క్రైమ్/లీగల్

ముగ్గురు నిందితులకు జీవితఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 14: ఎనిమిదేళ్ల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన చిన్నారి పలగాని నాగవైష్ణవి కిడ్నాప్, హత్య కేసులో ఎట్టకేలకు గురువారం తీర్పు వెలువడింది. ఈ కేసులో గత ఎనిమిది సంవత్సరాలుగా జైలులో ఉంటూ నేరారోపణలు ఎదుర్కొన్న మోర్లా శ్రీనివాసరావు, వెంపరాల జగదీష్, పంది వెంకట్రావ్ గౌడ్‌లకు జీవితఖైదుతోపాటు రూ.4,500 చొప్పున జరిమానా విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. ప్రముఖ మద్యం వ్యాపారి, బిసి ఐక్య వేదిక నాయకుడు పలగాని
ప్రభాకరరావు కుమార్తె పదేళ్ళ చిన్నారి పలగాని నాగవైష్ణవి 2010 జనవరి 30వ తేదీన కిడ్నాప్, దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. రెండురోజుల తర్వాత కుమార్తె మరణ వార్త విన్న తండ్రి ప్రభాకరరావు గుండెపోటుతో మరణించారు. అప్పట్లో ఈ రెండు వరుస ఘటనలు రాష్టవ్య్రాప్తంగా తీవ్ర సంచలనం కలిగించాయి. ఈ కేసు విచారణ ఎనిమిదేళ్లపాటు కొనసాగింది. ఛార్జిషీటులోని 79మంది సాక్షులను విచారించిన తర్వాత నిందితులు ముగ్గురిపై హత్య, కిడ్నాప్ నేరాలు రుజువుకావడంతో న్యాయమూర్తి బబిత తీర్పు చెప్పారు. ఇది అతినీచమైన, హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం పలగాని ప్రభాకర్ తన అక్క కూతురు వెంకటేశ్వరమ్మను మొదటి వివాహం చేసుకున్నాడు. వీరికి దుర్గాప్రసాద్ అనే కుమారుడు ఉన్నాడు. కొన్నాళ్లకు నిజామాబాద్ జిల్లాకు చెందిన నర్మదాదేవిని పలగాని రెండో వివాహం చేసుకోగా వీరికి సాయితేజష్, నాగవైష్ణవి సంతానం కలిగారు. చిన్నారి పుట్టిన తర్వాతే తనకు కలిసి వచ్చిందనే భావించిన ప్రభాకర్ కుమార్తెను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నాడు. అయితే ఆస్తులన్నీ నాగవైష్ణవి పేరుమీద పెడుతూ.. మొదటి భార్య వెంకటేశ్వరమ్మను నిర్లక్ష్యం చేస్తున్నాడని భావిస్తూ వచ్చిన ఆమె సోదరుడు పంది వెంకట్రావు గౌడ్ పగ పెంచుకున్నాడు. వైష్ణవిని అడ్డు తొలిగించడం ద్వారా బావ పలగాని ప్రభాకరరావు దారికి వస్తాడని భావించిన వెంకట్రావు గౌడ్ ఓసారి వైష్ణవిని కిడ్నాప్ చేసి విడిచిపెట్టాడు. ఇదే క్రమంలో మరోమారు కుట్ర చేసి వైష్ణవి హత్యకు వ్యూహరచన చేశారు. ఈక్రమంలో 2010 జనవరి 30వ తేదీన నాగవైష్ణవి, సోదరుడు సాయి తేజష్‌గౌడ్‌తో కలిసి కారులో స్కూలుకు వెళ్తుండగా సత్యనారాయణపురం బిఆర్‌టిఎస్ రోడ్డులో బైక్‌లపై వచ్చిన నిందితులు కారుపై దాడి చేసి అటకాయించారు. కారుడ్రైవర్ లక్ష్మణరావును కత్తితో పొడిచి హత్య చేశారు. చిన్నారి వైష్ణవిని మరో కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. ఈ ఘటన నుంచి ఆమె సోదరుడు సాయితేజష్ తప్పించుకోగలిగాడు. అనంతరం నిందితులు వైష్ణవిని గుంటూరు వైపు తీసుకెళ్లి కారులోనే గొంతు నులిమి హతమార్చారు. సాక్ష్యాలు దొరకకుండా చేసేందుకు గుంటూరు ఆటోనగర్‌లోని శారదా ఇండస్ట్రీస్‌లోని ఎలక్ట్రికల్ ఫర్నేస్‌లో వేసి మృతదేహాన్ని బూడిద చేశారు. అప్పటికే రాష్ట్రంలో కిడ్నాప్ ఉదంతం కలకలం రేపుతుండగా, వైష్ణవిని కాల్చి బూడిద చేశారని తెలియగానే పలగాని ప్రభాకరరావు గుండెపోటుతో మరణించారు. రంగంలోకి దిగిన దర్యాప్తు బృందాలు ఎట్టకేలకు వైష్ణవి చెవిదిద్దుల వజ్రాల ఆధారంగా ఆనవాళ్ళు గుర్తించారు. నిందితులుగా గుంటూరుకు చెందిన మోర్లా శ్రీనివాసరావు, వెంపరాల జగదీష్, పంది వెంకట్రావు గౌడ్‌లను 2010 ఫిబ్రవరి 4వ తేదీన అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అప్పటి నుంచి బెయిల్ లభించక నేటి వరకూ నిందితులు జిల్లా జైలులోనే ఉంటూ వచ్చారు. హైకోర్టులో 11సార్లు, సుప్రీం కోర్టులో ఒకసారి బెయిల్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. అప్పటి సత్యనారాయణపురం సిఐ డి శ్రావణ్‌కుమార్, సెంట్రల్ జోన్ ఏసిపి ఆవుల సుబ్బారావులు కేసు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేశారు.
ప్రాసిక్యూషన్ తరుఫున ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సోమసాని బ్రహ్మానందరెడ్డి వాదనలు వినిపించారు. ఇదిలావుండగా ఎనిమిదేళ్ళ న్యాయపోరాటంలో వైష్ణవి తల్లి నర్మదాదేవి ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో మరణించింది. ఆ తర్వాత పోరాటం సాగించిన చిన్నారి బాబాయి, ప్రభాకర్ సోదరుడు పలగాని సుధాకర్ కూడా ఏడాది క్రితం గుండెపోటుతో మరణించారు.