క్రైమ్ కథ

దొంగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిక్‌కి ఉద్యోగం పోయింది. దాంతో డబ్బు లేదు. ఫలితంగా అతను అద్దెకి ఉండే గదికి మూడు వారాలుగా అద్దె చెల్లించడం లేదు. వారానికి ఇరవై డాలర్ల చొప్పున అరవై డాలర్లు బాకీ పడ్డాడు. ఒకప్పుడు అరవై డాలర్లంటే అతనికి లెక్కలేదు. కాని ఈ రోజు ఒక్క డాలర్ సంపాదించడం కూడా అతనికి గగనమై పోయింది.
అది శనివారం రాత్రి. గదుల్లోని వారంతా అద్దె చెల్లించాల్సిన రోజది. నిక్ వీధులన్నీ తిరుగుతూ అతి చవక భోజనం కోసం వెతుకుతున్నాడు. అతను ఎంత జాగ్రత్తగా ఖర్చు చేసినా జేబులోని ముప్పై డాలర్లు వారం మించి రావు. అతని సామానంతా తాకట్టు దుకాణంలో ఉంది. ఒంటి మీది మాసిన చవక దుస్తులు తప్ప మిగిలిన దుస్తులన్నీ, అతని ఓవర్‌కోట్, చర్చ్‌కి వేసుకెళ్లే సండే సూట్, సూట్‌కేస్, బూట్లు.. అన్నీ తాకట్టు దుకాణంలో ఉన్నాయి.
అతని బెల్ట్ కింద ఉన్న బరువైన ఓ వస్తువు మాత్రం అతనిలో ధైర్యాన్ని నింపుతోంది. దాన్ని దగ్గర ఉంచుకోవడం చట్టవిరుద్ధమైనా దాన్ని ఇంట్లో ఉంచి వచ్చే ధైర్యం చేయలేదు. ఇంటావిడ అతని గదంతా వెతికి తను చెల్లించాల్సిన అద్దె కన్నా విలువైన ఆ రివాల్వర్‌ని స్వాధీనం చేసుకుంటుందని నిక్ భయపడ్డాడు. నల్లగా మెరిసే చిన్న గొట్టంగల, బరువైన చవక రివాల్వర్ అది. చాలా కాలంగా అది అతని దగ్గర ఉంది. అతనికి అది ఆయుధంకన్నా ఎక్కువ విలువైంది. అవసరమైన రోజు కోసం దాన్ని దాస్తూ వస్తున్నాడు.
అతను ఓ దుకాణంలోకి వెళ్లి పావుకిలో ఛీజ్, నాలుగు బ్రెడ్ రోల్స్, ఓ పైంట్ పాలు కొన్నాడు. దుకాణంలో కనపడ్డ అనేక ఆహార పదార్థాలు, అవసరమైన వస్తువులు నిక్‌కి ప్రపంచం మీద కోపాన్ని తెప్పించాయి. డబ్బు నిండిన జేబులతో వాటిని కొనే లావుపాటి వినియోగదారులు తమ కోసం, తమ పిల్లల కోసం ఇళ్లకి చాలా ఆహార పదార్థాలని తీసుకెళ్లడం చూశాక అతనికి కోపం వచ్చింది. ఒకప్పుడు నిక్ కూడా అలా ఖర్చు చేసినవాడే.
అతను సినిమా హాల్ పక్క నించి తన ఇంటికి నడిచాడు. మెయిన్ డోర్ పిడిని పట్టుకుని అలవాటుగా తిప్పాడు. అది తెరచుకోలేదు. ఎందుకు తెరచుకోలేదో మొదట అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది. లోపల నించి తాళం వేసి ఉంది. ఆ తలుపు తాళం చెవి నిక్ దగ్గర లేదు. కేవలం తన గది తలుపు తాళం చెవి మాత్రమే ఉంది. తను మూడో వారం కూడా అద్దె చెల్లించకపోయేసరికి ఇంటావిడ తాళం వేసింది.
తలుపు మీద కొట్టి గట్టిగా చెప్పాడు.
