ఈ వారం స్పెషల్

వీరిదే రి‘కార్డు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ అవ్వకూ పైసల్తో పనిలేదు... పోపుల డబ్బాను వెతకాల్సిన అవసరం లేదు... చిల్లర కోసం తిరగాల్సిన అగత్యమూ లేదు... పొయ్యలో పిల్లి పడుకునే అవకాశమూ రాలేదు... నిత్యావసరాలు నిండుకుంటున్నాయన్న బెంగా లేదు... - ఎందుకంటే కార్డు తెచ్చిన భరోసా ఇది. నగదు రహిత విజయమిది. పెద్దనోట్ల రద్దు,
నగదు కొరత వంటి ఇబ్బందుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఓ రెండు గ్రామాలు స్వైపింగ్ కార్డు వినియోగంలో ఏకంగా రికార్డు సృష్టించాయ. గ్రామస్థులంతా నగదు రహితంగానే కొనుగోళ్లు చేసి అందరికన్నా మేమే ముందు అని చాటాయ. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ ఒకటి కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా ద్వారపూడి మరొకటి. అక్షరాస్యత అంతగా లేకున్నా, సాంకేతిక వినియోగంపై పూర్తిగా అవగాహన లేకున్నా నగదు రహిత విధానాన్ని అందిపుచ్చుకుని ఆదర్శంగా నిలిచాయ.

తెలంగాణకే ఆదర్శం
ఇబ్రహీంపూర్ గ్రామం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ది చెందింది. తెలంగాణ రాష్టంలో తొలి నగదు రహిత గ్రామంగా గుర్తింపు పొందడం సంతోషం. ఇబ్రహీంపూర్ వందశాతం ఇంకుడుగుంతలు, పారిశుద్ధ్యం, మొక్కలు నాటడంలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. నగదు రహితంలో సైతం ఇబ్రహీంపూర్‌ను స్ఫూర్తిగా తీసుకొని గ్రామాలన్నీ అదే బాటలో నడవాలి.
- హరీశ్‌రావు
తెలంగాణ రాష్ట్ర మంత్రి

డిజిటల్ దిశగా
అడుగులు వేయాలి
ద్వారపూడి డిజిటల్ గ్రామంగా మారడం సంతోషకరం. ఇలాంటి గ్రామం ఆదర్శంగా మారడంలో ప్రజల సహకారం ఎంతో ఉంది. ప్రభుత్వ నిధులతో కార్యక్రమాలు చేయడం గొప్పకాదు. ప్రజల భాగస్వామ్యంతో ముందుకు రావాలి. అలాంటి మార్పు రావాలి. ద్వారపూడి మాదిరిగానే అన్ని గ్రామాలు డిజిటల్ దిశగా అడుగులు వేయాలి. ప్రభుత్వం నల్లధనాన్ని అరికట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేసింది. ఆ ప్రయాణంలో మనమంతా
కలిసికట్టుగా ముందుకు సాగాలి.
- అశోక్‌గజపతి రాజు
కేంద్ర మంత్రి

కరెన్సీ రద్దుతో సరిపెట్టకుండా ఇక అంతా ఆన్‌లైన్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ భారతావనిలో సరికొత్త సంస్కరణల శంఖారావానే్న పూరించారు. నగదు లావాదేవీలకే అలవాటుపడ్డ సగటు భారతీయుడికి ఆన్‌లైన్ అంటే ఓ అంతుబట్టని మీమాంస. ఎడతెగని గందరగోళం. అక్షరాస్యత స్థాయి ఇబ్బడిముబ్బడిగా వుండి సాంకేతికంగా కూడా అవగాహన ఉన్న వ్యక్తులకే ఆన్‌లైన్ లావాదేవీలు చాలాసార్లు గందరగోళంలో పడేస్తాయి. అలాంటిది మొత్తం భారతదేశంలోనే నేల నలుచెరగులా ఆన్‌లైన్ లావాదేవీలే ఇక దైనందిన ఆర్థిక జీవన వేదం అంటూ ప్రధాని మోదీ జారీచేసిన ఉత్తర్వును తొలుత గ్రామాలే అందిపుచ్చుకున్నాయ. నగరాలు, పట్టణాల్లో ఎప్పటినుంచో ఆన్‌లైన్ కొనుగోళ్లు కొనసాగుతున్నాయ. గ్రామాల్లో ఈ విధానం అమలుపై నెలకొన్న అనుమానాలను ఈ రెండు గ్రామాలు పటాపంచలు చేశాయ. కూరగాయల మార్కెట్ నుంచి సూపర్ మాల్స్ వరకు అంతటా నగదు రహితమైతే భారత దేశానిది సరికొత్త ఆర్థిక పయనమే అవుతుంది. దేశంలో మెజారిటీ ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే అదీ బ్యాంకింగ్ సౌకర్యాలు అరకొరగా ఉన్నచోటే ఉంటున్నారు కాబట్టి మరి ఆన్‌లైన్ వాళ్లకు లైఫ్‌లైన్ కాగలుగుతుందా అనే అనుమానాలను తెలుగు రాష్ట్రాల్లోని రెండు గ్రామాలు పటాపంచలు చేశాయ. ఏవిధంగా చూసినా ఒకప్పటి కొందరికే అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ ఇప్పుడు అందరి కనుసన్నల్లోకి వచ్చింది. నవభారతంలో ఈ నవనాగరికత ఆర్థిక లావాదేవీల్లో భారతీయులు ఎంతగా ఆరితేరుతారన్న అనుమానం మాట ఎలా వున్నా నగదు రహితం సరికొత్త జీవన పథానికి శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. గతంలో ఉన్నంత పరిమాణంలో నగదు అందుబాటులో ఉండదని తేలిపోవడంతో స్వైపింగ్ వైపు గ్రామీణ జనం సైతం మొగ్గుచూపడానికి మరో కారణమైంది. పెద్ద నోట్ల రద్దు కావడం, బ్యాంకుల్లోనూ, ఏటిఎంల్లోనూ నగదు లేకపోవడం, బ్యాంకుల వద్ద రోజుల తరబడి క్యూలో నిలబడటం వంటి కష్టాలను స్వయంగా చూసి, వాటిని అనుభవించిన వారెవరికైనా నగదు రహితంపై మొగ్గు చూపటం అనివార్యంగా మారింది. అందులోనూ గ్రామాల్లో పరిస్థితి ఇక చెప్పాల్సిన పనిలేదు. నగదు కోసం సమీప పట్టణాలకు పరుగులు పెట్టడం, నిత్యావసర వస్తువుల కొనుగోళ్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో స్వైపింగ్ ఓ వరంలా మారింది.
ఇబ్రహీంపూర్‌లో హోటల్ బిల్లు దగ్గర్నుంచి, పేపర్ బిల్లు, పిండిగిర్నీ చెల్లింపులతో పాటు ఆటో చార్జీలు సైతం స్వైప్ ద్వారానే చెల్లిస్తున్నారంటే నగదు రహిత చెల్లింపులను గ్రామీణులు ఎంత వేగంగా అందిపుచ్చుకున్నారో అర్థమవుతుంది.
ఇక ద్వారపూడిలో డెబిడ్, క్రెడిట్ కార్డులను సైతం వినియోగిస్తున్నారు. చాక్లెట్ల కొనుగోలును కూడా కార్డుద్వారానే చెల్లిస్తున్నారంటే ఇక నగదుతో పనేముంది? ఎటిఎం కార్డులు లేని సామాన్యులు సైతం యాప్ ద్వారా కొనుగోళ్లు జరిపేందుకు అవగాహన కల్పించడంతో మరింత సులువైంది. మినరల్ వాటర్ కొనుగోలుకు ఇదివరకు చిల్లర కొరత వుండటంతో తాజా స్వైపింగ్‌తో ఈ బెడద తప్పిందని అటు కొనుగోలుదారులు, ఇటు వ్యాపారులు సంతోషం వ్యక్తం చేయడం విశేషం.

తొలి నగదు రహిత గ్రామాలు

ఇబ్రహీంపూర్ గ్రామాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు దత్తత తీసుకోగా, ద్వారపూడి గ్రామాన్ని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు దత్తత తీసుకున్నారు.

ఇబ్రహీంపూర్
సిద్దిపేట జిల్లా, తెలంగాణ

ద్వారపూడి
విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్

సిద్దిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్ గ్రామ ప్రజలు చైతన్యానికి ప్రతీకగా నిలిచారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు దత్తత తీసుకున్న ఆ గ్రామం పేరు రాష్టమ్రంతటా మారుమ్రోగుతోంది. ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా ప్రజల భాగస్వామ్యంతో వందశాతం ఫలితాలు సాధిస్తూ రికార్డు సృష్టిస్తోంది. వందశాతం ఇంకుడు గుంతలు, సంపూర్ణ పారిశుద్ధ్యం, వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వంటి వాటిల్లో ఆదర్శంగా నిలిచింది. నిర్మల్ పురస్కార్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయితీగా అవార్డులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ‘స్వశక్తి కరణ్’ అవార్డును ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా సర్పంచ్ కుంబాల లక్ష్మి అందుకున్నారు. నగదు రహిత లావాదేవీల అమలులో దేశంలో రెండో గ్రామంగా, దక్షిణ భారతదేశంలో తొలి గ్రామంగా ఇబ్రహీంపూర్ రికార్డు సృష్టించింది. దేశంలో తొలి నగదు రహిత గ్రామంగా గుజరాత్ రాష్ట్రంలోని ‘అకోదర’ గుర్తింపు పొందితే, రెండో గ్రామంగా ఇబ్రహీంపూర్ ప్రత్యేకతను చాటుకుంది.
కష్టం నేర్పిన పాఠం
కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయడంతో ప్రజలంతా నగదుకోసం బ్యాంకుల వద్ద చాతాడంత క్యూలైన్లు కట్టారు. గ్రామంలో బ్యాంకు లేకపోవటంతో నగదు కోసం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. తెల్లవారు జామున బ్యాంకుకు వెళితే పొద్దుపోయాక తిరిగివచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కష్టాలనుంచి గట్టెక్కేందుకు ఇబ్రహీంపూర్ గ్రామ ప్రజలు వినూత్నంగా ఆలోచించి నగదు రహితానికి శ్రీకారం చుట్టారు.
10 రోజుల్లో గుర్తింపు
గ్రామంలో 1219మంది జనాభా ఉన్నారు. వీరిలో 55 ఏండ్లలోపు వందశాతం అక్షరాస్యత కలిగి ఉన్నారు. 55 ఏండ్ల పైబడి ఉన్నవారు సైతం తమ పేరు రాసేలా, సంతకం పెట్టేలా శిక్షణ ఇచ్చారు. ఎంతమందికి బ్యాంకు అకౌంట్, ఎటిఎం కార్డులు అవసరమో యువకులు సర్వే నిర్వహించి గుర్తించారు. గ్రామంలో రైతులు, ఉపాధి కూలీలుసహా 800 వరకు అకౌంట్లు కలిగివున్నారు. కొత్తగా అవసరమున్నవారికి బ్యాంకు అధికారులను గ్రామానికి పిలిపించి కొత్తగా అకౌంట్ ప్రారంభించడంతో పాటు, రూపే కార్డులు అందచేశారు. 18 ఏండ్ల పైబడి వున్నవారందరికి 1048 మంది బ్యాంకు అకౌంట్లు, రూపే కార్డులు అందచేశారు. మరో వందమంది పిల్లలకు సైతం బ్యాంకు అకౌంట్లు తెరిచారు. గ్రామంలో 11 ప్రాంతాల్లో స్వైప్ మిషన్లు అందచేశారు. గ్రామస్తులకు రూపే కార్డు, మొబైల్ యాప్, క్యూఆర్ కోడ్ రూపంలో నగదు రహిత లావాదేవీలపై బ్యాంకర్లు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ముందుగా గ్రామ యువతకు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వగా వారు గ్రామస్తులందరికి అవగాహన కల్పించారు. దీంతో గ్రామంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే బాబుమోహన్ ఇబ్రహీంపూర్ గ్రామాన్ని నగదు రహితంగా అధికారికంగా ప్రకటించారు.
కొనుగోళ్లన్నీ నగదు రహితమే
గ్రామంలోని హోటళ్లు, కిరణాషాపులు, వాటర్‌ప్లాంట్లు, పిండిగిర్ని, డిష్‌బిల్లు, నల్లా బిల్లు, రేషన్‌షాపుల్లో ఏది కొనుగోలు చేసిన ప్రజల నగదు రహితంగా కార్డు రూపేణా చెల్లిస్తున్నారు. ఆటోలు సైతం నగదు రహితంగా క్యూఆర్, స్వైప్ ద్వాగా చెల్లించటం గమనార్హం. గ్రామంలోని రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకుల్లో స్వైప్ ద్వారా అందచేశారు. పెద్ద నగరాలకు, పట్టణాలకు సైతం సాధ్యం కాని నగదు రహిత లావాదేవీలను సులభంగా ఇబ్రహీంపూర్ గ్రామస్తులు సుసాధ్యం చేశారు.
స్వైప్ మిషన్లతో వ్యాపారం పెరిగింది
పెద్దనోట్ల రద్దుతో డబ్బులు, చిల్లర సమస్య నుండి గట్టెక్కించేందుకు నగదు రహితం ఏంతో దోహదం చేస్తుందని గ్రామ వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వైప్ మిషన్ల ద్వారా తమ వ్యాపారం పెరిగిందని వ్యాపారి కమటం సంధ్య వెల్లడించారు. కాగా గ్రామంలో వృద్ధులు నగదు రహిత లావాదేవీల పట్ల ఇబ్బందులు పడుతున్నారు. నగదు రహిత లావాదేవీల నిర్వహాణలో నెట్ సర్వర్ డౌన్ ఉండటం వల్ల కొంత మంది వ్యాపారులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెప్పారు. గ్రామంలో బిఎస్‌ఎన్‌ఎల్ ఉచితంగా వైపై సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లోనే తొలి డిజిటల్ గ్రామంగా విజయనగరం మండలంలోని ‘ద్వారపూడి’ గ్రామం వినుతికెక్కింది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయడంతో అక్షర జ్ఞానం లేకపోయినా ఆ గ్రామంలోని వారంతా నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లా కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామంలో పేద, మధ్య తరగతి, నిరుపేదలు ఎక్కువగా ఉన్నారు. వీరంతా పెద్దపెద్ద చదువులు చదివిన వారు కాదు. ఆర్థిక వ్యవహారాల్లో ఘనాపాటీలు కాదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో ఆరితేరినవారు కాదు. రోజువారీ కూలీలు, కార్మికులు.. అయితేనేం.... నగదు రహిత లావాదేవీల్లో అవలీలగా ముందంజ వేశారు.
ద్వారపూడిలో కిరాణా దుకాణం నుంచి ఏ వస్తువు కొనుగోలు చేసినా ఎటిఎం, డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు. రూపాయి ఖరీదు చేసే చాక్లెట్ నుంచి పెద్ద వస్తువుల వరకు ఇదే విధంగా కొనుగోళ్లు జరుపుతున్నారు. గ్రామంలో ఐదు ఇ-పోస్ (పాయింట్ ఆఫ్ సేల్స్) యంత్రాలు మంజూరు చేశారు. మరోపక్క బుడ్డి యాప్‌తో మరికొందరు నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా ఆ గ్రామంలో 13 కిరాణా దుకాణాలు, రెండు టైలర్ దుకాణాలు, ఒక సెలూన్, మినరల్ వాటర్, 15 మంది ఆటోడ్రైవర్లు, ఒక రేషన్ డిపోలో నగదు రహిత చెల్లింపులు జరుపుతున్నారు. ఈ విధంగా కిరాణా నుంచి మినరల్ వాటర్, బార్బర్ షాపు వరకు ఈ విధానం కొనసాగుతోంది. ఈ విధంగా తమ అవసరాలను నగదు రహిత లావాదేవీల ద్వారా జరుపుతూ డిజిటల్ విలేజి దిశగా అడుగులు వేశారు.
ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ గ్రామాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు దత్తత తీసుకున్న తరువాత గ్రామం రూపురేఖలు మారిపోయాయి. గ్రామంలో ఎక్కడ చూసిన సిమెంట్ రహదారులతో కళకళలాడుతోంది. గ్రామంలో ప్రభుత్వ నిధులతో సోలార్ పంపుసెట్ ఏర్పాటు చేశారు. మరోపక్క ఒడిఎఫ్ గ్రామంగా గుర్తింపు పొందింది. స్వచ్ఛ భారత్ అమలులో ముందంజలో ఉంది. ద్వారపూడిని డిజిటల్ విలేజిగా తీర్చిదిద్దడానికి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జెడ్పి సిఇఒ రాజకుమారి పలుమార్లు ఆ గ్రామాన్ని సందర్శించి అక్కడి ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఇంటింటికీ నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించేందుకు జెఎన్‌టియు ఇంజనీరింగ్ విద్యార్థులను, డిజిటల్ అక్కలు, డిజిటల్ అన్నలు పేర్లతో కొంతమంది వాలంటీర్లను వినియోగించి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ విధమైన కసరత్తు అనంతరం ప్రజలు నగదు రహిత లావాదేవీలకు ముందుకు వచ్చారు. మరోపక్క నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు అదే గ్రామంలో చదువుతున్న పిల్లలతో తల్లిదండ్రులకు, పొరుగు ఇంటి వారికి అక్షర జ్ఞానం నేర్పిస్తున్నారు. ఇందుకోసం ‘చిట్టి గురువులు’ అనే కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ విధంగా ఆ గ్రామంలో ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి అధికారులు, విద్యార్థులు, సిబ్బంది ఎంతగానో కృషి చేశారు.
అక్షరాస్యత 55.14 శాతం
ప్రస్తుతం ద్వారపూడిలో 977 కుటుంబాలు, 807 గృహాలు ఉన్నాయి. అక్షరాస్యత 55.14 శాతం. పురుషులలో 64.55%, మహిళల్లో 46.09%గా నమోదైంది.
డిజిటల్ కొనుగోళ్లకు శ్రీకారం
తాను దత్తత తీసుకున్న గ్రామంలో కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు తన మొబైల్ ద్వారా వస్తువులను కొనుగోలు చేసి డిజిటల్ కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. ఆ తరువాత జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తన మొబైల్ ద్వారా కిరాణా కొనుగోలు చేశారు. దీంతో ఆ గ్రామంలో సామాన్యులు తమ ఎటిఎం కార్డులను తీసుకువచ్చి తమకు అవసరమైన వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఎటిఎం కార్డులు లేని వారు తమ మొబైల్ ద్వారా బడ్డి యాప్ నుంచి కొనుగోలు చేసే విధంగా అక్కడి జనానికి అవగాహన కల్పించారు.
ఇంట్లోనే బ్యాంకులా ఉంది
ఇపుడు ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా డబ్బులు ఎక్కడ పెట్టామో వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా పోయందని టి.జయ అనే గృహిణి సంతోషం వ్యక్తం చేస్తోంది. కార్డుల ద్వారా మినరల్ వాటర్ సరఫరా చేయడం వల్ల చిల్లర ఇబ్బందులు తొలిగిపోయాయని మినరల్ వాటర్ యజమాని నరసింగరావు వ్యాఖ్యానించాడు.
అద్దె తగ్గించాలి
ఇ-పోస్ యంత్రాల నెలసరి అద్దె రూ.250 చెల్లించాలంటే కష్టంగా ఉందని కిరాణ యజమాని సూరిబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం నెలసరి అద్దె లేకుండా చూస్తే బాగుంటుందని, వచ్చిన లాభం నుంచి అద్దె కింద చెల్లిస్తే ఇక మాకేమి మిగులుతుందని ప్రశ్నించాడు. చాక్లెట్లు, బిస్కట్లు, చిల్లర సామాన్లు అమ్ముకున వాళ్లకు అద్దె లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశాడు. ఎటిఎం కార్డుల ద్వారా కొనుగోలు చేసేవారిలో విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారని మరో దుకాణం యజమాని మురళి తెలిపాడు. ఈ విధానం వల్ల మాకు ఇబ్బంది ఏమి లేదనీ, పట్టణం దగ్గరగా ఉండటంతో ఎక్కువ మంది పెద్ద మొత్తంలో అక్కడినుంచే సరకులు కొనుగోలు చేస్తున్నారనీ వాపోయాడు.

నగదురహిత గ్రామాల జాబితాలో ఇర్కోడ్, తోర్నాల

సిద్దిపేట మండలంలోని మరో రెండు గ్రామాలు ఇర్కోడ్, తోర్నాల గ్రామాలు నగదురహిత గ్రామాల జాబితాలో చేరాయ. గ్రామాల్లో అధికారులు, బ్యాంకర్లు సర్వే చేసి బ్యాంకు ఖాతాలు, రూపేకార్డులు అందించారు. గ్రామంలోని కిరాణ, ఇతర దుకాణాలకు అవసరమైన 25 స్వైప్‌మిషన్లు అందించారు. ఆటోలకు క్యూఆర్ పద్ధతితో లావాదేవీలు చేస్తున్నారు. ఇర్కోడ్ సర్పంచ్ విజయ, తోర్నాల సర్పంచ్ పరమేశ్వర్లు చేసిన కృషిని మంత్రి హరీశ్‌రావు అభినందించారు.

మంత్రి హరీశ్‌రావు ప్రోత్సాహం, గ్రామంలోని అన్ని వర్గాల సమష్టి కృషివల్లే ఈ ఘనతను సాధించాం.
రాష్ట్రానికే నమూనాగా నిలిచాం. జాతీయస్థాయిలో అవార్డునూ దక్కించుకున్నాం. క్యాష్‌లెస్ గ్రామంగా
దేశంలోనే గుర్తింపు పొందడం గర్వకారణంగా ఉంది.
- సర్పంచ్ కుంబాల లక్ష్మి

- ఆకుల పాండురంగము, సిద్దిపేట, సెల్ నెం. 9440495057

- బొండా రామకృష్ణ, విజయనగరం, 9440332244

- ఆకుల పాండురంగము, - బొండా రామకృష్ణ