ఈ వారం స్పెషల్
ఇల్లంతా ‘స్మార్ట్’ గురూ..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
స్విచ్ వేసి గ్రైండర్‌కు పనిచెబితే క్షణాల్లో ఇడ్లీ పిండి సిద్ధం.. మీటనొక్కితే వాషింగ్ మిషన్‌లో మురికిబట్టలు తళతళలాడడం ఖాయం.. తలస్నానం చేశాక జుట్టు ఆరబెట్టుకోవడానికి డ్రయ్యర్లు.. గదుల్ని ఊడ్చడానికి వాక్యూమ్ క్లీనర్లు.. ఇలాంటి సౌకర్యాలు లేని ఇల్లు నేడు లేదంటే అతిశయోక్తి కాదు.. అన్నింటా టెక్నాలజీ ప్రవేశించడంతో సుఖమయ జీవనం కోసం అన్నివర్గాల వారూ డబ్బు ఖర్చుకు వెనుకాడడం లేదు. శారీరక శ్రమ తప్పుతున్నందున ఆధునిక గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ సామగ్రితో ఇంటిని నింపేసుకునేందుకు పేద,్ధనిక తేడా లేకుండా అందరూ తహతహలాడుతున్నారు.
సాంకేతికత సర్వవ్యాప్తమై పోవడంతో ఇపుడు ఇళ్లలో పనులన్నీ ఎంతో ‘స్మార్ట్’ అయిపోయాయి. రానున్న కాలంలో ఈ సౌకర్యాలు మరింతగా పెరిగిపోయి ప్రతి ఇల్లూ ఓ ‘స్మార్ట్ హౌస్’ అవుతుందని మార్కెటింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అధునాతన సౌకర్యాలు సంపన్న వర్గాలకే అన్న మాటకు నేడు కాలం చెల్లింది. రోజువారీ పనుల్ని చకచకా చేసుకునేందుకే కాదు.. ఇంటి భద్రత, విద్యుత్ వినియోగం, వంట గ్యాస్ లీకేజి నిరోధం, వినోద కార్యక్రమాల వీక్షణ , అగ్నిప్రమాదాల నివారణ.. ఇలా అనేక విషయాల్లో అధునాతన పరికరాలను వినియోగించే వారి సంఖ్య పెరుగుతోంది. మన అడుగుల అలికిడికి ‘సెన్సర్ల’ ద్వారా తలుపులు తెరచుకోవడం, బల్బులు వెలగడం, ఫ్యాన్లు తిరగడం.. ఇలాంటి సౌకర్యాలన్నీ చాలా ఇళ్లలో నేడు కనిపిస్తున్నాయి. ఇంటి పనులు చేసే ‘రోబోలు’ కూడా ఇప్పటికే రంగప్రవేశం చేశాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే గృహసీమలో ‘రోబోల రాజ్యం’ చూస్తున్నాం.
కొనుగోలు శక్తి పెరిగి..
సంపాదనకు, సుఖమయ జీవితానికి నేడు అంతా ప్రాధాన్యం ఇస్తున్నందున మార్కెట్‌లోకి కొత్తగా వచ్చే గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంటి ముంగిటకు చేరుతున్నాయి. పట్టణీకరణ, తలసరి ఆదాయం వృద్ధి కారణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడంతో అధునాతన వస్తుసామగ్రిని విక్రయించేందుకు ఉత్పత్తి సంస్థలు తమ మార్కెటింగ్ వ్యూహానికి ఎప్పటికప్పుడు పదును పెడుతున్నాయి. స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడంతో ‘ఈ-కామర్స్’ వ్యాపారం కొత్తపుంతలు తొక్కుతోంది. ఏది కావాలన్నా ఇంట్లో కూర్చుని ‘ఆన్‌లైన్’ ద్వారా తమకు అవసరమైన గృహోపకరణాలను కొనుగోలు చేసేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొనుగోలు శక్తి, మార్కెటింగ్ సౌకర్యాలు, రుణ పరపతి పెరగడంతో ఇంటికి కావాల్సిన వస్తువుల్ని సమకూర్చుకోవడం ఇపుడెంతో సులభమైపోయింది. ఈ నేపథ్యంలో పలురకాల ఉపకరణాలు చేరి ప్రతి ఇల్లూ ‘స్మార్ట్’ అవుతోంది.
గృహోపకరణాల వ్యాపారం జోరు..
ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారూ అధునాతన సౌకర్యాల కోసం పరితపిస్తున్నందున మన దేశంలో ఇటీవలి కాలంలో గృహోపకరణాల వ్యాపారం ఊపందుకుంది. ఒకేసారి నగదు చెల్లించి కొనలేని వారికి వాయిదా పద్ధతుల్లోనూ వీటిని అందించే సంస్థలు కుప్పలుతెప్పలుగా వెలుస్తున్నాయి. మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, ఏసీ యంత్రాలు, వాక్యూమ్ క్లీనర్లు, ఓవెన్లు, కాఫీ మిషన్లు, స్మార్ట్ ఫోన్లు, ఎల్‌ఇడి టీవీలు.. ఇలా కొత్తకొత్త ఉత్పత్తులను వాడడం సర్వసాధారణమైపోయింది. నేటి ఉరుకులు, పరుగుల జీవనంలో తక్కువ సమయంలో, శారీరక శ్రమ లేకుండా పనులను పూర్తి చేసుకునేందుకు అందరూ మొగ్గు చూపడంతో అధునాతన గృహోపకరణాల మార్కెట్ అంతకంతకూ విస్తరిస్తోంది. మరోవైపు జలవనరులకు, విద్యుత్‌కు కొరత అధికం కావడంతో ప్రత్యామ్నాయ వనరుల వైపు జనం దృష్టిసారిస్తున్నారు. ఇంధన వినియోగంలో పొదుపునకు అవకాశం ఉండే ఉపకరణాల కోసం అర్రులు చాస్తున్నారు. శారీరక శ్రమ లేకుండా ఆటోమేటిగ్గా, రిమోట్‌తో పనిచేసే గృహోపకరణాలకు రానురానూ డిమాండ్ పెరుగుతున్నట్లు మార్కెట్ విశే్లషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రోబోలతో నడిచే వాక్యూమ్ క్లీనర్లు ఇళ్లలోకి చేరిపోతున్నాయి.
280 శాతం వృద్ధి..
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే గృహోపకరణాలను వినియోగించే వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. 2008 నుంచి 2013 మధ్యకాలంలో గృహోపకరణాల వ్యాపారంలో ఏకంగా 280 శాతం వృద్ధి చోటుచేసుకుంది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ల ద్వారా అంతర్జాలాన్ని వీక్షించే అవకాశం కలగడంతో సరికొత్త గృహోపకరణాలు, అధునాతన ఎలక్ట్రానిక్ వస్తువుల గురించి విస్తృత ప్రచారం జరుగుతోంది. ఉపాధి అవకాశాలు, సంపాదన పెరగడంతో పేద, మధ్యతరగతి వారు సైతం ఇళ్లలో సౌకర్యాలను పెంచుకునేందుకు సుముఖత చూపుతున్నారు. గృహోపకరణాలపై మోజు ఎంతలా పెరిగిందంటే- ఒకప్పుడు 18 నుంచి 20 క్యూబిక్ అడుగుల ఫ్రిజ్‌లను వాడేందుకు చాలామంది ఇష్టపడేవారు. ఇపుడు కనీసం 22 క్యూబిక్ అడుగులు ఉండే ఫ్రిజ్‌లను వాడేందుకు, వాటిలో వీలైనంత ఎక్కువగా ‘స్టోరేజి’ చేసుకోవాలని తహతహలాడే వారి సంఖ్య పెరుగుతోంది. జీవితం మరీ ‘బిజీ’ అయిపోయి, తీరిక, ఓపిక తగ్గిపోవడంతో భారీ ఫ్రిజ్‌లు వాడేందుకు, వాటిలో పలురకాల ఆహార పదార్థాలను ఎక్కువగా నిల్వ చేసుకునేందుకు ఎంతోమంది ఇష్టపడుతున్నారు. ఆహారపు అలవాట్లు, ఆరోగ్యంపైన శ్రద్ధ పెరగడం వల్ల కూడా వంటగదిలో అధునాతన వస్తువులే ఎక్కువ స్థలం ఆక్రమిస్తున్నాయి.
అభిరుచి మారుతోంది..
వినియోగదారులు సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలుకుతూ ఆధునిక సాంకేతికను సొంతం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నందున ప్రపంచ వ్యాప్తంగా 2020 నాటికి గృహోపకరణాల వ్యాపారం 344 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనావేశాయి. ఈ వ్యాపారం ముఖ్యంగా భారత్, చైనా, మధ్య ప్రాచ్య దేశాల్లో ఊపందుకుందని వారు విశే్లషిస్తున్నారు. తమ అభిరుచుల మేరకు ఇళ్లలో సౌకర్యాలు పెంచుకునేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నందున 2014లోనే గృహోపకరణాల మార్కెట్ ముందంజలో నిలిచింది. యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియాతో పోలిస్తే భారత్, చైనా, మధ్య ప్రాచ్య దేశాల్లో గృహోపకరణాల మార్కెట్ 70 శాతం మేరకు విస్తరించింది. తలసరి ఆదాయం పెరగడం, పట్టణీకరణ, రుణపరపతి, ఉపాధి అవకాశాలు, గృహ నిర్మాణ రంగం వృద్ధి చెందడంతో గృహోపకరణాలకు సంబంధించి వినియోగదారుల సంఖ్య అంచనాలకు మించి వృద్ధి చెందుతోంది. కొనుగోలుదారుల సంఖ్య పెరగడంతో గృహోపకరణాల ఉత్పత్తిదారుల మధ్య కూడా తీవ్రమైన పోటీ నెలకొంది. సరికొత్త మార్కెటింగ్ విధానం, పదునైన ప్రచార వ్యూహంతో వినియోగదారులను వలలో వేసుకునేందుకు ఉత్పత్తి సంస్థలు ఎగబడుతున్నాయి.
‘స్మార్ట్ హోం’ అంటే..
ఆధునిక సౌకర్యాలున్న నగరాలను ‘స్మార్ట్ సిటీ’ అని అంటున్నట్టే- అధునాతన గృహోపకరణాలున్న ఇళ్లను ‘స్మార్ట్ హోం’ అని మార్కెటింగ్ నిపుణులు నిర్వచిస్తున్నారు. మెరుగైన సౌకర్యాలు, సుఖమయ జీవనం, భద్రత, అనుకూల వాతావరణం, వినోదం, ఇంధన పొదుపు, శారీరక శ్రమ తగ్గడం.. వీటన్నింటినీ అందించే గృహోపకరణాలు ఇంటినిండా చేరిపోతే అది ‘స్మార్ట్ హోం’ గాక ఇంకేమవుతుంది? సంపన్నులకే కాదు.. ఈ సదుపాయాలు సాధారణ వ్యక్తులు, వేతన జీవుల ఇళ్ల ముంగిళ్లకు చేరితేనే సాంకేతికతకు సార్థకత అని భావించి, అందరికీ గృహోపకరణాలను అందుబాటులోకి తేవడం సరికొత్త మార్కెటింగ్ సూత్రం. ఇంటిపని, వంటపని, వినోదానికే కాదు.. నివాసంలో భద్రతకు ఇపుడు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకోసం ఇంటి ముందు సిసి కెమెరాలు, పటిష్టమైన డోర్ లాకింగ్ సిస్టం, ఇతర ఏర్పాట్లను చేసుకునేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. వంటగ్యాస్ లీకేజి, అగ్ని ప్రమాదాలు, ఇంధన పొదుపు, నీటి వినియోగం వంటి విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండేందుకు అధునాతన వస్తువులను వాడుతున్నారు. ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోతూ, ఇళ్లలో ఉండేవారి సంఖ్య బాగా తగ్గిపోవడంతో పలురకాల గృహోపకరణాలను ఆశ్రయించక తప్పడం లేదు. మెట్రో నగరాలు, చిన్న పట్టణాలే కాదు.. పల్లెసీమల్లో సైతం ఇళ్లలో ఇపుడు అనేకానేక వస్తువులు నిండిపోతున్నాయి. ఇక కాలనీల్లో, అపార్ట్‌మెంట్లలో భద్రతకు, నేరాల నివారణకు సిసి కెమెరాలు, అలారం సిస్టమ్ వంటివి అనివార్యమవుతున్నాయి. దంపతులిద్దరూ ఉద్యోగాల నిమిత్తం బయటకు వెళితే ఇళ్లలో ఉండే పిల్లలు, వృద్ధులకు భద్రత కల్పించేందుకు అధునాతన డోర్ లాకింగ్ సిస్టం, తగినంత నిఘా వ్యవస్థ అవసరమవుతోంది. ఈ నేపథ్యంలోనే వీడియో డోర్ మానిటరింగ్, మోషన్ సెన్సర్లు, గ్యాస్ లీకేజీని, అగ్నిప్రమాదాలను సకాలంలో గుర్తించడం వంటివి అవసరమవుతున్నాయి. బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు, టీవీలు, వీడియో గేమ్స్, ఫ్రిజ్‌లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను రిమోట్ ద్వారా నియంత్రించడం లేదా సెన్సర్ల ద్వారా వాటికవే పనిచేయడం వంటివి ఇప్పటికే మనం చూస్తున్నాం. ఇలాంటి సౌకర్యాలను సొంతం చేసుకునేందుకు సంపన్నవర్గాలే కాదు మధ్యతరగతి వారు సైతం ఇష్టపడుతున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది. ఇవి కచ్చితంగా ‘అవసరం’ అని భావించినవారు మాత్రం ఆర్థిక స్థోమతను పక్కనబెట్టి ఎంతటి ఖర్చుకైనా వెనుకాడడం లేదు. నవీన ఆవిష్కరణలు సుఖమయ జీవనానికి ఎంతటి వెసులుబాటు కల్పిస్తాయోనన్న విషయంపైనే ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. ఈ కారణంగానే ఇపుడు ఇళ్లలో ఇంటర్నెట్ వినియోగం పెరగడమే కాదు, గృహసీమల్లో వై-ఫై వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల సేవలు ఆటోమేటిగ్గానో, రిమోట్ ద్వారానో జరిగిపోవాలని అభిషలించే వారి సంఖ్య పెరుగుతోంది. ఇంటి తలుపలు తెరవడం నుంచి ఇంట్లో అన్ని పనులూ చేసేందుకు చేతిలో రిమోట్ ఉండాలని చాలామంది భావిస్తున్నారు. ఇంట్లో అధునాతన పరికరాలు చేరుతున్నకొద్దీ ‘యాంత్రికత’కు అలవాటు పడిపోతామని ఎవరూ వెనుకంజ వేయడం లేదు.
ఇంటికి అందం.. పిల్లలతో బంధం..
టెక్నాలజీ పెరిగిపోయి ఇళ్లలో నానారకాల వస్తువులు చేరడంతో అంతా యాంత్రికంగా బతికేస్తున్నారని వాపోతున్న వారి సంగతి పక్కనపెడితే- అధునాతన గృహోపకరణాలు ఇంటికి కొత్త అందాలను తేవడమే కాదు, తల్లిదండ్రులకు, పిల్లల మధ్య బంధాలు మరింత పెనవేసుకునే అవకాశం ఉందన్న వాదనలు లేకపోలేదు. ఉదాహరణకు వాషింగ్ మెషిన్‌ను వాడడం, దుస్తులను ఇస్ర్తి చేసుకోవడం వంటి విషయాలపై పిల్లలకు అవగాహన కలిగించవచ్చు. ఆ పనులను తొందరగా పూర్తి చేస్తే బహుమతులు ఇవ్వడం లేదా రెస్టారెంటుకు తీసుకువెళ్లి వారికి నచ్చినవి తినిపించడం వంటివి చేస్తే వారు సంతోషిస్తారు. అలాగే పిల్లలతో కలిసి ఇంట్లోనే వీడియా గేమ్స్, ఇతర వినోద కార్యక్రమాల్లో పేరెంట్స్ కూడా సరదాగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. పిల్లలను సినిమాకో, షికారుకో బయటకు తీసుకువెళ్లి బోలెడు డబ్బు ఖర్చు చేయడం కన్నా, వారు కోరుకునే వినోదాన్ని ఇంట్లోనే అందించే వీలుంటుంది. పిల్లలతో ఆడుతూ, పాడుతూ పనిచేస్తూ వారికి పరిశుభ్రత, చదువు, బాధ్యతల గురించి అవగాహన కలిగించవచ్చు.