జాతీయ వార్తలు

ముందుగానే సిఎం అభ్యర్థులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుపి ఎన్నికల్లో మారనున్న పార్టీల వ్యూహం

న్యూఢిల్లీ, మార్చి 13: పొరుగున ఉన్న బిహార్‌లో నితీశ్ కుమార్‌ను అసెంబ్లీ ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి మహాకూటమి విజయం సాధించిన విషయం ఇంకా స్మృతి పథంనుంచి చెరిగిపోనందున త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో సైతం ప్రధాన రాజకీయ పార్టీలు తమ ముఖ్యమంత్రి అభ్యర్థులను ముందే ప్రకటించే అవకాశం ఉంది. సమాజ్‌వాది పార్టీకి చెందిన ప్రస్తుత ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రాబోయే ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కావడం ఖాయంగా కనిపిస్తుండగా, ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న బిఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి రాష్ట్రంలో పార్టీని విజయపథంలో నడిపించి అయిదోసారి రాష్ట్రాన్ని పాలించాలని అనుకుంటున్నారు. కాగా, ప్రధాన జాతీయ పార్టీలయిన బిజెపి, కాంగ్రెస్ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించవచ్చనే మాట వినిపిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఢీకొన్ని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ పేరు ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో ఒకటిగా ఉంటుందనే మాట వినిపిస్తోంది. కాగా, రాష్ట్రంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన, పార్టీలో గట్టి పట్టున్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న మరో వ్యక్తి. బిహార్‌లో ముఖ్యమంత్రి పదవికి ఏ అభ్యర్థి పేరునూ ప్రకటించని కారణంగా ఆ రాష్ట్రంలో ఘోర పరాజయం పాలయిన తర్వాత బిజెపి త్వరలో ఎన్నికలు జరగనున్న అసోంలో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావడంలో ఉత్తరప్రదేశ్ ప్రధానపాత్ర పోషించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాలకుగాను బిజెపి 73 స్థానాలను గెలుచుకోవడమే కాకుండా మోదీ పార్లమెంటులో వారణాసికి ప్రాతినిధ్యం వహిస్తుండడం తెలిసిందే.
రాబోయే ఆరు నెలల్లోగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదని యుపికి చెందిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఒకవేళ ఆ పార్టీ గనుక సిఎం అభ్యర్థిని ప్రకటిస్తే రాజకీయంగా అత్యంత కీలకమైన యుపిలో ఆ పార్టీ సిఎం అభ్యర్థిని ఎన్నికలకు ముందే ప్రకటించడం ఇదే మొదటిసారి అవుతుంది. రాష్ట్రంలో దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించగలిగే చరిష్మా ప్రియాంక గాంధీకి మాత్రమే ఉందని, ఆమెనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని పలువురు నేతలు అంటున్నారు. అయితే ప్రియాంక గాంధీ జాతీయస్థాయి నాయకురాలని, ఆమెను రాష్ట్రానికి పరిమితం చేయరాదంటూ మరోవర్గం ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. కాగా, యుపి ఎన్నికలకోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సైతం ఈ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలను సేకరించారు. ఈ నెల ప్రారంభంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన పార్టీ రాష్ట్ర నాయకుల సమావేశంలో ఆయన ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన యుపిలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం వల్ల పార్టీ విజయావకాశాలు పెరుగుతాయా, దెబ్బతింటాయా అనే విషయమై చర్చించారు కూడా.