క్రైమ్/లీగల్

రహదారి రక్తసిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, ఆగస్టు 24: అనంతపురం జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుకొండ మండలం సత్తార్‌పల్లి సమీపంలో రెండు బొలేరో వాహనాలు ఢీకొనడంతో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. మరో 11 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లికి వెళ్తున్న వీరంతా మృత్యువాతపడడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు, ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా రొద్దం మండలం ఎల్.తిమ్మాపురం గ్రామస్థులు బొలేరో వాహనంలో అనంతపురం నగరంలో జరిగే ఓ పెళ్లికి బయలుదేరారు. వీరి వాహనం పెనుకొండ మండలం సత్తార్‌పల్లి వద్దకు చేరుకోగానే కడప జిల్లా ఒంటిమిట్ట నుంచి అరటిగెలల లోడ్‌తో వస్తున్న మరో బొలేరో వాహనం ఢీకొంది. దీంతో రొద్దం మండలం లక్కసానిపల్లికి చెందిన గోపాల్‌రెడ్డి(60), రవీంద్రారెడ్డి (45), తిమ్మాపురం గ్రామానికి చెందిన కురుబ వెంకటస్వామి(65), వెంకటప్ప (50), వడ్డే ఆంజనేయులు(30), గొల్ల ఆంజనేయులు (35) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కురుబ నారాయణప్ప (55)ను బెంగళూరుకు,
భీమయ్య(50)ను అనంతపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. తిమ్మలాపురానికి చెందిన గంగాధర్, గోవిందప్ప, నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అదేవిధంగా లక్కసానిపల్లి, తిమ్మపురం గ్రామాలకు చెందిన కురుబ కొండప్ప, కురుబ లింగప్ప, శీనప్ప, గాజుల చంద్రశేఖర్, వడ్డే నంజుండప్ప, వెంకటరాముడు, పుట్టన్న, అంజినప్పకు గాయాలయ్యాయి. వీరికి పెనుకొండ, అనంతపురం ఆసుపత్రుల్లో చికిత్స చేస్తున్నారు. మృతుల్లో ఆరుగురు తిమ్మాపురానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులు వెంకటప్ప, వెంకటస్వామి, నారాయణప్ప సోదరులు కావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. మృతులందరూ రైతులు, రైతు కూలీలే. రెండు వాహనాల డ్రైవర్లు శివారెడ్డి, రాజేష్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఘటన జరిగిన వెంటనే ఇద్దరు డ్రైవర్లూ పరారయ్యారు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాసులు, ఎస్సై జనార్థన్‌రెడ్డి సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జనార్ధన్‌రెడ్డి తెలిపారు.

చిత్రం..చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు