క్రైమ్/లీగల్

నిజాం సుగర్స్ కార్మికుడి ఆత్మహత్యా యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 17: వేలాది కుటుంబాలకు తీపిని పంచిన నిజాం చక్కెర కర్మాగారం మూతబడడంతో, దీనిపై ఆధారపడ్డ కార్మికుల మనుగడ దుర్లభంగా మారింది. గడిచిన నాలుగేళ్ల నుండి ఉపాధికి దూరమై, వేతనాలకు నోచుకోక కుటుంబాన్ని పోషించేందుకు నరకయాతన అనుభవిస్తున్న కార్మికులు బలవన్మరణాలకు కూడా వెనుకాడడం లేదంటే సమస్య తీవ్రతను ఊహించవచ్చు. ఇప్పటికే ఫ్యాక్టరీ మూతబడి ఉపాధి దూరమైందనే బెంగతో అనారోగ్యాల బారినపడి అనేక మంది అర్ధాంతరంగా తనువులు చాలించిన ఉదంతాలు ఉన్నాయి. తాజాగా, ఓ ఎన్‌ఎస్‌ఎఫ్ కార్మికుడు సోమవారం జిల్లా కేంద్రానికి తరలివచ్చి కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్ పైకి ఎక్కి ఆత్మహత్యకు యత్నించడం కలకలం సృష్టించింది. బోధన్ శక్కర్‌నగర్‌లోని నిజాం సుగర్ ఫ్యాక్టరీలో పెదకోళ్ల రమేష్ మజ్దూర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే ప్రైవేట్ కోరల్లో చిక్కుకుని అవసాన దశకు చేరుకున్న నిజాం సుగర్స్ ఫ్యాక్టరీని యాజమాన్యం లేఆఫ్ ప్రకటిస్తూ మూసివేయడంతో సహచర కార్మికులు, ఉద్యోగులతో పాటు రమేష్ కూడా ఉపాధిని కోల్పోవాల్సి వచ్చింది. గత నాలుగేళ్లుగా కుటుంబ పోషణ కోసం పడరానిపాట్లు పడ్డ రమేష్, తీవ్ర మనస్థాపానికి లోనై సోమవారం ఏకంగా కలెక్టరేట్‌కు వచ్చి మూడంతస్తులు ఉన్న ప్రగతిభవన్ పైకి ఎక్కి అక్కడి నుండి కిందకు దూకే ప్రయత్నం చేశాడు. మెడలో తెరాస పార్టీ కండువాను, నెత్తిన గులాబీ రంగు టోపీని ధరించి బలవన్మరణానికి పాల్పడతానంటూ బెదిరింపులకు దిగాడు. అతనిని గమనించిన కలెక్టరేట్‌లోని ఏఎస్‌ఐ విఠల్, ఇతర పోలీసు సిబ్బంది ఎంతో సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ తమదైన శైలిలో సముదాయించారు. రమేష్‌ను మాటల్లోకి దించి, వెనుక వైపు నుండి పోలీసులు పైకి చేరుకుని అతనిని క్షేమంగా తమ వెంట కిందకు తెచ్చారు. ప్రగతిభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు వద్దకు అతనిని తీసుకెళ్లగా, రమేష్ తన గోడును వెళ్లబోసుకున్నాడు. నిజాం సుగర్స్ మూతబడడం వల్ల తాను పూర్తిగా ఉపాధిని కోల్పోవాల్సి వచ్చిందని, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో కూడా తెలియని దైన్య స్థితిలో కొట్టుమిట్టాతున్నానని కంటతడి పెట్టాడు. తనకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపించి ఆదుకోవాలంటూ అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించుకున్నా ప్రయోజనం లేకుండాపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన పెద్ద కుమార్తె వికలాంగురాలని, కనీసం ఎంప్లాయిమెంట్ ద్వారా వికలాంగుల కోటాలో తనకైనా ఏదైనా ఉద్యోగం కల్పించాలంటూ డీఈఓ, ఎంప్లాయిమెంట్, కార్మిక శాఖ తదితర అధికారులను కలిసి కోరినా, స్పందన శూన్యంగా మారిందన్నారు. దీంతో మనస్థాపానికి లోనై ఆత్మహత్యకు యత్నించానని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా జే.సీ వెంకటేశ్వర్లు స్పందిస్తూ, ఏ సమస్యకు కూడా ఆత్మహత్య ఎంతమాత్రం పరిష్కారం కాదని, అర్ధాంతరంగా తనువు చాలిస్తే కుటుంబ సభ్యులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఈ తరహా ఆలోచనలను విడనాడాలని సుతిమెత్తగా మందలించారు. రమేష్ కుమార్తెకు జీవనోపాధి కల్పించేందుకు చొరవ చూపుతానని హామీ ఇచ్చారు.