క్రైమ్/లీగల్

సవాల్ విసురుతున్న సైబర్ నేరగాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15: ప్రస్తుతం పోలీస్‌లకు సవాల్ విసురుతూ, ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సైబర్ నేరగాళ్లు రోజు రోజుకీ కొత్త పంథాలో మోసాలు చేస్తున్నారు. ఖాతాదారుడికి తెలియకుండానే అకౌంట్లో డబ్బు కాజేస్తున్నారు. క్రెడిట్ కార్డులతో మోసాలు, బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఖాతా, ఏటీఎం కార్డు వివరాలు, పిన్ నెంబర్ తీసుకుని దర్జాగా నగదు కొట్టేస్తున్నారు. నేరుగా నగదు బదిలీ అడక్కుండానే వ్యాలెట్లలో సొమ్ము ఉంచాలని చెప్పి మరీ కాజేస్తున్నారు. ఎలా వీలుదొరికితే అలా అందినంత దోచుకుంటున్నారు. చివరకు పేటీఎం వంటి డిజిటల్ లావాదేవీల్లో కూడా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి నకిలీ చెల్లింపులు చేసి షాపింగ్‌తో లక్షల్లోనే గుంజేస్తున్నారు. బోగస్ ధ్రువీకరణ పత్రాలతో క్రెడిట్‌కార్డులు పొంది బ్యాంకులను కూడా నిండా ముంచేస్తున్న ముఠా ఈ ఏడాది ఫిబ్రవరి 21న పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. ఏకంగా 33 ఎస్‌బిఐ క్రెడిట్ కార్డులు పొందిన ముఠా ఆ బ్యాంక్‌కు రూ.33.83 లక్షలకు టోకరా వేసింది. బ్యాంకుల పేరు చెప్పి సైబర్ ముఠాలు అక్షరాస్యులను, నిరక్షరాస్యులను సైతం దోచుకుంటుంటే, బ్యాంకుల్లోని కింది స్థాయి వారితో ఉన్న లావాదేవీలతో ఏకంగా బ్యాంకుల్లో నగదుకే ఎసరుపెడుతున్నారు. ఎక్కడో ఒకచోట ఉంటూ అనేక చోట్ల, అనేక పద్ధతుల్లో సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. గతంలో నైజీరియన్లు, దక్షిణఫ్రికా దేశాలకు చెందిన కొందరు కేటుగాళ్లే ఈ నేరాలకు పాల్పడే వారు. ఇప్పుడు భారతదేశంలోనే సైబర్ నేరగాళ్లు అడ్డూఅదుపులేకుండా నేరాలు చేస్తున్నారు. చత్తీస్‌గఢ్‌లోని జాంతాడ జిల్లాలో దాదాపు 43గ్రామాల్లో ఎంతోమంది యువత ఇదే సైబర్ నేరాలు కొనసాగిస్తున్నారు. ఇక హర్యానా, ఢిల్లీ, ముంబయి, నొయిడా వంటి ప్రాంతాల నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కెవైసిలు సమర్పించే సమయంలోనూ జాగ్రత్త వహించాల్సి వస్తోంది. సంతకం పెట్టిన అన్ని డాక్యుమెంట్లను సమర్పించే సమయంలో బ్యాంకులోని క్రెడిట్ కార్డులు ఇప్పించే ఎగ్జిక్యూటివ్‌లు కొంతమంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ ధ్రువపత్రాలను కాజేసి తద్వారా క్రెడిట్ కార్డులు పొంది మొత్తం వాడేసి చెల్లించకపోవడంతో అప్పుడు అసలు మోసం వెల్లడైన సందర్భాలు ఉన్నాయి. సైబర్ నేరం ఎక్కడో చేసి, మరెక్కడో ఉంటూ, రోజుకో నగరం మారుతూ, రోజుకో నేరంచేస్తూ సంచరించే వీరి బారిన పడకుండా ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటే తప్ప దీనికి పరిష్కారం లేదంటున్నారు సైబర్ క్రైం నిపుణులు.
ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే దీనికి ఏకైక పరిష్కారంగా భావిస్తున్నారు. ఏ బ్యాంకూ, లేదా సంస్థ, ఆధార్, పాన్ కార్డు ఇలా దేనికీ మొబైల్ నెంబర్ లింక్ చేస్తామంటూ ఫోన్‌లో ఎవరూ సంప్రదించరు. ఎవరికి వారే ఈ పనులన్నీ చేసుకోవాలి. బ్యాంకుకు నేరుగా వెళ్లి మనపని మనం చేసుకుంటే చాలావరకు మంచిది. ఏ బ్యాంక్ గానీ, ఆర్థిక సంస్థ గానీ నేరుగా ఫోన్‌చేసి మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, ఏటీఎం కార్డు నెంబర్ అడిగే అవకాశం ఉండదు. అలా అడిగితే కచ్చితంగా అది మోసపూరిత కాల్‌గా భావించి వెంటనే అప్రమత్తం కావాలి. అకౌంట్ బ్లాక్ చేశామని ఎవరైనా ఫోన్‌చేస్తే అది తప్పుడు కాల్‌గా భావించాలి. ఒక వేళ బ్యాంక్ అకౌంట్, ఏటీఎం కార్డు బ్లాక్ చేస్తే బ్యాంకు వద్దకు వెళితే తప్ప లేదా లావాదేవీ చేపడితే గానీ మనకు తెలియదు. డబ్బు బ్యాంకులో వేయాలని గానీ, లేదా వ్యాలెట్‌లో వేయాలని గానీ చెప్పి ఎవరైనా ఫోన్ చేసినా పట్టించుకోరాదని సీఐడీ సైబర్ క్రైం విభాగం ఎస్పీ రాంమోహన్ తెలిపారు. ఏదైనా నెంబర్ చెప్పి ఎస్‌ఎంఎస్ చేయాలని చెబితే అలా చేయకూడదు. అలా చెప్పిన నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ ఇస్తే ఆ తర్వాత ఎస్‌ఎంఎస్ పంపిన వారి ఫోన్ ఒక్కసారిగా పనిచేయదు.