క్రైమ్ కథ

రాంగ్ నంబర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్లారా పోయాక మైక్ ఆ టెలీఫోన్ కంపెనీ ప్రెసిడెంట్‌కి సంబంధించిన సమాచారాన్ని సేకరించసాగాడు. హోవార్డ్ గురించి అవసరమైనంత తెలుసుకున్నాక, వాటిలో తనకి పనికొచ్చేవి మూడే అని గ్రహించాడు. హోవార్డ్ చిరునామా, అతను వదలకుండా చూసే టి.వి. ప్రోగ్రాం, విడాకులు తీసుకుని వొంటరిగా జీవిస్తున్నాడు అన్నవి ఆ మూడు. ఆఖరి సమాచారం తెలిసాక మైక్ రిలీఫ్‌గా ఫీలయ్యాడు. బాంబ్‌తో అతను కేవలం హోవార్డ్‌నే తప్ప అతని భార్యని కాని, లేదా ఇంకెవరినైనా చంపాలని అనుకోలేదు.
మైక్ తన జీవిత కాలంలో ఎన్నడూ బాంబ్‌ని తయారుచేయలేదు. ఐతే వందల బాంబ్‌లని విప్పతీశాడు. కాబట్టి దాన్ని తిరగామరగ చేయడమే అనుకున్నాడు. పోలీస్ శాఖలో ఐదేళ్ళు బాంబ్ డిస్పోజల్ విభాగంలో పని చేశాడు. అతనికి అన్ని రకాల బాంబ్‌ల గురించి తెలుసు.
అసలు తను బాంబ్‌లని తయారుచేయగలడా అన్నది తెలుసుకోడానికి తేలికపాటి బాంబ్‌లని తయారుచేసి వాటిని పొలాల్లో పేల్చసాగాడు. వాటి వల్ల ఏర్పడ్డ గుంటలని పరిశీలించడానికి పంపబడ్డాడు కూడా. తను సమర్థుడని నమ్మకం ఏర్పడ్డాక తను ఆరేళ్లు కాపురం చేసిన తన భార్యని చంపినందుకు ప్రతీకారంగా హోవార్డ్‌ని చంపే పథకాన్ని రూపొందించాడు.
నిజానికి అతని భార్యని చంపిన ఆ బాంబ్‌ని మైక్‌ని చంపడానికి ఓ ఉగ్రవాద సంస్థ ఏర్పాటు చేసింది. తర్వాత వాళ్లు అరెస్ట్ చేయబడ్డారు కూడా. కాని మైక్ ఫోన్ కంపెనీని కూడా దోషిగా నమ్మాడు. ‘కంటికి కన్ను’ సూత్రంలా ‘తన భార్య ప్రాణానికి ఆ కంపెనీ ప్రెసిడెంట్ ప్రాణం’ అనే నిర్ణయానికి వచ్చాడు.
మైక్ భార్య క్లారా దాదాపు ఆరు నెలల క్రితం మరణించింది. అండర్‌గ్రౌండ్‌కి చెందిన పోలీస్ ఇన్‌ఫార్మర్ ఎడ్డీ మైక్‌కి ముందుగా ఆ సమాచారం ఇచ్చాడు. ఏడు నెలల క్రితం ఉగ్రవాదుల బాంబ్‌లని అత్యధికంగా నిర్వీర్యం చేసిన మైక్ గౌరవం పెరిగింది. దినపత్రికల్లో, టి.వి.ల్లో అతని ఇంటర్‌వ్యూలు విరివిగా వెలువడ్డాయి.
ఓ ఉదయం ఇన్‌ఫార్మర్ ఎడ్డీ మైక్‌ని రహస్యంగా ఓ సందులోని ఓ మూల పెద్ద చెత్త డబ్బా పక్కన కలిసి చెప్పాడు.
‘ఓ ఉగ్రవాద బృందం జాబితాలో నీ పేరు మొదటిది. ఇవాళ వాళ్లు నిన్ను చంపాలని అనుకుంటున్నారు. ఇవాళ ఉదయం నీ ఇంట్లో వాళ్లు బాంబ్‌ని ఉంచారని నా నమ్మకం. కొత్త వాళ్లు మీ ఇంటికి ఎవరైనా వచ్చారా?’
అది వినగానే బాంబ్ స్క్వాడ్‌లో చేరాక మైక్‌కి మొదటిసారి నయం వేసింది. ఆ బాంబ్ ఇప్పుడు తన ఇంట్లోనే ఉంది! వాళ్లు తన ఇంట్లో బాంబ్‌ని ఉంచి ఉంటే బహుశా అది రాత్రి తను ఇంట్లో ఉండగా పేలుతుంది. కాని దాన్ని ఆమె ముట్టుకుంటే పేలచ్చు.
అతను క్లారాకి ఫోన్ చేయడానికి సమీపంలోని టెలీఫోన్ బూత్‌లోకి వెళ్ళాడు. అది పని చేయడం లేదు. అతను భయంగా చుట్టూ చూశాడు. అది రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి ఎక్కడా ఇంకో ఫోన్ బూత్ లేదు.
మైక్ వేగంగా తన కారు దగ్గరికి పరిగెత్తుకెళ్లి ఫోన్ బూత్ కోసం వెదుకుతూ దాన్ని నెమ్మదిగా పోనించాడు. అరమైలు దూరంలో ఇంకో ఫోన్ బూత్ కనిపించింది. దాని పక్కన కారు ఆపి లోపలకి పరిగెత్తుకెళ్లాడు. రిసీవర్ అందుకుని అందులో నాణెం వేశాడు. డయల్ టోన్ రాలేదు. అది పని చేయడంలేదు.
అతను రిసీవర్ని లాగితే అది ఊడి చేతికి వచ్చింది. దాన్ని నేలకేసి కొట్టి మళ్లీ కారెక్కాడు. మరో చోట మందుల దుకాణం పక్కనే ఇంకో బూత్ కనిపించింది. అతను కారాపి, అందులోకి వెళ్లి రిసీవర్ అందుకుని ఇంకో నాణెం వేశాడు. అది వెనక్కి తిరిగి వచ్చింది.
‘దయచేసి ఇంకో నాణెం కూడా వేయండి’ ఆపరేటర్ కంఠం వినపడింది.
అతను జేబులు వెతుక్కుంటే ఆ విలువ గల ఇంకో నాణెం కనపడలేదు.
‘నా దగ్గర ఇంకోటి లేదు ఆపరేటర్. ఇది ఎమర్జన్సీ. దయచేసి కాల్‌ని కనెక్ట్ చేయండి’ అర్థించాడు.
‘సారీ. కుదరదు. ఛార్జ్‌ని రివర్స్ చేస్తారా?’ ఆమె అడిగింది.
‘అవును. దయచేసి వెంటనే కనెక్ట్ చేయండి’ కోరాడు.
అతని పేరు, ఫోన్ నంబర్, ఏ నంబర్ నించి చేస్తున్నాడో అడిగి తెలుసుకుని కనెక్ట్ చేసింది. నాలుగోసారి మోగాక అవతలి వైపు క్లారా రిసీవర్ ఎత్తింది.
‘జాగ్రత్తగా విను. ఇంట్లో దేన్నీ ముట్టుకోక. వెంటనే ఇంట్లోంచి బయటకి వెళ్లు’
అతని మాటలు ఆపరేటర్ మాటల్లో మరుగున పడిపోయాయి.
‘ఇది కనెక్ట్ కాల్. మైక్ నించి మిసెస్ క్లారాకి. మీరు దీన్ని అంగీకరించి ఈ కాల్ డబ్బు మీరు చెల్లిస్తారా?’ ఆపరేటర్ చెప్పేది పూర్తి కాకుండానే అవతలి వైపు బాంబ్ పేలింది. తక్షణం క్లారా మరణించింది.
మైక్ ఎడ్డీని మళ్లీ కలిసి ఆ బాంబ్‌ని ఎవరు అమర్చారో చెప్పించడానికి అతని మూడు పక్కటెముకలు విరక్కొట్టాల్సి వచ్చింది. పోలీసులు అందుకు బాధ్యులైన వారందర్నీ అరెస్ట్ చేశారు. వారిలోని ఒకరు అది తన పనే అని అంగీకరించాడు. స్మోక్ అలారం డిటెక్టర్లని పరిశీలించడానికి అపార్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ వాళ్లు పంపిన మనిషిగా వెళ్లి దాన్ని తెల్లారు ఝామున రెండున్నరకి పేలేలా అమర్చినా ఆ బాంబ్ మధ్యాహ్నం రెండున్నరకి పేలింది.
ఐతే మైక్ ఆ అరెస్ట్‌లతో తృప్తి పడలేదు. అతనికి క్లారా మీద తప్ప తనున్న నగరం మీద, అందులోని ప్రజల మీద, తన పని మీద, అన్నిటి మీదా ద్వేషం కలిగింది. అతను డిప్రెషన్‌లోకి వెళ్తే మాటలతో కౌన్సిలింగ్ చేసి తిరిగి ఉత్సాహాన్నిచ్చే మిత్రులు ఎవరూ అతనికి లేరు. క్లారా మరణంతో అతను విషాద ప్రపంచంలో పూర్తిగా వొంటరి వాడయ్యాడు.
తనకి చేతనైతే తన నించి క్లారాని దూరం చేసిన ఆ టెలీఫోన్ కంపెనీనే చంపేసేవాడు. ద్వేషంతో, విచారంతో రోడ్ మీది కొత్త వాళ్లని కూడా చంపేంత బాధ, కోపం అతనికి కలిగాయి. కాని తన కోపాన్ని ఆ టెలీఫోన్ కంపెనీ హోవార్డ్ మీద కేంద్రీకరించాడు.
క్లారా అంతిమ కార్యక్రమాలు పూరె్తైన మర్నాడు అతను వెళ్లి హోవార్డ్‌ని అతని ఆఫీస్‌లో కలిశాడు.
‘సారీ. కాని మా కంపెనీ జీతాల బిల్ ఇప్పటికే ఎక్కువగా వుంది. దాంతో ఇటీవల చాలా మందిని ఉద్యోగాల్లోంచి తీసేశాం. అందువల్ల ఆ బూత్‌లోని ఫోన్ రిపేర్‌కి వెంటనే ఎవరూ హాజరు కాలేక పోయారు’ హోవార్డ్ చెప్పాడు.
‘నేను ఎమర్జన్సీ అని చెప్పాక మీ ఆపరేటర్ వెంటనే ఎందుకు ఆ కాల్‌ని కనెక్ట్ చేయలేదు?’
‘కాని ఆమెకి ఎమర్జన్సీ అని రూఢీగా తెలీదు. ఎమర్జన్సీ అని చెప్పే ప్రతీ కాల్‌ని కనెక్ట్ చేస్తూ పోతే మా కంపెనీ ఎంత నష్టపోతుందో తెలుసా?’
హోవార్డ్ ఓ ఏడంకెల సంఖ్యని చెప్పాడు.
‘మీ కంపెనీ ఫోన్‌ని ఉపయోగించి నేను చాలా డబ్బు రాంగ్ నంబర్లు తగలడంతో నష్టపోయాను. దాని మాటేమిటి?’ అడిగాడు.
‘సాంకేతికంగా ఒకోసారి యంత్రాలు వేడెక్కి సరిగ్గా పని చేయవు. వాటిని ఎప్పటికి అప్పుడు సరిదిద్దేవారు ఉన్నారు. కాని సరిపడా లేరు’ హోవార్డ్ తమ లోపాన్ని అంగీకరించాడు.
‘మీరు ఓ టెలీఫోన్ కంపెనీలో పని చేసే రాంగ్ నంబర్’ చెప్పి మైక్ కోపంగా అతని గదిలోంచి బయటకి నడిచాడు.
హోవార్డ్‌ని చంపడమే కాక అందుకు అతని టెలీఫోన్ కంపెనీ సహాయానే్న తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
తనకి ఉన్నదంతా అమ్మేసి, తన పథకానికి అవసరమైంది లభ్యమయ్యే దాకా, అంటే హోవార్డ్ అపార్ట్‌మెంట్ పక్క అపార్ట్‌మెంట్ తనకి అద్దెకి దొరికే దాకా, ఓ ఫర్నిష్డ్ అపార్ట్‌మెంట్‌లోకి మారాడు.
హోవార్డ్ అపార్ట్‌మెంట్ మేనేజర్ ఆ అపార్ట్‌మెంజ్ లీజ్ పూర్తవడానికి ఇంకో ఏడాది గడువుందని, వాళ్లు దాన్ని పొడిగించమని కోరకపోతే మైక్‌కే ఇస్తానని మాట ఇచ్చి అతని ఫోన్ నంబర్ని తీసుకున్నాడు.
ఏడాది తర్వాత అది ఖాళీ అవగానే దాన్ని అద్దెకి తీసుకున్నాడు. ఐతే వెంటనే అందులోకి మారలేదు. దాంట్లో ఫర్నిచర్‌ని ఏర్పాటు చేయడానికి కొంత సమయాన్ని తీసుకుని, హోవార్డ్ ఇంట్లోకి వెళ్లే అవకాశం కోసం ఎదురుచూడసాగాడు. రెండు పురాతన కుర్చీలు, ఖరీదైన సోఫాని కొన్నాడు. ఫ్లోర్ మీది చెక్కలని మార్పించాడు. దాని మీద ఓరియంటెల్ కార్పెట్‌ని కొన్నాడు. పుస్తకాలని షెల్ఫ్‌లని చేయించి వాటిని పుస్తకాలతో నింపాడు. తనకి సౌకర్యవంతమైనదిగా దాన్ని తీర్చిదిద్దాకే దాంట్లోకి మారతానని అతను అందరికీ చెప్పాడు.
ఓ రోజు ఇంటికి వచ్చిన ఫర్నిచర్ని మైక్ లోపల పెడుతూంటే కారు దిగిన హోవార్డ్ అతన్ని పలకరించాడు.
‘హలో కొత్త నైబర్. నా పేరు హోవార్డ్’
తనతో కేవలం నిమిషంన్నర మాత్రమే మాట్లాడిన మైక్‌ని హోవార్డ్ గుర్తు పట్టలేదు. అతన్ని తన ఇంటికి డ్రింక్స్‌కి ఆహ్వానించాడు. మైక్ దాన్ని ఆనందంగా అంగీకరించాడు. కారణం హోవార్డ్ కూర్చునే కుర్చీని, అతని టి.వి.ని మైక్ చూడాలని అనుకున్నాడు. టి.వి. చక్కగా కనిపించే బాగా సౌకర్యంగా ఉండే కుర్చీలో హోవార్డ్ కూర్చున్నాడు. అంటే అతను తప్పకుండా అందులో కూర్చునే టి.వి. చూస్తాడు. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడికి చెందిన కామెడీ డ్రామా గ్రిడైరన్ హోవార్డ్ ఎగ్గొట్టకుండా చూసే ప్రోగ్రామని మైక్ మరోసారి అతన్ని ప్రశ్నించి నిర్ధారించుకున్నాడు.
మైక్‌ని బాంబ్‌ల మీద మరో ఊళ్లోని పోలీసుల ముందు మాట్లాడమని ఆహ్వానించారు. అది గ్రిడైరన్ కార్యక్రమం ప్రసారమయ్యే మంగళవారమే. మైక్ సోమవారం రాత్రి లాస్ ఏంజెలెస్‌కి విమానం టిక్కెట్ కొన్నాడు. శుక్రవారం అతను హోవార్డ్ టెలీఫోన్ కంపెనీకి ఫోన్ చేసి తన ఫోన్‌ని కొత్త ఇంటికి సోమవారం మార్చమని కోరాడు. తను సామానుతో కొత్తింటికి మారడానికి సోమవారం సెలవు పెట్టాడు.
తన ఫర్నిష్డ్ అపార్ట్‌మెంట్‌లోని సామానుతో సోమవారం ఉదయం తన కారు డిక్కీలో రెండు పెట్టెలు, అరడజను అట్టపెట్టెలని ఉంచాడు.
కొత్త అపార్ట్‌మెంట్‌కి వెళ్లి వాటిని ఓ చోట ఉంచి, తను రూపొందించిన బాంబ్‌ని ఓ అట్టపెట్టెలో ఉంచి టెలీఫోన్ ఇన్‌స్టాల్ చేయడానికి వచ్చే వ్యక్తి కోసం ఎదురుచూడసాగాడు. అతని విమానం ఏడున్నరకి బయల్దేరుతుంది. ఇంట్లోంచి ఐదున్నరకే బయలుదేరాలి. ఎయిర్‌పోర్ట్‌కి అరగంట ప్రయాణం. గంట ముందే అక్కడ ఉండాలి.
మధ్యాహ్నం మూడుకి ఫోన్ కంపెనీ ఫోన్ని ఇన్‌స్టాల్ చేయడానికి ఓ మనిషిని పంపింది.
ఐదుకల్లా మైక్ లాస్ ఏంజెలెస్‌లో ఉండే మూడు రోజులకి సరిపడే బట్టలని పెట్టెలో సర్దుకున్నాడు. తను అక్కడ ఉపయోగించేవి మాత్రమే ఉండి ఇంట్లో ఉన్న అన్నీ నాశనం అవుతాయని తెలిసినా, క్లారా ఫొటోఫ్రేమ్ తప్ప మిగిలిన వేటినీ తీసుకెళ్లే వ్యామోహాన్ని అణచేసుకున్నాడు. అతను ఫర్నిచర్‌తో అపార్ట్‌మెంట్‌ని నింపడానికి కారణం ఖాళీ అపార్ట్‌మెంట్‌లో ఫోన్‌ని ఇన్‌స్టాల్ చేస్తే తర్వాత ఆ కేస్‌ని విచారించే పోలీస్ ఆఫీసర్‌కి అనుమానం కలిగి తీరుతుంది. తను దాని మీద ఎంత ఖర్చు చేస్తే తన రహస్యం అంత మరుగున ఉంటుందని మైక్ నమ్మాడు.
అతను అసెంబుల్ చేసిన బాంబ్‌ని హోవార్డ్ అపార్ట్‌మెంట్‌కి, తన అపార్ట్‌మెంట్‌కి మధ్య గల గోడకి ఆనందించాడు. సరిగ్గా ఆ గోడవతల దానికి ఆనుకునే హోవార్డ్ కూర్చుని టి.వి. చూసే కుర్చీ ఉంది.
ఆ బాంబ్‌కి టైమర్ లేదు. అది శబ్దంతో పేల్చే బాంబ్. టెలీఫోన్ బెల్ మోగితే అది పేలుతుంది. దాన్ని మైక్ డిజైన్ చేసి అప్పటికే ఓ పొలంలో టేప్‌రికార్డ్ చేసిన టెలీఫోన్ బెల్‌తో రెండుసార్లు ప్రయోగించి చూశాడు కూడా. ఆ టేప్ బాంబ్ పేలగానే నాశనమై పోయింది.
మంగళవారం రాత్రి ఎనిమిదీ పదికి హోవార్డ్ టి.వి.లోని తన అభిమాన కార్యక్రమం చూస్తూండగా ఫోన్ చేసి దాన్ని పేల్చి అతన్ని చంపాలని మైక్ అనుకున్నాడు. తక్షణం హోవార్డ్‌ని చంపే ఆ బాంబ్ ఎంత శక్తివంతమైందంటే, మైక్ అపార్ట్‌మెంట్‌లోని మొత్తాన్ని అది నాశనం చేసేస్తుంది. కొన్ని అపార్ట్‌మెంట్లలోని కిటికీ అద్దాలు కూడా ఆ ప్రకంపనలకి పగిలిపోతాయి. కాని వందల మైళ్ల దూరంలో ఉండే తనకేం కాదని మైక్ తృప్తిగా అనుకున్నాడు. తను ఇంట్లో లేనప్పుడు అది ఉగ్రవాదుల బృందం పగతో ఏర్పాటు చేసిందని పోలీసులు నమ్ముతారని కూడా మైక్ ఆశించాడు. దాంతో అనుమానం తన మీదకి రాదు.
అతను ఓ ఫోన్ కాల్ కోసం ఎదురుచూశాడు. అతను బయలుదేరడానికి కొద్ది నిమిషాల ముందు ఆ అపార్ట్‌మెంట్‌లో ఇన్‌స్టాల్ అయిన ఫోన్ మోగింది. అది ఆ టెలీఫోన్ కంపెనీ నించి. ఫోన్ బాగా పని చేస్తోందా అని అడగడానికి చేశారు.
‘పర్‌ఫెక్ట్’ మైక్ చెప్పాడు.
మైక్ ఇంట్లోని ఆ ఫోన్ నంబర్ ఎవరికీ తెలీదు కాబట్టి ఎవరూ అతను తిరిగి వచ్చేదాకా దానికి చేయరు. అతను పెట్టెని తన కార్లో ఉంచుకున్నాడు. తర్వాత వెళ్లబోయే ముందు మరోసారి బాంబ్‌ని పరిశీలించి, అంతా సరిగ్గా ఉందని నిర్ధారణ చేసుకుని తలుపు వైపు నడిచాడు.
సరిగ్గా అప్పుడే ఆ అపార్ట్‌మెంట్‌లో ఇన్‌స్టాల్ అయిన ఫోన్ మోగింది. అది ఆ అపార్ట్‌మెంట్‌కి వచ్చిన మొదటి రాంగ్ నంబర్.

(జూలియా స్మిత్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి