క్రీడాభూమి

ఆసిస్ దూకుడు.. డే/నైట్ టెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభిమానులను అలరించిన క్రికెట్ * వీడ్కోలు - 2015
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ప్రపంచ క్రికెట్ ఈఏడాది అభిమానులను అలరించింది. ఆస్ట్రేలియా దూకుడును కొనసాగించి ప్రపంచ కప్‌ను రికార్డు స్థాయిలో ఐదోసారి కైవసం చేసుకోగా, 138 సంవత్సరాల టెస్టు చరిత్రలో మొట్టమొదటిసారి డే/నైట్ మ్యాచ్ జరిగింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)లో శ్రీనివాసన్ శకం ముగిసింది. బంగ్లాదేశ్ క్రికెట్ గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యుత్తమ ప్రదర్శనతో రాణించింది. 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై ఆర్‌ఎం లోధా ఆధ్వర్యంలో సుప్రీం కోర్టు నియమించిన కమిటీ రెండేళ్ల నిషేధాన్ని విధించింది. దీనితో రెండేళ్లపాటు వాటి స్థానాన్ని భర్తీ చేయడానికి రాజ్‌కోట్, పుణె జట్లు తెరపైకి వచ్చాయి. రాజస్థాన్ సహ భాగస్వామి రాజ్ కుంద్రా, చెన్నై మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గురునాథ్ మెయప్పన్‌లపై జీవితకాల సస్పెన్షన్ వేటు పడింది. పలువురు క్రికెటర్లు అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పారు.
విశ్వ విజేత ఆస్ట్రేలియా
డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ టైటిల్‌ను నిలబెట్టుకోవడంలో విఫలంకాగా, ఆస్ట్రేలియా ఐదోసారి విశ్వవిజేతగా అవతరించింది. ఈ పోటీలకు ఆసీస్, న్యూజిలాండ్ దేశాలు ఆతిథ్యమివ్వగా, ఆ రెండు జట్లే ఫైనల్ చేరుకోవడం విశేషం. మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో, కిక్కిరిసిన ప్రేక్షకుల సమక్షంలో జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తుచేసింది. గత ఏడాది షీఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ ఆడుతూ సీన్ అబోట్ వేసిన బౌన్సర్‌ను సరిగా అర్థం చేసుకోలేక గాయపడి, ఆతర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వెస్టర్న్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఫిల్ హ్యూస్‌కు వరల్డ్ కప్ ట్రోఫీని అంకితమిస్తున్నట్టు మైఖేల్ క్లార్క్ బృందం ప్రకటించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌ను అందించిన క్లార్క్ ఆతర్వాత వైఫల్యాల కారణంగా విమర్శలకు గురై, చివరికి రిటైర్మెంట్ ప్రకటించాల్సి రావడం విచిత్రం.
కొత్త అధ్యాయం
టెస్టు క్రికెట్‌లో కొత్త అధ్యాయం మొదలైంది. మొట్టమొదటి సారి డే/నైట్ టెస్టు మ్యాచ్ అడెలైడ్ ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది. కివీస్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించిన ఆస్ట్రేలియా తొలి డే/నైట్ టెస్టును గెల్చుకొని చరిత్ర పుటల్లో స్థానం సంపాదించింది.
చేదు అనుభవం..
దక్షిణాఫ్రికా జట్టుకు భారత్‌లో చేదు అనుభవం ఎదురైంది. టి-20, వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌లను కైవసం చేసుకున్న ఆ జట్టు నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 0-3 తేడాతో చేజార్చుకుంది. తొమ్మిదేళ్ల కాలంలో ఆ జట్టు విదేశాల్లో టెస్టు సిరీస్‌ను కోల్పోవడం ఇదే మొదటిసారి.
డివిలియర్స్ విశ్వరూపం
దక్షిణాఫ్రికా వనే్డ జట్టు కెప్టెన్ ఎబి డివిలియర్స్ ఈఏడాది అసాధారణ ప్రతిభ కనబరిచాడు. వనే్డల్లో అత్యంత వేగవంతమైన అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. అదే ఫామ్‌ను కొనసాగిస్తూ ఫాస్టెస్ట్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. అతి తక్కువ బంతుల్లో 150 పరుగుల మైలురాయిని చేరిన బ్యాట్స్‌మన్‌గా మరో రికార్డు నెలకొల్పాడు. టి-20 ఫార్మెట్‌లోనూ అతను తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిచాడు. 20 మ్యాచ్‌లు ఆడిన అతను 79.53 సగటుతో మొత్తం 1,193 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 162 (నాటౌట్).
పసికూన విజృంభణ
పసికూన జట్టు బంగ్లాదేశ్ ఈఏడాది అనూహ్యంగా విజృంభించింది. స్వదేశంలో పాకిస్తాన్, భారత్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్లను ఓడించి సత్తా చాటింది. వనే్డ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన 30 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఈ జట్టు స్వదేశంలో తమకు తిరుగులేదని నిరూపించింది. రెండుసార్లు ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న భారత్‌ను, 1992లో వరల్డ్ కప్‌ను గెల్చుకున్న పాకిస్తాన్‌తోపాటు అత్యంత పటిష్టమైన దక్షిణాఫ్రికాను కూడా ఓడించిన బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. టెస్టు హోదా ఉన్న జింబాబ్వేను కూడా ఈ చిరుజట్టు ఓడించింది. తనకు ఉజ్వల భవిష్యత్తు ఉందని నిరూపించింది.
