క్రైమ్ కథ

చౌకబేరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోటల్ గదిలో దిగాక రసెల్ గడ్డం గీసుకుని స్నానం చేసాడు. తర్వాత లాంజ్‌లోకి వెళ్లి కూర్చుని ఏం చేయాలా అని ఆలోచించాడు. వెయిటర్ని తన దగ్గరికి రమ్మని సౌంజ్ఞ చేసి పింక్ జిన్‌ని ఆర్డర్ చేశాడు. అది తాగుతూంటే రసెల్ దృష్టి లాంజ్‌లోని ఓ షాప్ బయట ఉన్న బోర్డ్ మీద పడింది. గ్రాండ్ హోటల్ లాంజ్‌లో రెయిడ్స్ బేంక్ బ్రాంచ్ పని చేస్తోందని గ్రహించాక అతనికి చూచాయగా ఓ ఆలోచన కలిగింది. పింక్ జిన్ తాగుతూ తన పదునైన మెదడుతో ఆలోచించసాగాడు.
చివరికి అతను లేచి గ్రిల్ రూంలోకి వెళ్లి వొంటరిగా లంచ్ చేసాడు. పావుతక్కువ మూడుకి బిల్ మీద సంతకం చేసి లేచి ఆ బేంక్‌లోకి వెళ్లాడు.
‘మీ బ్రాంచ్‌లో నేను అకౌంట్ తెరవాలని వచ్చాను. లండన్ నగరంలో ఐదు వందల పౌన్లు దగ్గర ఉంచుకుని తిరగడం ప్రమాదం. మీకు అవసరమైన రిఫరెన్స్‌లని ఇవ్వగలను. ఇరవై పౌన్లు ఉంచుకుని మిగిలింది డిపాజిట్ చేస్తాను. నాకు చెక్‌బుక్ కావాలి’ మేనేజర్‌తో చెప్పాడు.
ఆ బ్రాంచ్ మేనేజర్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి అతని అకౌంట్‌ని తెరిచాక రసెల్ బయటకి రాగానే మూడుకి ఆ బ్రాంచ్‌ని మూసి బయట తాళం వేశాడు. తన పథకంలోని మొదటి అధ్యాయం విజయవంతమైందని రసెల్ అనుకున్నాడు.
హోటల్‌లోంచి బయటకి వచ్చి సమీపంలోని బాండ్ స్ట్రీట్‌కి కాలి నడకన చేరుకున్నాడు. బ్రౌన్స్ బంగారు నగల దుకాణం చూసి ఆగేసరికి మూడున్నరైంది. లోపలకి వెళ్లగానే దాని మేనేజర్ జాన్‌ని చూసి అడిగాడు.
‘గుడ్‌మార్నింగ్. మీరు మాంఛెస్టర్ బ్రాంచ్‌లో పనిచేశారు కదా? అక్కడ మిమ్మల్ని చూసిన గుర్తు’
‘అవును. బయటికి వెళ్తున్నాను. ఏమీ అనుకోకండి’ చెప్పి జాన్ బయటకి వెళ్లిపోయాడు.
‘మీకేం సహాయం చేయగలను?’ ఓ సేల్స్ మేన్ రసెల్‌ని మర్యాదగా పలకరించి అడిగాడు.
‘నాకు వజ్రాలు పొదిగిన లేడీస్ చేతి గడియారం కావాలి’
‘తప్పకుండా సర్. ఇటు రండి’
అతను అలాంటి ఖరీదైన కొన్ని వాచీలని చూపించాడు. రసెల్ ఓ దాన్ని చూపించి అడిగాడు.
‘ఇది బావుంది. ఎంత?’
‘మూడు వందల ఏభై పౌన్లు’
‘సరే. మీకు చెక్ ఇస్తాను. ఇవాళ ఆమె పుట్టిన రోజు కాబట్టి ఇవాళే దీన్ని ఇవ్వాలి’
వెంటనే సేల్స్‌మేన్ మొహంలో కొంత వెలుగు తగ్గింది.
‘ఈ ప్రశ్న అడుగుతున్నందుకు దయచేసి ఏం అనుకోకండి. గతంలో మీరు మా దగ్గర ఏమైనా చెక్ ఇచ్చి కొన్నారా?’
‘లేదు. మాంఛెస్టర్ బ్రాంచ్‌లో నగదు ఇచ్చి కొన్నాను’
‘ఐతే మీకు తెలిసిన, మాకు తెలిసిన వారి రిఫరెన్స్ ఇవ్వగలరా?’
‘నాకు గ్రాండ్ హోటల్‌లోని రెయిడ్స్ బేంక్ బ్రాంచ్‌లో ఎకౌంట్ ఉంది. నేను ఉండేది ఆ హోటల్లోనే. ఆ హోటల్ వాళ్లకి నేను తెలీదు’
‘కాని మాకు తెలిసిన వారు మీ గురించి చెప్పాలి సర్. అదీ నియమం. నేనా బ్రాంచ్‌కి ఫోన్ చేసి మేనేజర్ని మీ గురించి అడగచ్చా?’
‘మూడుకి బ్రాంచ్ మూసేస్తారు. మళ్లీ రేపు కాని తెరవరు. మీ మేనేజర్ జాన్ బ్లెయిర్ నాకు బాగా పరిచయం’
‘ఓ! ఆయన మీకు తెలుసా?’
‘తెలుసు. 444 అప్పర్ డ్రైవ్‌లో ఉంటున్నాడు. అతని కొడుకు హెన్రీ. కూతురు మిల్‌డ్రోక్. భార్య ఏన్. జాన్ మాంఛెస్టర్ నించి ఇక్కడికి బదిలీ అయ్యాడు. మీ మాంఛెస్టర్ బ్రాంచ్‌లో కస్టమర్‌గా నేను ఆయనకి పరిచయం. ఇందాక పలకరించడం చూడలేదా?’
ఆ సేల్స్‌మేన్ మొహంలోకి మళ్లీ వెలుగు ప్రవేశించింది.
‘ఐతే సరే సర్’
ఆ షాప్ పేరు మీద చెక్ రాసిచ్చి ఆ వాచ్‌తో రసెల్ బయటకి వచ్చి, పక్కనే ఉన్న లెవిన్‌సన్స్ అనే తాకట్టు దుకాణానికి వెళ్లాడు. ఆ వాచీని చూపించి అడిగాడు.
‘దీన్ని అమ్మడానికి వచ్చాను. ఎంత ఇవ్వగలరు?’
లెవెన్సన్ దాన్ని పరిశీలించాక అడిగాడు.
‘ఎంత కావాలి?’
‘రెండు వందల ఏభై పౌన్లు’
‘రెండు వందలు’
‘దీనికి నేను మూడు వందల ఏభై పౌన్లు చెల్లించాను’
‘కావచ్చు. కాని నేను లాభానికి ఈ వ్యాపారం చేస్తున్నాను. రెండు వందల పౌన్లు మించి ఇవ్వలేను’ లెవిన్సన్ చెప్పాడు.
‘సరే’
ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని డబ్బుతో రసెల్ వెళ్లాక లెవిన్సన్ ఆ పెట్టెలోని రసీదుని చూశాడు. దాన్ని అప్పుడే బ్రౌన్స్‌లో మూడు వందల ఏభై పౌన్లకి కొన్నాడని, అదీ చెక్‌తో అని అర్థమైంది. వెంటనే తన బాధ్యతగా బ్రౌన్స్ నగల దుకాణానికి ఫోన్ చేశాడు. లెవిన్సన్ ఆ పని చేస్తాడని కావాలని ఆ వాచీ బిల్‌ని పెట్టెలో ఉంచిన రసెల్‌కి తెలుసు. తర్వాతి కదలిక మేనేజర్ జాన్ నించి వస్తుందని కూడా ఊహించాడు.
మేనేజర్ జాన్ లంచ్ తిని మళ్లీ నగల దుకాణానికి వచ్చాక సేల్స్‌మేన్‌ని అడిగాడు.
‘అంతా ఓకేనా?’
‘ఓకే సర్. నిన్న వచ్చిన వజ్రాల వాచీని అమ్మాను’
‘ఎవరికి?’
‘మీ స్నేహితుడికి సర్’ సేల్స్‌మేన్ జవాబు చెప్పాడు.
‘నా మిత్రుడా? ఎవరతను?’
‘రసెల్ సర్’
‘రసెల్ అనే స్నేహితుడు ఎవరూ నాకు లేరే?’
‘మీరు బయటికి వెళ్తూంటే అతను మిమ్మల్ని పలకరించడం, మీరు కూడా మాట్లాడటం చూశాను. చెక్ ఇచ్చినప్పుడు రిఫరెన్స్ అడిగితే మీ పేరు చెప్పాడు’ అతను ఆందోళనగా చెప్పాడు.
‘మూర్ఖుడా! వాడెవడో నాకు తెలీదు. ఏదో మాటలు కలిపాడంతే. అడ్రస్ రాసుకున్నావా?’
‘ఆ. గ్రాండ్ హోటల్లో రూం నెం.414’
ఫోన్ మోగింది. పక్క షాప్‌లోని లెవెన్సన్ నించి. అతను చెప్పేది విని ‘్థంక్స్’ చెప్పి రిసీవర్ పెట్టేసి జాన్ కోపంగా చెప్పాడు.
‘వాడు దొంగ. పోలీసులకి ఫోన్ చెయ్యి. అది చెల్లని చెక్. ఆ వాచీని లెవెన్సన్‌లో అమ్మి, రెండు వందల పౌన్లు తీసుకున్నాడట. వాడు వెళ్లి ఎంతసేపైంది?’
‘ఇరవై నిమిషాలు’
పోలీసులు నాలుగు నిమిషాల్లో వచ్చారు. జరిగింది జాన్ వాళ్లకి ఫిర్యాదు చేశాడు.
‘మూడు వందల ఏభై పౌన్లకి వాచీని కొని ఏ వెధవైనా రెండు వందలకి అమ్ముతాడా? వాడు దొంగ. ఇది చెల్లని చెక్. వాడు గ్రాండ్ హోటల్‌లో బస చేయడం అబద్ధం’
‘సరే. ముందుగా మేము మా విచారణని గ్రాండ్ హోటల్లో మొదలెడతాం’
‘నేనూ మీతో వస్తాను’ జాన్ చెప్పాడు.
అంతా పోలీస్ కార్లో గ్రాండ్ హోటల్‌కి చేరుకున్నారు. తమ హోటల్‌లో బస చేసిన అతిథి గురించి పోలీసులు విచారించడం అదే మొదటిసారి కాబట్టి రిసెప్షనిస్ట్ కొద్దిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అందులో గౌరవనీయమైన వారే బస చేస్తారు.
‘రసెల్ అన్నారా? అతను గదిలో ఉన్నాడేమో చూస్తాను’ రిసెప్షనిస్ట్ రిసీవర్ అందుకుంటూ చెప్పాడు.
‘అతను ఈ హోటల్లో నిజంగా బస చేస్తున్నాడా?’ జాన్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘అవును సర్’
అతను రసెల్ గదికి డయల్ చేసి, అవతలి వైపు నించి చెప్పేది విన్నాక పోలీసులతో చెప్పాడు.
‘గదిలో ఉన్నాడు సర్. వస్తున్నాడు’
పోలీసులు వెంటనే లిఫ్ట్ దగ్గర, సర్వీస్ మెట్ల దగ్గర కాపున్నారు.
కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన రసెల్ అడిగాడు.
‘హలో మిస్టర్ జాన్. ఏమిటి పోలీసులతో వచ్చారు?’
‘మీరేనా రసెల్?’ ఇన్‌స్పెక్టర్ ప్రశ్నించాడు.
‘అవును. నా కోసం ఎందుకు వచ్చారు?’ రసెల్ ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు.
‘మీరు వీరి షాప్‌లో వాచీని ఇందాక కొన్నారా?’
‘అవును. ఏం?’
‘ఈ చెక్ మీరే ఇచ్చారా?’
‘అవును. ఐతే?’ దాన్ని చూసి రసెల్ అడిగాడు.
‘మీ అకౌంట్లో డబ్బుందా?’ ఇన్‌స్పెక్టర్ గద్దిస్తూ అడిగాడు.
‘ఉంది. లేదని మీకు ఎవరు చెప్పారు?’
‘నేనే’ జాన్ కోపంగా చెప్పాడు.
‘అది మీకెలా తెలుసు?’
‘ఊహించాను. దొంగ చెక్ ఇచ్చి కొన్న వాచీని మీరు లెవెన్సన్‌లో రెండు వందలకి అమ్మారు’
‘అవును. అది నేరమా?’
‘కాదు. కాని దొంగ చెక్ ఇచ్చి ఆ వాచీని కొట్టేసి, దాన్ని అమ్మి సొమ్ము చేసుకున్న దొంగ మీరు’
వెంటనే రసెల్ మొహంలో బాధ తొంగి చూసింది.
‘మీరు నా మీద ఇలా ఊహాగానాలు చేయడం సబబుగా లేదు. ఊహాపోహలతో పోలీసులని పిలవడం నాకు అసలు నచ్చలేదు. రేపు బేంక్ తెరిచాక నా చెక్ కేష్ అవుతుంది. నా వ్యక్తిగత చర్యల మీద ఎవరూ గూఢచర్యం చేయడం నాకు ఇష్టం లేదు. నేను మూడు రోజులు ఇదే హోటల్లో నా కొత్త బ్రాంచ్ తెరవడానికి మూడు వేల చదరపు అడుగుల ఆఫీస్‌ని అద్దెకి తీసుకునే పని మీద ఉంటాను. రేపు చెక్ కేష్ కాకపోతే అప్పుడు మళ్లీ అంతా రండి’
ఇన్‌స్పెక్టర్ మఫ్టీలోని కానిస్టేబుల్‌ని మర్నాడు ఉదయం దాకా అక్కడ కాపలా ఉంచాడు. రసెల్ గది ఖాళీ చేసే పక్షంలో లేది సామానుతో వెళ్లిపోయే పక్షంలో తనకి వెంటనే ఫోన్ చేయమని కూడా రిసెప్షనిస్ట్‌ని కోరాడు.
జాన్‌కి అతనికి క్షమాపణ చెప్పాలో లేదో కూడా తెలీలేదు. చెప్పాలనిపించలేదు.
‘రేపు ఉదయం పోలీసుస్టేషన్లో కలుద్దాం’ చెప్పి వెళ్లిపోయాడు.
అతను రాత్రి గదిని ఖాళీ చేద్దామని రిసెప్షనిస్ట్ దగ్గరకి వెళ్లాడు. కాని మఫ్టీలోని కానిస్టేబుల్ అతనా పని చేస్తే తన వెంట పోలీసుస్టేషన్‌కి వచ్చి ఆ రాత్రి సెల్లో గడపాలని హెచ్చరించడంతో విరమించుకున్నాడు.
మర్నాడు ఉదయం జాన్ స్వయంగా బేంక్ తెరిచే సమయానికి గ్రాండ్ హోటల్‌లోని రెయిడ్స్ బేంక్ బ్రాంచికి ఆ చెక్‌తో వచ్చాడు.
ఆశ్చర్యంగా తగిన నిలవ వుండి ఆ చెక్ కేష్ అయింది. జాన్‌కి తనో విలువైన కస్టమర్ని అనుమానించానని అనిపించింది. అతనికి క్షమాపణ చెప్పాలని అతని గదిలోకి రావడానికి అనుమతి కోసం రిసెప్షన్ నించి ఫోన్ చేస్తే రసెల్ బాధగా చెప్పాడు.
‘దయచేసి రాకండి. అది ఫోన్‌లో చెప్తే చాలు. ఇంకెప్పుడూ మీ షాప్‌కి రాను’
‘వెరీ సారి. మా షాప్‌లోకి మీకు సదా స్వాగతం’ జాన్ కూడా బాధగా చెప్పాడు.
* * *
మర్నాడు మధ్యాహ్నం జాన్ ఎప్పటిలా లంచ్‌కి వెళ్లినప్పుడు సేల్స్‌మేన్ లోపలకి వచ్చే రసెల్‌ని చూసి మర్యాదగా ఆహ్వానించాడు.
‘జరిగిందానికి సారీ సర్. మేనేజర్ బయటకి వెళ్లారు’
‘నేను వచ్చింది అతని కోసం కాదు. వెయ్యి పౌన్లకి వచ్చే వజ్రాల హారం కొనాలని వచ్చాను. ఉన్నాయా?’
‘చాలా మోడల్స్ ఉన్నాయి సర్’
ఐదు నిమిషాల్లో రసెల్ వెయ్యి పౌన్లు, పనె్నండు వందల పౌన్ల ధరకి రెండు గొలుసులు కొని చెక్ రాస్తూ అడిగాడు.
‘మీకు రిఫరెన్స్‌గా మీకు తెలిసిన ఎవరి పేరు, చిరునామా చెప్పాలి?’
‘అబ్బే! పాత కస్టమర్లకి ఆ అవసరం లేదు సర్’ సేల్స్‌మేన్ చెప్పాడు.
చెక్ ఇచ్చి ఆ రెండు గొలుసులతో రసెల్ బయటకి నడిచాడు. జాన్ లంచ్ నించి తిరిగి వచ్చాక సేల్స్ మేన్ జరిగింది చెప్పాడు.
‘మంచి పని చేసావు. నేను క్షమాపణ చెప్పబట్టి వచ్చినట్లున్నాడు’
మర్నాడు ఆ చెక్‌తో బేంక్‌కి వెళ్లిన జాన్‌కి రసెల్ ఎకౌంట్‌లో కేవలం నూట ముప్పై పౌన్లు మాత్రమే ఉన్నాయని, అతను హోటల్‌ని గంట క్రితమే ఖాళీ చేసి వెళ్లిపోయాడని తెలిసాక కాని రసెల్ తనని ఎలా బోల్తా కొట్టించాడో అర్థం కాలేదు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి