మాయమైన.. సీతాంజలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొరుగింటి మీనాక్షమ్మ అంటే గీతాంజలే గుర్తొస్తుంది. ఆమె సంబరాల రాంబాబు చిత్రంలో చేసిన అభినయం అలాంటిది. అలాగే అబ్బాయిగారు అమ్మాయిగారు చిత్రంలో అలాంటిలాంటి ఆడదాన్ని కాదురబ్బాయో, నేనెలాంటిదాన్నో సూపుతానయ్యో అంటూ ‘యిలా సిత్రసిత్రంగా నే టేజెక్కానంటే బస్తీమీద సవ్వాల్ గోలుకొండ జవ్వాల్’ అంటూ గీతాంజలి చేసిన నృత్యాన్ని ఎవరూ మర్చిపోలేరు.

భక్తప్రహ్లాద షూటింగ్ జరుగుతోంది. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ పాత్రలలో విజయలలిత, జయకుమారి, వెన్నిరాడై నిర్మల అతిలోక సుందరీమణులుగా వెలుగొందుతున్నారు సెట్‌లో. వారితోపాటుగా అప్పటికే సీతారామ కళ్యాణం చిత్రంలో సీతగా నటించి ఓవర్‌నైట్‌లో స్టార్‌గా మారిన గీతాంజలి కూడా వుంది. గీతాంజలి ఉంది అంటే ఆ పాట ఓ మెరుపు. అంత గొప్పగా నృత్యం చేయగల దిట్ట ఆమె. గీతాంజలి ఏ పాటకైనా అద్భుతంగా నృత్యం చేయగలదు అన్న నానుడి అప్పటికే సినీ పరిశ్రమలో స్థిరపడింది. శ్రీకృష్ణపాండవీయం చిత్రంలో కె.ఆర్.విజయ రుక్మిణిగా నటించారు. ఆమె చెలికత్తెగా గీతాంజలి చేసిన అభినయం, నృత్యాలు అప్పట్లో ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. బాలనటిగా బాలీవుడ్‌లో పేయింగ్ గెస్ట్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన గీతాంజలి, ఆ తరువాత తన మాతృభాష తెలుగులో సీతారామ కళ్యాణంతో ప్రేక్షకులకు దగ్గరైంది. 1947వ సంవత్సరంలో కాకినాడలో శ్రీరామమూర్తి, శ్యామసుందరి దంపతులకు జన్మించారు గీతాంజలి. నలుగురు అమ్మాయిలు, ఓ అబ్బాయి వున్న కుటుంబంలో రెండవ కూతురామె. సెయింట్ జోసెఫ్ కానె్వంట్‌లో చదువుతున్నారు. మూడేళ్లనుండే తన అక్క స్వర్ణతోపాటు గాంధర్వ నాట్యమండలిలో నృత్యం నేర్చుకుని ప్రదర్శనలు కూడా ఇచ్చే స్థాయికెదిగారు. పారాస్‌మణి హిందీ చిత్రంలో ఆమె చేసిన పాత్రను ఇప్పటికీ బాలీవుడ్ మర్చిపోలేదు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించిన ఆమె దాదాపు 100పైచిలుకు చిత్రాల్లో ప్రేక్షకులనలరించారు. అప్పట్లో గిరిజతో పాటు సమానమైన కామెడీ పాత్రలు వేయడానికి గీతాంజలి ఒక్కరే ఉండేవారు. ఓరకంగా ఇద్దరికీ ప్రొఫెషనల్ కాంపిటీషన్ కూడా వుండేది. పద్మనాభం, రాజబాబు, పొట్టిప్రసాద్, బాలకృష్ణలాంటి హాస్యనటుల సరసన నటించారు. హాస్య పాత్రలు ఎంత అద్భుతంగా అభినయించగలరో, ఉదాత్తమైన పాత్రలు కూడా అంతే గొప్పగా చేయగలనని మురళీకృష్ణ చిత్రంలో నిరూపించారు. పెళ్లిపందిట్లోనే భర్త చనిపోతే, ఆ వధువు మానసిక స్థితి ఎలా వుంటుంది అన్న ప్రశ్నకు సమాధానం గీతాంజలి నటనే. ఆ చిత్రంలో అక్కినేని నాగేశ్వరావు, జమునకు ఎన్ని మార్కులు పడ్డాయో, అంతకన్నా ఎక్కువగానే సినీ విమర్శకులు గీతాంజలిని మెచ్చుకున్నారు. ఇల్లాలు చిత్రంతో ప్రామిసింగ్ హీరోయిన్‌గా ఎదిగిన ఆమె, ఆ తరువాత డా.చక్రవర్తి, బొబ్బిలియుద్ధం, బభ్రువాహన, శ్రీశ్రీ మర్యాద రామన్న, శ్రీకృష్ణావతారం, ప్రాణమిత్రులు, పూలరంగడు, నిండుహృదయాలు, ఆదర్శ కుటుంబం, పంతాలు పట్టింపులు చిత్రాల్లో అలరించారు. తోడూనీడా, లేతమనసులు, గూఢచారి 116 లాంటి చిత్రాల్లో నెగెటివ్ పాత్రలు పోషించారు. నటుడు రామకృష్ణను వివాహం చేసుకున్న తరువాత, కొన్నాళ్లు చిత్ర రంగానికి దూరమైనా ఆ తరువాత పరిశ్రమకు వచ్చి కేరెక్టర్ ఆర్టిస్టుగా అనేక చిత్రాల్లో, బుల్లితెర సీరియల్స్‌లోనూ నటించారు. అలనాటి హాస్యనటీమణులు అంటే తప్పక గీతాంజలికి ఓ అధ్యాయమే కేటాయించాలి. ఆమె దూరమైనా ఆమె చిత్రాలు నిరంతరం తెలుగు ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతూనే ఉంటాయి.