క్రైమ్/లీగల్

ముంచేసిన కెరటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యు కొత్తపల్లి, జూన్ 17: జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం సముద్ర కెరటాల ఉద్ధృతికి ముగ్గురు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు నైజీరియాకు చెందిన విద్యార్థులు కాగా వారిలో ఒకరి మృతదేహం లభ్యమయ్యంది. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు జరుగుతోంది.
నైజీరియన్ దేశానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఉప్పాడ తీరంలో సముద్ర స్నానానికి దిగి గల్లంతవడంతో తీరంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. నైజీరియా దేశానికి చెందిన ఇమానియల్ (21) సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కాలనీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గల్లంతైన మరో విద్యార్థి ఇబ్రహిం దాంగ్‌బోగో (19) ఇంజినీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
కన్నీరుమున్నీరైన విద్యార్థులు
సముద్ర స్నానానికి వెళ్ళి మృతిచెందిన ఇమానియల్ మృతదేహాన్ని చూసి తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇమానియల్ మృతదేహాన్ని ఉప్పాడకు చెందిన ఫ్రెండ్స్ ఎవరెస్ట్ టీం సభ్యులు హేమంత్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులు అతికష్టం మీద మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. ఈ సమయంలో ఒక్కసారిగా 30 మందికి పైగా నైజీరియన్ విద్యార్థులు అక్కడకు చేరుకుని రోదించిన తీరు కలచివేసింది. మృతదేహానికి పాత్రికేయులు, పోలీసులు ఫొటో తీస్తుంటే తీయనీయకుండా విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మృతుని వివరాలు, సముద్ర స్నానానికి వచ్చిన విద్యార్థుల పేర్లు తెలుసుకునేందుకు పోలీసులు ఎంతో శ్రమించవలసివచ్చింది. సంతోషంగా గడుపుదామని వచ్చిన నైజీరియన్ విద్యార్థులు ఈ విషాద సంఘటనతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
సురక్షితంగా బయటపడిన మరో ఆరుగురు నైజీరియన్ విద్యార్థులు
ఉప్పాడ తీరంలో సముద్ర స్నానం చేసేందుకు వెళ్ళిన ఎనిమిది మంది నైజీరియన్ విద్యార్థుల్లో ఒకరు మృతిచెందగా, మరొకరు గల్లంతయ్యారు. అయితే మరో ఆరుగురు విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. సురక్షితంగా బయటపడిన విద్యార్థులు ఆరుగురు గుంపుగా స్నానం చేస్తుండటంతో ప్రాణాలతో బయటపడినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఇమానియల్, ఇబ్రహింలు కేరింతలు కొడుతూ రెట్టించిన ఉత్సాహంతో బృందం నుండి విడిపోయి సముద్రం లోపలకు వెళ్ళడంతో విషాదానికి దారితీసింది.
దానవాయిపేట బీచ్‌లో ...
తొండంగి: దానవాయిపేట బీచ్‌లో స్నానం చేస్తుండగా అలల ఉధృతికి ఒక యువకుడు సముద్రంలోకి కొట్టుకుపోయినట్టు తొండంగి ఎస్సై బి జగన్మోహన్‌రావు తెలిపారు. ఆయన అందించిన వివరాల ప్రకారం కాకినాడ ప్రాంతం ఇంద్రపాలెం గ్రామానికి చెందిన సల్మాన్ మదీనా (17) కుటుంబ సభ్యులతో అన్నవరంలో బంధువుల ఇంటికి వచ్చి తిరుగు ప్రయాణంలో ఒంటిమామిడి బీచ్ రోడ్డులో వెడుతూ దానవాయిపేట బీచ్‌కు స్నానం చేసేందుకు వెళ్ళాడు. సల్మాన్‌తో పాటు అతని స్నేహితులు సముద్రంలో స్నానం చేస్తుండగా సముద్రపు కెరటాల ఉధృతికి సల్మాన్ మదీనాతో పాటు తన బంధువు బషీర్ అనే యువకుడు సముద్రంలో కొట్టుకుపోతుండగా సమీపంలో ఉన్న మత్స్యకారులు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే సల్మాన్ మదీనాను మాత్రం రక్షించలేకపోయారు. మరొక యువకుడు బషీర్‌ను రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు. సల్మాన్ మదీనా గల్లంతవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తొండంగి ఎస్సై వారి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేసుకుని గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.