పరివర్తన కథలో వాల్మీకే గొప్పవాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభాస్‌కి గతంలో కథ చెప్పాను. వింటానంటే మళ్లీ చెప్తా. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్‌బాబులాంటి హీరోలతో సినిమాలు చేయడానికి ఏ దర్శకుడు మాత్రం ఇష్టపడడు. జూ.ఎన్టీఆర్ ఒకసారి నమ్మి అవకాశం ఇచ్చాడు. సంతృప్తినివ్వలేకపోయా.
ఎప్పటికైనా మరో సినిమాతో రుణం తీర్చుకుంటా.

ఏ దర్శకుడినైనా సినిమాయే
ఎంచుకుంటుంది. ఏ దర్శకుడూ సినిమాను ఎంచుకోలేడన్నది
నా అభిప్రాయం. బాహుబలి చేయాలని నాకు అనిపించొచ్చు. కాని -చేయగలనా?

సినిమా కోసం సిద్ధం చేసుకున్న కథ తనతో ‘దాగుడుమూతలు’ ఆడటంతో -తమిళ జిగర్తాండను తెలుగు వాల్మీకిగా తెరకెక్కించాల్సి వచ్చిందంటున్నాడు హరీశ్ శంకర్. షాక్, మిరపకాయ్, గబ్బర్‌సింగ్, డీజేలాంటి చిత్రాలతో కమర్షియల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు హరీశ్ శంకర్. వరుణ్ తేజ్ హీరోగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై హరీశ్ శంకర్ తెరకెక్కించిన తాజా మాస్ కమర్షియల్ మూవీ -వాల్మీకి. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. తమిళ హీరో అధర్వ కీలక పాత్ర పోషించాడు. సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం మీడియాతో ముచ్చటించాడు హరీశ్ శంకర్.

ప్రాజెక్టు ఎలా మొదలైంది?
వరుణ్ ఇంటిలిజెంట్ ఆన్సర్ నుంచి మొదలైంది. ‘దాగుడుమూతలు’ కథ నెరేట్ చేశా. బావుందంటూనే -ఈ స్ట్రిప్టే ఎందుకు చేయాలన్నాడు. తొలిప్రేమ, ఫిదాలాంటి కథలు చేశావు కనుక అంటూనే, నాకూ కొత్తగా ఉంటుందన్నా. మీటైపు సినిమా చేస్తే నాకే కొత్తగా ఉంటుందిగా అంటూ ఇంటిలిజెంట్ రిప్లై ఇచ్చాడు. అలా ‘వాల్మీకి’కి బీజం పడింది.
జిగర్తాండే ఎందుకు?
వరుణ్ అలా అన్న టైంలోనే కార్తీక్ సుబ్బరాజు -పేట ఫస్ట్‌లుక్ వచ్చింది. అతని సినిమాలు బావుంటాయి కదా అనుకుంటూ -జిగర్తాండ మళ్లీ చూశా. అప్పటికి నాలుగేళ్లలో చాలాసార్లు చూసినా -సిద్ధార్థ క్యారెక్టర్ ఎవరైతే బావుంటుందన్న ఆలోచనల దగ్గరే ఆగేవాళ్లం. చివరిగా చూసినపుడు -బాబీ సింహా పాత్ర ఆకట్టుకుంది. ఇలాంటి పాత్రను హీరో చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచి వాల్మీకి రూపుదిద్దుకుంది. ఈ క్యారెక్టర్ పట్ల వరుణ్ చాలా ఆసక్తి చూపించాడు.
రీమేక్ ఆలోచనకు కారణం?
కొన్ని అలా జరిగిపోతుంటాయి. మిరపకాయ్ తరువాత, మరో స్క్రిప్ట్ చేద్దామనుకుంటున్న తరుణంలో పవన్‌కళ్యాణ్ కాల్ చేసి ‘దబాంగ్’ రీమేక్ చేద్దామన్నారు. ‘గబ్బర్‌సింగ్’ వచ్చింది. ఇప్పుడు దాగుడుమూతలు చేద్దామనుకుంటే ‘జిగర్తాండ’ రీమేక్ చేయాల్సి వచ్చింది. సినిమా మనల్ని ఎంచుకుంటుంది తప్ప, సినిమాను మనం ఎంచుకోలేం అన్నది నా ఫీలింగ్.
టైటిల్ జస్ట్ఫికేషన్?
ఒక మనిషిలో అత్యున్నత మార్పుని చెప్పాలంటే వాల్మీకి మహర్షిని మించి ఎవరు కనిపిస్తారు. సినిమాలో క్యారెక్టర్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఆయన కథంత అంద్భుతంగా ఉంటుంది. సో, వాల్మీకి టైటిల్ పెట్టాం.
* టైటిల్ కాంట్రవర్సీ అవుతోంది?
కొన్ని అబ్జెక్షన్స్‌తో టైటిల్ కోర్టువరకూ వెళ్లింది. కోర్టులో విషయాలు బయట మాట్లాడటమెందుకు? లాయర్లు, మా ప్రొడ్యూసర్లు చూసుకుంటారు.
మార్పులు చేసినట్టున్నారు?
నిజానికి దబాంగ్‌ని గబ్బర్‌సింగ్‌గా మార్చినంత మార్పులైతే ఉండవు. ఆ సినిమాలో పవన్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టు కథను మార్చాను. బట్, జిగర్తాండ బ్యూటిఫుల్ సబ్జెక్టు. కార్తీక్ సుబ్బరాజు స్క్రీన్‌ప్లే, టేకింగ్, మ్యూజిక్ సెన్స్‌ని ఇష్టపడతా. అందుకే స్క్రిప్ట్‌ని గౌరవించి మార్పులు చేయలేదు. మన నేటివిటీకి అనుగుణంగా మాత్రమే మార్చా. తమిళంలో బాబీ సింహా క్యారెక్టర్ ఆర్టిస్టే. బట్, ఆ పాత్రను చేస్తున్నది హీరో కనుక ఆమేరకు కొన్ని మార్పులున్నాయి. కొన్ని షాట్స్ అయితే యథాతథంగా తీశాం.
జిగర్తాండ తెలుగులోనూ వచ్చింది?
ఆ సినిమా తెలుగు డబ్బింగ్‌గా వచ్చినా -ఆడియన్స్ పెద్దగా చూసుండరని నిర్మాతలు భావించి ఉండాలి. ఆ ధైర్యంతోనే రీమేక్ చేశారేమో.
హీరోయిన్‌గా పూజా హెగ్దె..?
హీరోయిన్ అనడం కంటే, సర్‌ప్రైజింగ్ క్యారెక్టర్ అనాలేమో. ఆ ఒక్క క్యారెక్టర్‌పై సస్పెన్స్ మెయిన్‌టెన్ చేస్తున్నాం. అందుకే ఇప్పుడే రివీల్ చేయలేను. సెకెండాఫ్ నుంచి ఆమె ఉంటుంది. హీరోయిన్ అనుకుంటే -్ఫస్ట్ఫాలోనూ క్యారెక్టర్ పెట్టేవాడినేమో.
రీమిక్స్‌కి వెరైటీ పాట తీసుకున్నారు?
కథ డిమాండ్ మేరకు పూజహెగ్దె క్యారెక్టరైజేషన్‌కు సరిపోయే పాటే తప్ప, కమర్షియల్ రీమిక్స్ కాదు. ఆ పాటకున్న ఫ్లేవర్ ఏమాత్రం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. సినిమాలో నాలుగు పాటలున్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ తక్కువ. అయినా మామూలు చిత్రాలకంటే లెంగ్త్ ఎక్కువ ఉంది. కారణం -కంటెంట్‌కు ప్రాధాన్యతనిచ్చా.
వరుణ్ మేకోవర్..?
అతను హీరోకాకముందు నాగబాబు పంపించిన కొన్ని ఫొటో స్టిల్స్ నా మైండ్‌లో ఉండిపోయాయి. అలాంటి మేకోవర్ తీసుకోవాలనుకుంటున్న తరుణంలో -వరుణ్ మరికొన్ని ఫొటోలు చూపించాడు. అవి నచ్చటంతో, ఓ ఆర్నెల్లు గెడ్డం పెంచి ప్రాపర్ లుక్‌లోకి వచ్చాక షూట్‌ని మొదలుపెట్టాం. తమిళ హీరో అధర్వ గురించి..?
నిజానికి తెలుగులో చాలామంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. కాకపోతే -వాళ్లు అంతకుముందు చేసిన పాత్రల ఇమేజ్ ఈ పాత్రపై పడితే మూడ్ దెబ్బతినే ప్రమాదం ఉందనిపించింది. ఓ యాస్పిరెంట్ డైరెక్టర్ తప్ప ఈ పాత్రలో ఇండే షేడ్స్ కనిపించకూడదు. అందుకే టాలెంటెడ్ ఆర్టిస్ట్‌గా అధర్వను తీసుకోవాల్సి వచ్చింది.
ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మిక్కీ నుంచి మంచి మ్యూజిక్ తీసుకోగలనన్న ఆలోచన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ నుంచే ఉంది. అందుకే మిక్కీని ఎంపిక చేశాం. ఇక ‘నమో వెంకటేశ’ సినిమాకు మందునుంచే నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పరిచయం. వాళ్లు కొత్తగా ఏర్పాటు చేసిన 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఫస్ట్ ఇదే సినిమా కావడం హ్యాపీ.
పవన్ కళ్యాణ్‌తో ప్రాజెక్టు..?
వారం క్రితం పవన్‌కు ట్రైలర్ చూపించా. బావుందన్నారు. అంతే మ్యాటర్. బట్, బయట వినిపిస్తున్నట్టు పవన్‌తో సినిమా డిస్కషన్ అయితే జరగలేదు. కాని, అలా జరగాలని మాత్రం మనసు కోరుకుంటోంది. పవన్‌తో మళ్లీ సినిమా ఎప్పుడెప్పుడు చేయాలా? అని నేనూ వెయిటింగ్.
వరుణ్ ఫ్యాన్స్‌కి ఏం చెప్తారు?
వరుణ్ ఫ్యాన్స్‌కి చెప్పేది ఒక్కటే.. సెప్టెంబర్ 20న వాల్మీకిలో వరుణ్ విజృంభణ చూస్తారు. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్‌లో నేను ఊహించుకున్న దానికంటే ఎక్సట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు వరుణ్. భవిష్యత్‌లో వాల్మీకి గురించి మాట్లాడుకుంటే గర్వంగా ఫీలయ్యేలా ఉంటుంది.
ఫ్యూచర్ ప్రాజెక్టులను ప్రొడ్యూస్ చేస్తారా?
తప్పకుండా. తెలుగులో మంచి కంటెంట్‌తో సినిమాలొస్తున్నాయి. అలాంటి సినిమాలు తీయాలని ఉంది. రైటింగ్, డైరెక్షన్‌తో బిజీగా ఉంటాను కనుక, ఒక్కడినే ప్రొడ్యూస్ చేయడం సాధ్యం కాదు. అందుకే జవాన్ ప్రొడ్యూసర్ కృష్ణ, మహేష్ కోనేరులాంటి ఇద్దరు ముగ్గురు స్నేహితులతో కలిసి నిర్మాణరంగంలోకి రావాలనుకుంటున్నా.
తరువాతి ప్రాజెక్టులు..? 2, 3 ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. వాల్మీకి విడుదలయ్యాక వాటి గురించి చెబుతా.
వివాదాస్పదమైన ‘వాల్మీకి’ టైటిల్

ఇటీవలి కాలంలో సినిమా టైటిళ్లు, పాటలు, పాత్రలను వివాదాలు చుట్టుముడుతున్నాయి. వరుణ్- హరీశ్ కాంబోగా వస్తోన్న ‘వాల్మీకి’ టైటిల్ వివాదాస్పదమైంది. ఓ గ్యాంగ్‌స్టర్ కథకు వాల్మీకి టైటిల్ ఎలా పెడతారంటూ బోయ సామాజిక వర్గం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. సెప్టెంబర్ 20న సినిమా విడుదల కానున్న తరుణంలో -తనను కలిసిన బోయ సామాజిక వర్గం డిమాండ్‌కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మద్దతు పలికారు. గ్యాంగ్‌స్టర్ చిత్రానికి వాల్మీకి టైటిల్ పట్టడం వల్ల బోయ వాల్మీకి సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయన్న విషయాన్ని సెన్సార్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణం సినిమా టైటిల్ మార్చుకోవాలని, లేనిపక్షంలో బోయలంతా ఏకమైతే జరిగే పరిణామాలకు దర్శక నిర్మాతలు, నటులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

-మహాదేవ