పశ్చిమగోదావరి

నేను పేదల ముఖ్యమంత్రిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*ఇక ఆసుపత్రులన్నీ ప్రక్షాళన
*వైద్యులు బాధ్యతగా ఉండాలి
*జిల్లా పట్ల బాధ్యతవుంది
*ముఖ్యమంత్రి చంద్రబాబు
ఏలూరు, జనవరి 1 : నేను మొండి మనిషిని... ఏదైనా పట్టుకుంటే వదలను... అది కూడా పేదల సంక్షేమానికి సంబంధించినదైతే అసలు ఆగేది లేదు... అనుకున్నది సాధించే వరకు పనిచేస్తా.... అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు, నూతన పధకాల ప్రవేశం తదితర అంశాలపై వివరించారు. పేదల కోసమే తాను ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నానని, ఏ కొందరు నాయకుల కోసమో, ఉద్యోగుల కోసమో కాదని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానున్న పలు పధకాలకు ఆయన స్థానిక ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో శ్రీకారం చుట్టారు. అనంతరం ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో మాట్లాడుతూ ఏలూరును రాష్టర్రాజధాని అమరావతికి దీటుగా అభివృద్ధిచేస్తామని కూడా భరోసా ఇచ్చారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా కేంద్రమైన ఏలూరులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో తల్లి-బిడ్డ ఆసుపత్రిని ప్రారంభించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అమలుకానున్న 102 కాల్ సెంటర్, వాహనాలు, టెలీ రేడియాలజీ పధకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం విషయంలో తాను మొండి మనిషిని అని, అనుకున్నది సాధించే వరకు వదిలేది లేదని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం విషయంలో ఎప్పుడూ వెనుకడుగు వుండదని, దానికోసమే అన్ని ఆసుపత్రులను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. నూతన సంవత్సరం తొలి రోజున పేదల ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని, ఈ పరిస్థితుల్లో వైద్యులు, సిబ్బంది కూడా తమ పనితీరు మార్చుకుని బాధ్యతగా ముందుకు సాగాలని హితవు పలికారు. ప్రస్తుతం మనం చరిత్రను సృష్టిస్తున్నామని, ప్రజల సంక్షేమం విషయంలో ఎన్నో కోణాల్లో ఆలోచించి పధకాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం పొందాలంటే ఆసుపత్రుల తీరుపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి వుందని, దీన్ని పోగొట్టేందుకు ఆసుపత్రుల నిర్వహణ అంశాన్ని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. ఆసుపత్రుల్లో పడకలను పడకలను శుభ్రంగా ఉంచడం దగ్గర నుంచి ఆవరణలో పరిశుభ్రత నెలకొనడం తదితర అంశాలన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఏజెన్సీల ద్వారా ప్రైవేటుకు దీటుగా నిర్వహణను చేపడుతున్నామన్నారు. అలాగే రానున్న రోజుల్లో 500 డాక్టర్ పోస్టులను, వెయ్యి నర్సు పోస్టులను భర్తీ చేస్తున్నామని చెప్పారు. దీనితోపాటు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 500 కోట్ల రూపాయల విలువైన వైద్య పరికరాలు ఆసుపత్రుల్లో వున్నాయని, అయితే వీటిలో 200 కోట్ల రూపాయల విలువైన పరికరాలు నిరుపయోగంగా పడి వున్నాయన్నారు. ఈ పరిస్థితిని గమనించి ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా అన్ని వైద్య పరికరాలను పనిచేయించేలా చూస్తున్నట్లు చెప్పారు. దీనితోపాటు బయోమెట్రిక్ విధానాన్ని ఆసుపత్రుల్లో ప్రవేశపెట్టి ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తామని వివరించారు. ఈ సందర్భంగానే రానున్న రోజుల్లో పేదల ఆరోగ్య సంక్షేమం కోసం అమ్మ అమృత హస్తం, గోరుముద్దలు వంటి పధకాలను కూడా ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. రానున్న కాలంలో ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడాన్ని సవాలుగా తీసుకుని పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగానే న్యూ ఇయర్ కేక్‌ను కూడా ముఖ్యమంత్రి కట్ చేశారు. అనంతరం స్థానిక ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరుకుని అక్కడున్న ఎన్‌టి ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ రాజధాని అమరావతికి ధీటుగా పక్కనే వున్న ఏలూరును కూడా అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన ఎంతో బాధాకరంగా జరిగిందని, అయినప్పటికీ ఆ కష్టాలను తట్టుకుని భవిష్యత్తు బంగారు మయం చేసుకునేందుకు అన్ని వర్గాల సమన్వయంతో ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్‌లో సాగునీటి ఇబ్బంది వున్నప్పటికీ దాన్ని అధిగమించేందుకు సీలేరు జలాలతోపాటు ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి మరిన్ని జలాలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో ఎకరం పంట కూడా ఎండిపోకుండా చూస్తామని, జిల్లా పట్ల తనకు బాధ్యతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అవసరమైతే ఇక్కడే మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తామని కూడా చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, శాసనమండలి విప్ అంగర రామ్మోహన్, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, జడ్పీ ఛైర్మర్ ముళ్లపూడి బాపిరాజు, ఎంపిలు మాగంటి బాబు, గోకరాజు గంగరాజు, తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, ఎమ్మెల్యేలు బడేటి కోట రామారావు, గన్ని వీరాంజనేయులు, పితాని సత్యనారాయణ, పులవర్తి రామాంజనేయులు, మొడియం శ్రీనివాస్, కె ఎస్ జవహర్, నిమ్మల రామానాయుడు, ముప్పిడి వెంకటేశ్వరరావు, ఆరిమిల్లి రాధాకృష్ణ, నగర మేయర్ షేక్ నూర్జహాన్, నాయకులు అంబికా కృష్ణ, పాకలపాటి గాంధీ, పాలి ప్రసాద్, ఎస్ ఎం ఆర్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు.