క్రైమ్ కథ

నమ్మకస్థుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదిహేను రోజుల క్రితం జాన్ వచ్చి నన్ను కలిశాడు. నేను అతన్ని వెంటనే గుర్తు పట్టలేదు. ఎందుకంటే నేను అతన్ని చూసి ఎనిమిదేళ్లైంది. కాలేజీలో చదివేప్పుడు, తర్వాత ఎవరి దారిన వాళ్లం వెళ్లిపోయాం. ఈ మధ్యకాలంలో నేను అతన్ని మళ్లీ చూడలేదు. అతను బరువు పెరిగాడు. జుట్టు కూడా గతంలో కన్నా పల్చబడింది. మరకలున్న టై, నలిగిన సూట్, బీటలు ఇచ్చిన బూట్లని చూస్తే గత ఎనిమిదేళ్లుగా అతనికి పెద్దగా సంపాదన లేదని అనిపించింది.
‘మనం కలిసి చాలా కాలమైంది’ అతను చెప్పాడు.
అతనికి స్కాచ్‌ని ఆఫర్ చేశాను. మేము డ్రాయింగ్ రూంలో కూర్చుని కాలేజీ రోజుల గురించి మాట్లాడుకున్నాం. జాన్ నా దగ్గరకి ఏ పని మీద వచ్చాడని ఆలోచించాను. కానీ అంతుపట్టలేదు. ఊరికే సరదాగా మాట్లాడటానికి నన్ను వెతుక్కుని రాడు. అతను డబ్బడిగితే నా కష్టాల కేటలాగ్‌ని చెప్పటానికి సిద్ధంగా ఉన్నాను.
‘నీ ఇల్లు బావుంది. నీ సంపాదన బానే ఉన్నట్లుంది?’ కాసేపాగి చుట్టూ చూసి అడిగాడు.
నేను వౌనంగా ఉండిపోయాను. అతను ఎందుకు వచ్చాడో తెలుసుకోకుండా ముందుగా నా అంతట నేనే పెదవి విప్పదలచుకోలేదు. చివరికి రెండో పెగ్ మధ్యలో ఉండగా జాన్ చెప్పాడు.
‘ఓ అవసరం రావడంతో నేను నీ దగ్గరకి వచ్చాను. నేను నమ్మే ఒకరి నించి నాకు సహాయం కావాలి. నిన్ను అప్పడగడానికి వచ్చానని నీకు అనిపిస్తే అది తప్పు. నేను డబ్బుకి ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. ఐతే జీవితకాలంలో ఓ సారి వచ్చే అవకాశం నాకు ఈ మధ్యే వచ్చింది. గత ఎనిమిది సంవత్సరాలుగా పట్టిన దురదృష్టం, జారిపోయిన అవకాశాలు నువ్వు అనుభవించి ఉంటే, ఈ నా అవకాశాన్ని నువ్వు వదులుకోవు’
‘కావచ్చు’ చెప్పాను.
అతని పథకం ఏమిటో, ఎలా నన్ను నమ్మించి నా నించి డబ్బు తీసుకోవాలని అనుకుంటున్నాడో నాకు చూచాయగా కూడా అంతుపట్టలేదు. అది తప్పకుండా చట్టవిరుద్ధమైందే అయి ఉంటుందని కూడా నేను భావించాను. మొదటి నించీ నిజాయితీ పరుడినైన ననన్ను జాన్ ఈ విషయంలో లొంగదీసుకోగలగడం అసంభవం. అతనేం చెప్తాడా అని ఓపికగా ఎదురుచూశాను.
‘నువ్వు నాకో సహాయం చేయాలి. అది డబ్బుకి సంబంధించింది కాదు. చట్టవిరుద్ధమైందీ కాదు. నువ్వు చెయ్యాల్సింది కూడా పెద్దగా కష్టమైంది కాదు. నువ్వు చెయ్యాల్సిందల్లా నా కోసం ఓ ఉత్తరాన్ని జాగ్రత్తగా నీ దగ్గర దాచడం’ జాన్ చెప్పాడు.
అతను తన కోటు జేబులోంచి ఓ తెల్లటి కవర్ తీసి నాకిచ్చాడు.
‘ఈ కవర్లో ఏముందో నువ్వు తెలుసుకోక పోవడమే మంచిది. కేవలం దీన్ని నీ దగ్గర జాగ్రత్తగా ఉంచడమే నేను కోరేది. వచ్చే నెల్లో ఏదో ఓ రోజు నేను మళ్లీ నీ దగ్గరికి వచ్చి దీన్ని తీసుకుంటాను. ఊరికే కాదు. ఇందుకు నీకు వెయ్యి డాలర్లు ఇస్తాను’
‘నాకు పూర్తిగా అర్థం కాలేదు’ చెప్పాను.
‘నిన్ను అర్థం చేసుకోమని నేను అడగడం లేదు’ అతని కంఠంలో అభ్యర్థన ఉన్నా స్వల్పంగా అసహనం కూడా ధ్వనించింది.
అతని ఏదో పెద్ద పథకంలో నేనో చిన్న భాగాన్ని అని, నాతో పని పూర్తయ్యాక అతను మొత్తం చెప్తాడని నాకు అనిపించింది.
‘నేను నిన్ను వెతుక్కుని నీ దగ్గరికి రావడానికి కారణం మన స్కూల్ రోజుల్లో, మన మిత్రులు అందరిలో నువ్వు అతి నిజాయితీపరుడివి. నమ్మదగ్గ వాడివి. నాకు నమ్మదగ్గ వ్యక్తి అవసరం ఏర్పడి వచ్చాను.’
‘నాకు అర్థమైంది చెప్తాను. నువ్వు ఇచ్చిన ఉత్తరాన్ని నేను నెల రోజులు నా దగ్గర ఉంచాలి. ఆ తర్వాత నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఆ ఉత్తరాన్ని చింపి చదవకుండా నీకు తిరిగి ఇస్తే నువ్వు నాకు వెయ్యి డాలర్లు ఇస్తావు’ చెప్పాను.
‘అవును. నీకు అర్థమైంది’ నవ్వాడు.
‘అంతేనా? ఓ ఉత్తరాన్ని నా ఇంట్లో భద్రంగా ఉంచి నెల తర్వాత నీకు ఇవ్వడమేనా నేను చేయాల్సిన పని?’ అడిగాను.
‘ఇంకొకటి కూడా ఉంది. నిన్ను ఎలాంటి ప్రమాదంలో నేను ఇరికించటం లేదు’ అతను హామీ ఇచ్చాడు.
‘ఐనా నాకు అన్నీ చెప్పు’ కోరాను.
‘నెల రోజుల తర్వాత నేను నీ దగ్గరికి వస్తానని చెప్పా కదా? ఒకవేళ నేను రాకపోతే ఏమవుతుంది?’
‘నాకు తెలీదు’
అతను నా చేతిలో ఉన్న ఉత్తరం మీద వేలితో కొట్టి చెప్పాడు.
‘ఈ ఉత్తరాన్ని పోలీస్ కమిషనర్‌కి పోస్ట్ చేయాలి’
‘ఏం చేయాలి?’
‘నేను నెల్లో నీ దగ్గరికి రాకపోతే దానర్థం నాకేదో జరిగిందని. పోలీసులకి అది తెలియాలి. ఆ ఉత్తరం నాకేమైందో పోలీసులకి వివరిస్తుంది. ఇది నా ప్రాణాలకి ఇన్సూరెన్స్ లాంటిది. నాకు నమ్మకస్థుడి అవసరం ఎందుకుందో ఇప్పుడు నీకు అర్థమైందా?’
‘నేను నమ్మకస్థుడ్ననని నువ్వు నా దగ్గరికి వచ్చానని అంటున్నావు. థాంక్ యు. నమ్మకమంటే నిజాయితీ. కానీ నీ పథకం నిజాయితీతో కూడింది కాదని నాకు అనిపిస్తోంది. దాంట్లో నేను భాగస్వామిని ఎలా అవుతానని అనుకున్నావు?’ ప్రశ్నించాను.
‘ఇందులో నిజాయితీ లేకపోవడం ఏముంది? నీకో ఉత్తరం ఇచ్చి నెల తర్వాత పోస్ట్ చేయమనడం, ఈ లోగా నేను వస్తే దాన్ని నాకు ఇవ్వమనడంలో చట్టవిరుద్ధమైన పనేముంది?’ జాన్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘లేదు. కాని...’
‘ఆ ఉత్తరాన్ని పోలీస్ కమిషనర్‌కి పోస్ట్ చేయడం అంటే జరిగిన ఓ నేరాన్ని పోలీసులకి తెలియజేయడమే. అది ప్రతీ పౌరుడి ధర్మం కదా?’
‘నీ పథకంలోని నా భాగం పూర్తిగా చట్టసమ్మతమైందే అని ఒప్పుకుంటాను. కానీ నీ భాగం అలా కాదని నా అభిప్రాయం జాన్! నువ్వు ఎవర్నో బ్లాక్‌మెయిల్ చేస్తున్నావని నాకు అనిపిస్తోంది’ చెప్పాను.
‘అది నిజమే. నేను బ్లాక్‌మెయిల్ చేసేది ఎవర్నో పేరు చెప్తే, నువ్వు తేలిగ్గా తెలుసుకోగలవు. మన దేశంలో అతను అతి దగుల్బాజీ. దుర్మార్గుడు. అలాంటి వాడిని బ్లాక్‌మెయిల్ చేయడంలో అన్యాయం లేదు’ అతను సిగ్గుపడకుండా చెప్పాడు.
‘నువ్వే లాయర్. నువ్వే జడ్జ్. అవునా?’ నవ్వుతూ అడిగాను.
‘సరే. సరే. నా దగ్గర ఇప్పుడు పైసా లేదు. నేను కాలేజ్ లోంచి బయటికి వచ్చాక ఎన్ని వ్యాపారాలు చేసినా, అన్నిట్లో నష్టమే వచ్చింది. ఇది నాకు వచ్చిన పెద్ద మంచి అవకాశం. దీన్ని పూర్తిగా ఉపయోగించు కోదలచుకున్నాను. అది నిజాయితీతో కూడిందా, కూడనిదా అన్నది నేను పట్టించుకోను. నీ దగ్గరికి నేనో సహాయం కోరి, అదీ నువ్వు నమ్మకస్థుడవని వచ్చాను. నా ప్రాణాలు నీ చేతుల్లో పెడుతున్నానని అర్థమైందా? నా ప్రాణాల్ని ఒకరి చేతిలో ఉంచాల్సిన పరిస్థితి నాది. అపరిచితుడ్ని అయినా నా ప్రాణాలని నువ్వు కాపాడాలి. అవునా? నువ్వు నిర్ణయించుకుని చెప్పు’ అతను ఆవేదనగా చెప్పాడు.
‘సరే. చేస్తాను. నువ్వు చెప్పినట్లే చేస్తాను’ అంగీకరించాను.
‘నువ్వు ఒప్పుకుంటావనే ఆశతో, నమ్మకంతో నీ దగ్గరికి వచ్చాను. మిగిలిన షరతులు - ఎవరైనా నీకు ఫోన్ చేసి, నేను నీ నించి ఆ ఉత్తరం తీసుకురమ్మన్నానని చెప్తే అది నువ్వు వాళ్లకి ఇవ్వకూడదు. అతనేం చెప్తున్నాడో నీకు తెలీదని చెప్పాలి. నేను నీకు ఫోన్ చేసి ఇతరులకి ఆ ఉత్తరం ఇవ్వమని కోరినా నువ్వు ఇవ్వకూడదు. ఆ ఉత్తరాన్ని తిరిగి నా చేతుల్లోనే పెట్టాలి. అర్థమైందా?’
‘అలాగే. కానీ నాకోటి చెప్పు. ఇందులో హింస జరిగే అవకాశం ఉందా?’ అడిగాను.
అతను తల అడ్డంగా ఊపి చెప్పాడు.
‘అలాంటి ప్రమాదం లేదు. నువ్వు గౌరవనీయమైన పౌరుడివి. వాళ్లతో నేను నువ్వు కూడా ఆ ఉత్తరాన్ని మరొకరికి ఇచ్చి నువ్వు కోరినప్పుడే ఇవ్వమన్నావని చెప్తాను. నీకేమైనా అయితే వాళ్లు వెంటనే పోలీసులకి ఇస్తారనే భయంతో నిన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టరు. ఎలాంటి హింసైనా వాళ్లు నా మీదే ప్రయోగిస్తారు తప్ప నీ మీద కాదు’
అతను వెళ్లిపోయాడు.
ఇది జరిగి పదిహేను రోజులైంది. ఇన్ని రోజులూ నేను మామూలుగానే ఆఫీస్‌కి వెళ్తున్నాను. ఆ ఉత్తరం అటక మీది ట్రంక్ పెట్టెలో నా స్కౌట్ యూనిఫాం జేబులో ఉంది. నేను వారం తర్వాత ఆ ఉత్తరం గురించి దాదాపు మర్చిపోయాను.
నాలుగు రోజుల క్రితం రాత్రి పది ప్రాంతంలో నాకో ఫోన్‌కాల్ వచ్చింది. అది జాన్ నించి. నేను అతన్ని కంఠాన్ని గుర్తు పట్టాను.
‘విను. నేను నీకు ఇచ్చిన ఉత్తరం సంగతి గుర్తుందా?’ అడిగాడు.
‘సారీ?’ జవాబు చెప్పాను.
అతను ఇలాంటి సందర్భంలో ఏం జవాబు చెప్పాలని చెప్పాడో అది నాకు గుర్తుంది.
‘ఉత్తరం. నీకు ఇచ్చిన కవర్ గురించి నేను చెప్పేది’ ఆందోళనగా చెప్పాడు.
‘మీరెవరో కాని జోక్ చేస్తున్నారు’ చెప్పాను.
‘నేను నీకు చెప్పింది మర్చిపో. వాళ్లు వింటున్నారు. వాళ్లకి నీ దగ్గర ఉత్తరం ఉందని తెలియాలి’
‘ఏమిటి మీరనేది? నాకేం అర్థం కావడం లేదు.’
‘దయచేసి నేను నీకు ఉత్తరం ఇచ్చిన సంగతి వాళ్లకి చెప్పు. నా ప్రాణాలు కాపాడాలంటే చెప్పు’ జాన్ ఆందోళనగా అర్థించాడు.
‘మీరు ఎవరో, దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడంలేదు’
జాన్ పెద్దగా అరవడం వినిపించాక లైన్ కట్ అయింది. నేను రిసీవర్ని పెట్టేశాను. నాలుగు రోజుల క్రితం అది జరిగిందని చెప్పా కదా?
ఇవాళ ఉదయం పేపర్‌లో పోలీసులు నదిలోంచి జాన్ శవాన్ని బయటకి తీశారని చదివాను. అతన్ని బాగా హింసించి, తుపాకీతో కాల్చి చంపాక, కారు టైర్లలో అతని శవాన్ని దూర్చి గొలుసులతో కట్టి పడేశారు. కాని అతని బెల్ట్ పడవ ఏంకర్‌కి తగులుకుని, దాంతోపాటు అది ఒడ్డుకి వచ్చి పైకి తేలింది. అతను మరణించి మూడు నాలుగు రోజులై ఉండచ్చని పోలీసులు అంచనా వేశారు.
దాంతో నేనా ఉత్తరాన్ని తెరచి చదివి ఆశ్చర్యపోయాను. మా రాష్ట్ర గవర్నర్ గతం గురించి తెలిస్తే ఆయనకి నేను ఓటు వేసి ఉండేవాడిని కాను. నేను జాన్‌కన్నా తెలివి మీరాను. అతని అనుభవంతో నాకేమైనా అయితే ఆ ఉత్తరం సరాసరి పోలీసుల చేతిలోకి వెళ్తుంది.
నేనా ఉత్తరాన్ని విప్పి చదవకుండా ఎందుకు పోలీసులకి పంపలేదు? జాన్ నా నిజాయితీని తప్పుగా అంచనా వేశాడని మీకు అనుమానం కలగవచ్చు. అది నిజం కాదు. ఐతే గతంలో ఎన్నడూ నాకు లక్ష డాలర్లు సంపాదించే అవకాశం రాలేదు. పోస్ట్ ఆఫీస్‌లో ఉత్తరాలని సార్టింగ్ చేసే ఎవరైనా నిజాయితీగానే ఉంటారు.

(డొనాల్డ్ ఈ వెస్ట్‌లేక్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి