్రికా సంపాదకుణ్ణి. కాకారాయుణ్ణి కాదు’’ అన్నారు ఎవరో ‘ముఖ్యమంత్రిగారికి శుభాకాంక్షలు చెప్పారా వెళ్ళి’ అని అడిగితే.
1963 జూలైలో నేను ఢిల్లీ వెళ్లిపోయాను. నేను ఢిల్లీనుంచి వచ్చినప్పుడల్లా ముఖ్యంగా ముగ్గురు ఢిల్లీ రాజకీయాలను గురించి అడుగుతూ వుండేవారు. ఒకరు మా నాన్నగారు, మరొకరు మా నాన్నగారిలాంటి జస్టిస్ గోపాలరావు ఎక్బోటేగారు, మూడవవారు గోరాశాస్ర్తీగారు.
ఆ తరువాత కొద్దికాలానికి గోరాశాస్ర్తీగారి కూతురు, అల్లుడు ‘‘శాస్ర్తీగారికి సీరియస్‌గా వుందని కబురందిందని, వెంటనే టిక్కెట్లు ఏర్పాటుచేసి పెట్టమని నా ఆఫీసుకు వచ్చారు. వాళ్ళు ఏదో పనిమీద ఢిల్లీ వస్తే ఆ వార్త అందిందట.’’
కొద్దిరోజుల్లోనే కుటుంబానికి ఆర్థికాధారం ఏమీ మిగల్చకుండానే కన్నుమూశారు గోరాశాస్ర్తీగారు.
అది గతంలో ఆంధ్రభూమితో, అప్పటి సంపాదకులు గోరాశాస్ర్తీగారితో నా అనుబంధం.
తెలుగు పత్రికలో మిడిల్ ఎలా ప్రారంభమైందో గుర్తు చేసుకుంటూ -ఆంధ్రభూమిలో ఏళ్ల తరబడి ‘విపులాచపృథ్వీ’ శీర్షికను నిర్వహించిన మాజీ గవర్నర్ విఎస్ రమాదేవి జ్ఞాపక వ్యాసం

- వి.ఎస్.రమాదేవి