ఇంగ్లాండ్‌కే యాషెస్
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్‌కు టెస్టు క్రికెట్‌లో అత్యున్నత స్థానం ఉంది. అంతకు ముందు ఆస్ట్రేలియా వెళ్లి, అక్కడ చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్ స్వదేశంలో చెలరేగింది. ఆసీస్‌ను 5-0 తేడాతో ఓడించి, 1896 తర్వాత మొదటిసారి అంత భారీ విజయాన్ని అందుకుంది.
22 ఏళ్ల తర్వాత..
భారత జట్టు 22 సంవత్సరాల తర్వాత శ్రీలంక జట్టును భారత్ వారి సొంత గడ్డపైనే ఓడించింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ని చేజార్చుకొని 0-1 తేడాతో వెనుకబడినప్పటికీ, ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయభేరి మోగించి, సిరీస్‌ను సొంతం చేసుకుంది. 1993 తర్వాత శ్రీలంకపై లంకలోనే భారత్ టెస్టు సిరీస్‌ను గెల్చుకోవడం ఇదే మొదటిసారి. రవిచంద్రన్ అశ్విన్ 21 వికెట్లు పడగొట్టి, ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు.
రిటైర్మెంట్లు
పలువురు ప్రముఖ క్రికెటర్లు ఈఏడాది రిటైర్మెంట్లు ప్రకటించారు. ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్‌ను అందించిన మైఖేల్ క్లార్క్ (అన్ని ఫార్మెట్స్ నుంచి), బ్రాడ్ హాడిన్ (అన్ని ఫార్మెట్స్ నుంచి), షేన్ వాట్సన్ (టెస్టు క్రికెట్ నుంచి), క్రిస్ రోజర్స్ (టెస్టు ఫార్మెట్ నుంచి), ర్యాన్ హార్ (అన్ని ఫార్మెట్స్ నుంచి), ఇయాన్ బెల్ (వనే్డల నుంచి), క్రెగ్ కీస్వెటర్ (అన్ని ఫార్మెట్స్ నుంచి), మిస్బా ఉల్ హక్ (వనే్డల నుంచి), షహీద్ అఫ్రిదీ (టెస్టు, వనే్డ ఫార్మెట్స్ నుంచి), కుమార సంగక్కర (అన్ని ఫార్మెట్స్ నుంచి), మహేల జయవర్ధనే (అన్ని ఫార్మెట్స్ నుంచి), జహీర్ ఖాన్ (అన్ని ఫార్మెట్స్ నుంచి), వీరేందర్ సెవాగ్ (అన్ని ఫార్మెట్స్ నుంచి) రిటైరయ్యారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ తర్వాత రిటైర్ అవుతున్నట్టు న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ ప్రకటించాడు.
పాక్‌కు నిరాశే
స్వదేశంలో సిరీస్‌ల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పాకిస్తాన్‌కు నిరాశ తప్పలేదు. 2009లో శ్రీలంక క్రికెటర్లపై లాహోర్‌లో ఉగ్రవాదులు దాడి చేసిన నాటి నుంచి పాక్‌లో ఏ జట్టూ పర్యటించలేదు. ఫలితంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో ఆ జట్టు హోం సిరీస్‌లు ఆడుతున్నది. విదేశీ క్రికెటర్లు తమ దేశంలో క్రికెట్ ఆడడానికి వెనుకాడాల్సిన అవసరం లేదని, అత్యంత కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తామని నిరూపించుకోవడానికి తొలుత కెన్యా జట్టును అనధికార వనే్డ సిరీస్‌కు ఆహ్వానించింది. ఆతర్వాత టెస్టు హోదాగల జింబాబ్వే కూడా పాక్‌లో పర్యటించింది. ఈ రెండు సిరీస్‌లు విజయవంతంగానే పూర్తయినప్పటికీ పాక్‌లో సిరీస్‌ల కోసం ఎవరూ ఆసక్తిని ప్రదర్శించకపోవడం గమనార్హం.
భారత్‌తో ఈఏడాది జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చేయని ప్రయత్నం లేదు. చివరి క్షణం వరకూ విరామం లేకుండా కృషి చేసింది. బిసిసిఐ విధించిన షరతులకు అంగీకరించింది. కానీ, భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో, ఈ సిరీస్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
మళ్లీ మనోహర్
బిసిసిఐ అధ్యక్ష పదవిని శశాంక్ మనోహర్ రెండోసారి చేపట్టాడు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని వదులుకోవడం లేదా బోర్డు అధ్యక్ష పదవికి పోటీ చేయడం అనే రెండు అంశాల్లో ఒకదానిని ఎంచుకోవాల్సి రావడంతో శ్రీనివాసన్ కంగుతిన్నాడు. చివరికి బిసిసిఐ అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా, తనకు అనుకూలుడైన జగ్మోహన్ దాల్మియాను గెలిపించుకున్నాడు. అయితే, గుండెపోటుతో దాల్మియా మృతి చెందడంతో అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరగ్గా, తన వర్గానికి చెందిన వ్యక్తిని పోటీకి నిలబెట్టేందుకు శ్రీని ప్రయత్నించాడు. కానీ, ఎవరూ ముందుకు రాలేదు. మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్ పదవిని కూడా శ్రీని కోల్పోయాడు. అతని స్థానంలో మనోహర్ ఐసిసి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. మొత్తం మీద బిసిసిఐలో శ్రీని శకానికి తెరపడింది.
** ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ ట్రోఫీతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు **