రాష్ట్రీయం

కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల.. క్రమబద్ధీకరణకు కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగుల విభజన కోసం వేచి చేస్తున్న టి-సర్కార్
శాఖల వారిగా, విడతల వారిగా నియామక పత్రాలు
మొత్తంగా 18 వేల పైచిలుకు ఉద్యోగులకు అవకాశం
కేంద్ర పథకాల్లోని ఉద్యోగులపై ఎటూ తేలని నిర్ణయం

హైదరాబాద్, నవంబర్ 30: కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణను రెండు నెలల్లో చేపడుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించడంతో ఆ దిశగా సంబంధిత శాఖలు కసరత్తు చేస్తున్నాయి. అయితే క్రమబద్ధీకరణ ఉద్యోగుల విభజనతో ముడిపడి ఉండటంతో ప్రభుత్వం ఆ దిశగా వేచి చూస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. నివేదికలో చేసిన సిఫారసుల మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణను విడతల వారిగా చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఉద్యోగుల విభజన ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో జరిగితే జనవరి నెలాఖరుకుగానీ, ఫిబ్రవరి మొదటి వారంలోకానీ క్రమబద్ధీకరణ జరిగి ఉద్యోగులకు నియామక ఉత్తర్వులు అందించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం. వివిధ శాఖల వారిగా నియామకం అయిన కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాలను ప్రభుత్వం సేకరించింది. రిజర్వేషన్ రోస్టర్, ఆర్డర్ ఆఫ్ మెరిట్, వయో పరిమితి ప్రకారం నియామకం అయిన కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను మాత్రమే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2, 2014) నాటికి ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను మాత్రమే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం కట్ ఆఫ్ డేట్‌గా నిర్ణయించింది. రాష్ట్రంలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాలను తెప్పించుకోగా సుమారు 23 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్టు లెక్కతేలింది.
ఇందులో కేంద్ర ప్రభుత్వ పథకాలలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఐదు వేలు కాగా, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 18 వేలుగా తేలింది. మొదటి దశలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణకు న్యాయశాఖ, ఆర్థికశాఖ, సాధారణ పరిపాలనశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు వివిధ రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలు, ఈ అంశంలో గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో వెలువడిన అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరమే క్రమబద్ధీకరణకు అర్హులైన వారికి నియామక పత్రాలు అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కాంట్రాక్టు ఉద్యోగుల అందరి సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల ప్రణాళికలో, పలు సభల్లో కెసిఆర్ హామీ ఇవ్వగా, అధికారుల కమిటీ మాత్రం కేంద్ర ప్రభుత్వ పథకాలలో పని చేస్తున్న వారి సర్వీసులను క్రమబద్ధీకరణ చేయడం సాధ్యం కాదని ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రస్తావన లేకుండా కాంట్రాక్టు ఉద్యోగులు అందరినీ క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు.
అధికారుల కమిటీ సిఫారసు మేరకు క్రమబద్ధీకరిస్తే 18 వేల మంది ఉద్యోగులకు, ముఖ్యమంత్రి హామీ మేరకు క్రమబద్ధీకరిస్తే 23 వేల మంది ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ఇంతకాలంగా తమ సర్వీసులను కూడా క్రమబద్ధీకరిస్తారని, ముఖ్యమంత్రి తమకు కూడా న్యాయం చేస్తారని కేంద్ర ప్రభుత్వ పథకాలలో పని చేస్తున్న ఉద్యోగులు గంపెడాశతో ఉన్నారు. వీరి విషయంలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి తీసుకోబోయే నిర్ణయంతో ఐదు వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల భవిష్యత్ ముడిపడి ఉంది.