ఆంధ్రప్రదేశ్‌

స్థలాలిచ్చేదెక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూములిచ్చిన రైతుల్లో అయోమయం
రింగ్‌రోడ్డుకు 20వేల కోట్లు
హైవేలతో రింగ్‌రోడ్డు అనుసంధానం
9 నగరాల్లో మూడేసి టౌన్‌షిప్‌లు
గుంటూరు, డిసెంబర్ 24: రాజధాని నిర్మాణాలకు భూములిచ్చిన రైతులకు స్థలాలు జనవరి 30వ తేదీలోపు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ ఎక్కడ ఇస్తారనే వ్యవహారం అంతుచిక్కక రైతులు అయోమయానికి గురవుతున్నారు. భూసమీకరణ ద్వారా భూములు తీసుకునే సమయంలో స్వగ్రామాల్లో ఇవ్వాలనే ప్రతిపాదనను రైతులు ప్రభుత్వం ముందుంచారు. జరీబు భూముల రైతులు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం సీడ్ క్యాపిటల్ ప్రాంతాన్ని ప్రకటించి దేశ ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసింది. తుళ్లూరు మండలంలోని ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, తాళ్లాయిపాలెం గ్రామాల పరిధిలో సీడ్‌క్యాపిటల్ నిర్మిస్తామని ప్రకటించింది. గ్రామాలను యథాతథంగా ఉంచి, పొలాల్లో నిర్మాణాలు చేపడతామని మంత్రులు స్పష్టం చేశారు. దీంతో భూములిచ్చిన రైతులంతా సీడ్ క్యాపిటల్ సమీపంలో స్థలాలు కేటాయించాల్సిందిగా డిమాండ్ చేశారు. స్థలాల కేటాయింపులో తమ అంగీకారాన్ని 9.18 ద్వారా తెలియజేయాల్సిందిగా ప్రభుత్వం కోరింది. గ్రూపులుగా స్థలాలు కేటాయిస్తామంటూ సిఆర్‌డిఎ అధికారులు ప్రకటించటంతో రైతులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును స్వయంగా కలిసి గ్రూపులుగా స్థలాలు కేటాయించవద్దంటూ మొరపెట్టుకున్నారు. 29 గ్రామాలకు చెందిన రైతులకు సీడ్ క్యాపిటల్ సమీపంలో అసాధ్యమని సిఆర్‌డిఎ అధికారులు తేల్చి చెప్పారు.
ఈనేపథ్యంలో రింగ్‌రోడ్డు నిర్మాణం అంశం తెరపైకివచ్చింది. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి 65 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాజధాని ప్రాంతంలో 180 కిలోమీటర్ల మేర రింగ్‌రోడ్డు నిర్మాణం జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రింగ్‌రోడ్డు నిర్మాణానికి 20 వేల కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వైద్య, విద్య, న్యాయ, సాంస్కృతిక తదితర నగరాల పేరుతో 9 నగరాలను నిర్మిస్తామని తెలిపింది. ఆయా నగరాల్లో మూడేసి టౌన్‌షిప్‌లు చొప్పున మొత్తం 27 టౌన్‌షిప్‌లను నిర్మించాలని భావిస్తోంది. అంతేకాకుండా రింగ్‌రోడ్డుకు సమీపంలో మరో 9 టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉంది. ముఖ్యంగా రైతులకు ఈ 9 టౌన్‌షిప్‌లలో స్థలాలు కేటాయించాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్లుతున్నట్లు సిఆర్‌డిఎ అధికారులు వెల్లడించారు. అందులో భాగంగానే మాస్టర్ ప్లాన్‌ను మరో రెండురోజుల్లో పూర్తి చేయనున్నారు. మాస్టర్ ప్లాన్ వచ్చిన వెంటనే రైతులకు స్థలాలు కేటాయించే ప్రదేశాలను గుర్తిస్తారు. ప్రభుత్వం రైతుల అంగీకారం తీసుకున్న తరువాత స్థలాల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకుంటుంది. అయితే ప్రభుత్వం స్థలాల కేటాయింపుపై ఎప్పుడు విధాన నిర్ణయాన్ని ప్రకటించి, తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటుందో అర్థంకాని రైతులు అయోమయానికి గురవుతున్నారు.