‘తెరవండి’
కొద్దిసేపువేచి చూసినా లోపల నించి ఏం అలికిడి వినపడలేదు. అతను మరి కొద్దిసార్లు అరిచాక ఇంటావిడ కంఠం వినపడింది.
‘నాకు అరవై డాలర్లు చెల్లించాలి. మూడు వారాల నించి నువ్వు ఒక్క సెంట్ కూడా చెల్లించలేదు.’
నిక్ హేండిల్‌ని పట్టుకుని తలుపుని గట్టిగా ఊపాడు. అతనికి తన రివాల్వర్ గుర్తొచ్చింది.
‘మిసెస్ రైలీ. తలుపు తెరు. నా జేబులో డబ్బుంది. లోపలకి రాగానే డబ్బు చెల్లిస్తాను’ అబద్ధం చెప్పాడు.
తాళం తెరచుకున్న చప్పుడు. తలుపు తెరచుకుంది. సన్నటి నిక్, లావుపాటి ఇంటావిడని రాసుకుంటూ లోపలికి నడిచాడు. అతను కార్పెట్ పరిచిన మెట్లు ఎక్కుతూంటే ఆవిడ కంఠం గట్టిగా వినిపించింది.
‘నా డబ్బేది? అబద్ధం చెప్పావా?’ ఆవిడ అరిచింది.
‘వచ్చే వారం’ నిక్ తల వెనక్కి తిప్పి చూడనైనా చూడకుండా అరిచాడు.
నిక్ తన గది తలుపు తాళం తెరిచి పక్క మీద పడుకున్నాడు. మొదటి అంతస్థులోని ఆ గది కిటికీలోంచి బయట సినిమా హాల్ కనిపిస్తోంది. టిక్కెట్లు కొనుక్కుని హాల్లోకి వెళ్లే మనుషుల వంక కొద్దిసేపు చూశాడు. అన్ని ఖర్చులకీ పోను ఇంకా డబ్బు మిగిలిన వాళ్లే సినిమాకి వచ్చేది అనుకున్నాడు.
ఛీజ్‌లో బ్రెడ్ ముక్కలని ముంచుకుని తింటూ పాలు తాగసాగాడు. క్రమంగా ఫస్ట్ షో పూరె్తై మనుషులు హాల్లోంచి బయటకి రాసాగారు. తర్వాత సెకండ్ షో క్యూ కదిలింది. కొద్దిసేపటికి అంతా లోపలికి వెళ్లారు. అర్ధరాత్రి ఒంటి గంటకి సినిమా వదిలాక మనుషులు మళ్లీ బయటకి వచ్చి పేవ్‌మెంట్ మీద నడవసాగారు.
సినిమా హాల్లోని లైట్లు ఆరిపోయాయి. కొద్దిసేపటికి హాల్ ముందు నీడలోకి ఓ పెద్ద వేన్ వచ్చి ఆగడం చూశాడు. అందులోంచి ఇద్దరు కిందకి దిగారు. వేన్ హెడ్‌లైట్ల కాంతిని దాటి ఒకడు నడుస్తూంటే, అతని ఒంటి మీది యూనిఫాం, బెల్ట్‌కి వేలాడే రివాల్వర్ కనిపించాయి. ఆ ఇద్దరూ సినిమా హాల్లోకి వెళ్లారు. కొద్ది క్షణాల తర్వాత సినిమా హాల్ మేనేజర్ వాళ్ల వెంట బయటకి వచ్చాడు. యూనిఫాంలోని అతని చేతిలో తెల్లటి కేన్వాస్ సంచీ ఉంది. దానికి వేసిన తాళం మెరుస్తూ కనిపించింది. వాళ్లు వేన్ ఎక్కేదాకా ఆగి మేనేజర్ తిరిగి థియేటర్లోకి వెళ్లాడు.
వాళ్లు సినిమా హాల్ నించి టిక్కెట్లు అమ్మిన డబ్బుని తీసుకెళ్లడానికి వచ్చారని నిక్‌కి అర్థమైంది.
డబ్బు!
ఆ సంచీలో ఎంత ఉందో?
వారమంతా ప్రతీరోజు ప్రేక్షకులు వచ్చి కొన్న టిక్కెట్ల డబ్బది. ఆ సంచీలో చాలా డబ్బుంటుంది.
తోటి వాళ్లల్లా తనకీ సినిమా హాల్ టిక్కెట్లు, బట్టలు, లిక్కర్, ఆహారం కొనే హక్కుంది. తనూ ఇతరుల్లా అద్దె చెల్లించాలి. అందుకు తన దగ్గర రివాల్వర్ ఉంది. వాటన్నిటికీ అది మొదటి మెట్టు. తను నిర్భయంగా దాన్ని పేల్చగలడు. అది రెండో మెట్టు. చివరగా తనా డబ్బు సంచీతో పారిపోగలడు. దొంగతనం ఎవరైనా చేయగలరు కాని తర్వాత పట్టుబడకపోవడం లోనే విజయం ఉంటుంది.
తను కచ్చితంగా పట్టుబడడు. తేలిగ్గా పారిపోగలడు. తనకి క్రిమినల్ రికార్డ్ లేదు. కాబట్టి తన మీద ఎవరికీ అనుమానం రాదు. తన దగ్గర ఓ రివాల్వర్ ఉందని కూడా ఎవరికీ తెలీదు. తనని ఎవరూ చూడకపోతే సరి. ఆ ఇద్దర్నీ కాల్చి డబ్బు సంచీ తీసుకుని పారిపోవడమే తరువాయి.
కాని తను వంద గజాల దూరం పరిగెత్తేలోగా సమాచారం అందుకోగానే పోలీస్ పెట్రోల్ కార్లు వచ్చేస్తాయి. రివాల్వర్ పేలిన శబ్దాలకి మేనేజర్ బయటకి వచ్చి చూసి పోలీసులకి తక్షణం ఫోన్ చేసి తీరుతాడు. పరిగెత్తే తనని చూడగానే ఆపుతారు. కాని తనని వాళ్లు అలా పట్టుకోని ఓ మంచి పథకం అతనికి తట్టింది.
ప్రతీ శనివారం రాత్రి ఆ సమయానికి ఆ వేన్ రావడం అనేకసార్లు చూశాడు.
తర్వాతి శనివారం అర్ధరాత్రి ఆట ముగిసే దాకా ఇక్కడే కూర్చుని కిటికీలోంచి చూస్తాడు. ఆ వేన్ రాగానే నిశ్శబ్దంగా వీధిలోకి వెళ్లి, చీకట్లో నక్కి ఆ ఇద్దరూ థియేటర్‌లోకి వెళ్లడం చూశాడు. అటు ఇటు చూసి ఎవరూ లేరని ధృవపరచుకుంటాడు. ఎవరైనా రోడ్ మీద ఉంటే ఏం చేయడు. లేదా ఆ ఇద్దరూ డబ్బు సంచీతో తిరిగి రాగానే మేనేజర్ లోపలకి వెళ్లే దాకా వేచి ఉండి, తర్వాత ఆ ఇద్దర్నీ గురి చూసి కాలుస్తాడు. ఆ సంచీని తీసుకుని తన ఇంటి వైపు పరిగెత్తకుండా నడిచి తన గదిలోకి వస్తాడు.
తను అక్కడ ఉన్న సంగతి పోలీసులకి తెలీదు. కిటికీ లోంచి పోలీస్ వేన్ రావడం తను చూడచ్చు. తమ పక్కనే ఉన్న బిల్డింగ్‌లోని మొదటి అంతస్థులో దొంగ ఉన్నాడని పోలీసులకి తెలీదు.
ఆ సంచీలో ఎన్నో నాణాలు, ఒకటి రెండు ఐదు పది డాలర్ల నోట్లు ఉంటాయి. చిన్న నోట్లని తను తక్షణం ఖర్చు చేసినా ఎవరికీ తన మీద అనుమానం రాదు.
ఆలోచించిన కొద్దీ అది మంచి పథకం అని నిక్‌కి అనిపించసాగింది. ఇలాంటి అవసరం రావచ్చనే అతను రివాల్వర్‌ని తాకట్టు పెట్టనిది.
ఆదివారం గడిచి సోమవారం వచ్చింది. ఆ రెండు రోజులూ అతను తన గదినే గడిపాడు. సోమవారం సాయంత్రం వాకింగ్‌కి వెళ్లి తిరిగి వచ్చాడు. మెట్ల దగ్గర ఇంటావిడ ఎదురుపడింది. ఈసారి అతను ఆవిడని గమనించనట్లే మెట్లెక్కలేదు. ఆగి నవ్వుతూ చూస్తూ చెప్పాడు.
‘నాకు ఉద్యోగం వచ్చింది. ఇక మీదట టైంకి మీ అద్దెని చెల్లిస్తూంటాను’
‘నీ గదిలో కూర్చుని చేసే ఉద్యోగమా?’ ఆవిడ ఎకసెక్కంగా అడిగింది.
‘కొద్దిరోజుల్లో నాకు చాలా డబ్బు వస్తుంది. మీకు నాలుగు వారాల అద్దెని ముందుగా చెల్లిస్తాను’ నమ్మకంగా చెప్పాడు.
* * *
గురువారం, శుక్రవారం గడిచి శనివారం వచ్చింది. దొంగతనం గురించి చాలామందిలా సాధారణ ఆసక్తిని మాత్రమే ప్రదర్శించాలి అనుకున్నాడు. దాని గురించి అంతా మాట్లాడుకోవడం ఆగిపోయాక తను ఇంకో గదికి మారాలని కూడా అనుకున్నాడు.
శనివారం మధ్యాహ్నం కిటికీ తెర మూసి, రివాల్వర్‌ని బయటకి తీసి దాన్లోని గుళ్లని బయటకి తీసి, ఆయిల్‌తో శుభ్రం చేసి మళ్లీ గుళ్లని నింపాడు. అది అతనికి ధైర్యాన్ని ఇచ్చింది. దాని సహాయంతో తను సంవత్సరం అద్దె కూడా ముందే చెల్లించగలడు అనుకున్నాడు.
బయట అడుగుల చప్పుడు, తలుపు కొట్టిన శబ్దం వినిపించాయి. అతను తక్షణం దిండు కింద రివాల్వర్‌ని దాచాడు.
‘నువ్వు లోపలున్నావని తెలుసు నిక్! నువ్వు ఇవాళేగా నాకు అద్దె చెల్లిస్తానని మాట ఇచ్చింది? ఏదీ నా అద్దె డబ్బు?’
మిసెస్ రైలీ కంఠం కరుకుగా వినిపించింది.
‘ఇంకా శనివారం ముగియలేదు మిసెస్ రైలీ. ఈ లోగా మీ అద్దె తప్పక చెల్లిస్తానని హామీ’ సందేహించకుండా గట్టిగా చెప్పాడు.
‘చూస్తాను’ మళ్లీ ఆవిడ అడుగులు దూరమైన శబ్దం వినిపించింది.
శనివారం రాత్రి వచ్చింది. నిక్ తన గదిలోని దీపాన్ని ఆర్పేసి కిటికీ లోంచి బయటకి థియేటర్ ముందున్న పేవ్‌మెంట్ మీది క్యూలోని జనాలని చూశాడు. ఫస్ట్ షో వదలడంతో బయటకి వచ్చే మనుషులు కనపడ్డారు. తను కూడా వాళ్లల్లో ఒకరిలా సినిమాకి, బార్‌కి వెళ్లి ఖర్చు చేసేవాడు. మర్నాటి నించి జేబులో డబ్బు, పక్కన ఓ అందగత్తె. తన మీద ఎవరికీ ఎలాంటి అనుమానం రాదు.
అర్ధరాత్రి ఆట కూడా వదిలారు. ఆఖరి ప్రేక్షకులు కూడా హాల్ నించి దూరంగా వెళ్లిపోయారు. హాల్లో లైట్లు ఆరిపోయాయి. మేనేజర్ గదిలో మాత్రం వెలిగే దీపం కనిపించింది. అంతా నిశ్శబ్దం. రోడ్‌కి అటు ఇటు అదృష్టవశాత్తు ఒక్కరు కూడా లేరు.
అకస్మాత్తుగా హెడ్‌లైట్ల కాంతి పడింది. ట్రక్ వచ్చి క్రితం శనివారం ఆగిన చోటే ఆగింది. ఇద్దరు గార్డ్‌లు వేన్ దిగి హాల్లోకి నడిచారు.
నిక్ వెంటనే తన గదిలోంచి నెమ్మదిగా, నిశ్శబ్దంగా జేబులో రివాల్వర్‌తో బయటకి నడిచాడు. బిల్డింగ్‌లోని ఓ గదిలో దీపం వెలుగుతోంది. అది మిసెస్ రైలీ గది. ఆ గది కిటికీ హాల్ వైపు లేదు కాబట్టి ఆవిడకి బయట జరిగేది కనపడదు. రివాల్వర్ పేలిన శబ్దం కూడా వినపడదు.
నిక్ కిందికి దిగి మెయిన్ డోర్ తెరచుకుని చీకట్లోకి బయటకి నడిచాడు. ఆగి ఇటు అటు చూసి రోడ్డంతా నిర్మానుష్యంగా ఉండటంతో తృప్తిపడి, తను ముందే ఎంచుకున్న చోటుకి వెళ్లి చీకట్లో నక్కి నిలబడ్డాడు. జేబులోంచి రివాల్వర్ తీసి సేఫ్టీ కేచ్‌ని రిలీజ్ చేశాడు.
కొద్దిసేపటికి ఆ ఇద్దరు గార్డ్‌లు చేతిలో తాళం వేసిన సంచీతో బయటకి వచ్చారు. నిక్ గురి చూసి ఇద్దర్నీ ఒకరి తర్వాత మరొకర్ని కాల్చాడు. వాళ్లు కింద పడటం చూశాడు. వారి అరుపులని విన్నాడు. ఐదడుగుల దూరంలోని వాళ్ల దగ్గరికి వెళ్లి ఆ డబ్బు సంచీని లాక్కున్నాడు. అది డబ్బుతో బరువుగా ఉంది. నాణాలు తక్కువ, నోట్లు ఎక్కువైతే బావుండును అని అనుకుంటూ కింద పడి రక్తం కారే ఇద్దరి వంకా చూడకుండా, రోడ్ దాటి వీధి మీది పేవ్‌మెంట్ మీదకి చేరుకుని పదిహేను అడుగులు నడిచి తన ఇంటి మెట్ల దగ్గరికి చేరుకుని అటు ఇటు చూశాడు.
పూర్తిగా నిర్మానుష్యం. ఎవరూ కనపడలేదు. ఎదురుగా ఉన్న బిల్డింగ్ కిటికీ తలుపు ఒకటి తెరచుకునే సరికే నిక్ చీకట్లోకి వచ్చేశాడు.
తను భద్రమైన స్థలంలో ఉన్నాడు. ఇంకో నిమిషంలో తన గదిలో ఉంటాడు. అది ఇంకా భద్రమైన స్థలం.
అతనిలో సంతోషం, ఉత్సాహం అలుముకున్నాయి. లోపలకి వెళ్లగానే మంచం మీద సిద్ధంగా ఉంచిన కత్తితో ఆ సంచీని కోసి డబ్బు తీయాలి. దూరంగా పోలీస్ కారు సైరన్ వినిపించింది. అతను తక్షణం తన ఇంటి మెయిన్ డోర్ తలుపు పిడిని పట్టుకుని తిప్పాడు.
తెరచుకోలేదు!
గత శనివారం రాత్రిలా దానికి లోపల నించి తాళం వేసి ఉందని గ్రహించాడు. వెంటనే అతను తలుపు మీద బాదుతూ నెమ్మదిగా అరిచాడు.
‘మిసెస్ రైలీ! దయచేసి తలుపు తెరు’
జవాబు లేదు.
‘మిసెస్ రైలీ’ ఈసారి గట్టిగా అరిచాడు.
‘నాకు నా అద్దె డబ్బివ్వు. నాలుగు వారాల అద్దె. కిందటి శనివారం డబ్బుందని అబద్ధం ఆడావు. ఉద్యోగం వచ్చిందని, ఈ శనివారం ఇస్తానని కూడా మాట ఇచ్చావు’
‘ఉంది. ముందు దయచేసి నన్ను లోపలకి రానీ’ ఆందోళనగా అడిగాడు.
‘నీ మాటలు నమ్మను. ముందు డబ్బు చూపించు’ ఆవిడ ఆ తలుపుకున్న తల మాత్రం కనిపించే చిన్న తలుపుని తెరచి చూస్తూ చెప్పింది.
వెనక నించి కొందరు పరిగెత్తుకు వస్తున్న బూట్ల చప్పుళ్లు వినిపించాయి. అతను అర్ధిస్తూ అడిగాడు.
‘మిసెస్ రైలీ! నా దగ్గర నిజంగా డబ్బుంది. నాలుగు వారాల పాత బాకీ చెల్లించి ఇంకో రెండు వారాల అడ్వాన్స్ కూడా ఇస్తాను. ముందు నన్ను లోపలకి రానీండి’
‘డబ్బు చూపించు. అప్పుడు నీ మాటలు నమ్ముతాను’
‘తలుపు తెరవండి. చూపిస్తాను7
‘ముందు చూపిస్తేనే’
నిక్ సంచీకున్న తాళాన్ని లాగి చూశాడు కాని రాలేదు.
‘గాడ్! ముందు లోపలికి రానీండి. ప్లీజ్’
మిసెస్ రైలీ తలుపు తెరవలేదు. నిక్ అక్కడ నించి పక్క ఇళ్ల తలుపు దగ్గరికి పరిగెత్తి వాటిని తెరవాలని చూశాడు. అన్నిటికీ లోపల తాళాలు వేసి ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్న రెస్ట్‌రెంట్స్, బార్లలోంచి రెండు వైపుల నించీ మనుషులు పరిగెత్తుకు వస్తున్నారు.
మళ్లీ తన ఇంటి తలుపు దగ్గరికి పరిగెత్తికెళ్లి దాదాపు ఏడుస్తూ అరిచాడు.
‘మిసెస్ రైలీ! ప్లీజ్. తలుపు తెరవండి’
ఆవిడ లోపలకి వెళ్లిపోవడంతో జవాబు రాలేదు.
ఓ కార్ హెడ్‌లైట్ అతని మీద పడింది.
‘అదిగో! అతని చేతిలో డబ్బు సంచీ ఉంది. అదే’ సినిమా హాల్ మేనేజర్ అరుపు ఉత్సాహంగా వినిపించింది.
నిక్ వెనక్కి తిరిగాడు. అతని కళ్లల్లోకి కారు హెడ్‌లైట్ల వెలుగు గుచ్చుకుని ఎదురుగా ఏం ఉందో కనపడటం లేదు. అతను తన చేతిలోని రివాల్వర్‌ని అనాలోచితంగా ఆ హెడ్‌లైట్ వైపు కాల్చాడు. తక్షణం ఇద్దరు పోలీసుల రివాల్వర్లు పేలి రెండు గుళ్లు నిక్‌కి గుచ్చుకున్నాయి. ఒకటి ఛాతీలో, మరొకటి పొత్తికడుపులో.
కింద పడి మూలిగే అతన్ని పోలీసులు చుట్టుముట్టారు. మరణించబోయే ముందు నిక్ మాట్లాడిన మాటలు వాళ్లకి అర్థం కాలేదు.
‘ఎనభై డాలర్ల కోసం ఆ పిచ్చిది తలుపు తెరవలేదు. ఈ సంచీలో వేల డాలర్లున్నా నాకు ఉపయోగం లేకపోయింది.’
*
(రాబర్ట్ సిడ్నీ బోవెన్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి