క్రైమ్/లీగల్

లోక్‌సభ ఎన్నికలు సజావుగా జరిగాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పదిహేడో లోక్‌సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా తమ సమాధానం పంపించాలని సుప్రీం కోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఇంతకు ముందు 17వ లోక్‌సభ ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి విచారణ చేపడతామని చెప్పడం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో అవతవకలు జరిగాయని తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యురాలు మహువా మొయిత్రీ కూడా పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. 17వ లోక్‌సభ ఎన్నికల్లో ఎంత మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు?, ఓట్ల లెక్కింపులో ఎన్ని ఓట్లు లెక్కకు వచ్చాయనే వివరాలు వెల్లడించాలని మహువా మొయిత్రీ తమ పిటిషన్‌లో కోరారు. సుప్రీం కోర్టు ఇప్పుడు మహువా మొయిత్రీ, అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ దాఖలు చేసిన పిటిషన్లపై సంయుక్త విచారణ జరుపుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు వారాలలోగా కౌంటర్ దాఖలు చేసిన అనంతరం ఈ కేసుపై విచారణ జరుగుతుంది. 17వ లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై వెంటనే విచారణ జరపాలని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సోమవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డెకు విజప్తి చేశారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన సమాచారంలో పలు వ్యత్యాసాలున్నాయి, కేంద్ర ఎన్నికల సంఘానికి గత డిసెంబర్‌లో నోటీసు జారీ అయినా ఇంత వరకు తమ సమాధానాన్ని దాఖలు చేయలేదని ప్రశాంత్ భూషణ్ ప్రధాన న్యాయమూర్తి బాబ్డె ముందు వాదించారు. పోలింగ్ ముగిసిన అనంతరం దాదాపు ఒక సంవత్సరం వరకు వీవీపీఏటిలను కేంద్ర ఎన్నికల సంఘం భద్రం చేసి పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇటీవల దాఖలైన ఒక ఆర్‌టీఐ పిటిషన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సమాదానంలో వీవీపీఏటిలని ఇప్పటికే ధ్వంసం చేసినట్లు వెల్లడైందని ప్రశాంత్ భూషన్ కోర్టుకు వివరించారు. వీవీపిపీఏటిలను ఓట్ల లెక్కింపు జరిగిన అనంతరం కొన్ని నెలలకే ధ్వంసం చేశారని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. వీవీపీఏటిలను ఒక సంవత్సరం పాటు భద్ర పరచాలని ఏ నియమం సూచిస్తోందని ప్రధాన న్యాయమూర్తి బాబ్డె అడిగిన ప్రశ్నకు ప్రశాంత్ భూషణ్ వివరణ ఇస్తూ ఎన్నికల నియమావళిలోని 94లో నియమం ప్రకారం ఓట్ల లెక్కింపు జరిగిన అనంతరం ఒక సంవత్సరం వరకు వీవీపీఏటిలను భద్ర పరచాల్సి ఉన్నదని సూచించారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ దాఖలు చేసిన పిటిషన్‌లోని అంశాలకు ప్రశాంత్ భూషణ్ ప్రస్తావిస్తున్న అంశానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది స్పష్టం చేశారు. తమ పిటిషన్ దాఖలు చేసిన తరువాత వెలుగులోకి వచ్చిన అంశాలను కోర్టు దృష్టికి తెస్తున్నానని ప్రశాంత్ భూషణ్ వివరించారు. తాము 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను సవాల్ చేయటం లేదు అయితే ఎన్నికల ఫలితాలు ప్రకటించే ముందే ఓటింగ్‌కు సంబంధించిన సమాచారంలో తలెత్తిన వ్యత్యాసాలపై వివరణ ఇవ్వాలని మాత్రమే తాము కోరుతున్నామని ప్రశాంత్ భూషన్ వాదించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్చగా జరగాలన్నది తమ వాదన అని ఆయన చెప్పారు. పోలింగ్‌కు సంబంధించిన సమాచారంలోని వ్యత్యాసాలను సవరించకుండా తుది ఫలితాలను ప్రకటించటం సమర్థనీయం కాదని ప్రశాంత్ భూషణ్ వాదించారు.