క్రైమ్/లీగల్

దోపిడీ కేసులో నలుగురికి ఏడేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (లీగల్): ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడిన నలుగురు నిందితులకు ఏడేళ్ల చొప్పున జైలుశిక్ష, జరిమానా విధిస్తూ గుంటూరు ఒకటవ అదనపు అసిస్టెంట్ సెషన్స్ న్యాయమూర్తి కె సత్యనాగ బాలప్రసాద్ సోమవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... గుంటూరువారితోట 8వ లైనుకు చెందిన షేక్ కరిముల్లా, నందివెలుగు రోడ్డులోని రాజీవ్ గృహకల్ప 3వ బ్లాక్‌కు చెందిన షేక్ జబీబుల్లా, నంబూరు మహమ్మద్ అలీ రఫత్ కాలనీకి చెందిన బర్దన్ అశోక్, శారదాకాలనీ 26వ లైనుకు చెందిన కారుమూరు రాజేష్‌లు మిత్రులు. వీరు సంఘటనకు పూర్వం కూడా పలు చోరీలకు పాల్పడ్డారు. జబీబుల్లా కొన్ని కేసుల్లో కడప, గుంటూరు కోర్టులు శిక్షలు విధించగా బెయిల్‌పై బయట ఉన్నాడు. ఇలా ఉండగా కొత్తపేట శంకరమంచి వారి వీధిలో నివాసం ఉంటే వీసం సాంబయ్య, వీసం రామాంజమ్మల పిల్లలు వ్యాపారాల నిమిత్తం వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడటంతో వారి భవనంలోని 4వ అంతస్తును అద్దెకు ఇచ్చేందుకు బోర్డుపెట్టారు. రామాంజమ్మ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన నిందితులు 2017 సెప్టెంబర్ 16వ తేదీన అద్దెకోసం ఆమె ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా నిందితులు నలుగురు ఆమెను కత్తితో బెదిరించి ఒంటిపై ఉన్న 20 సవర్ల బంగారు నగలు దోచుకున్నారు. ఆమె కేకలు వేయగా నిందితులు నలుగురు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన రామాంజమ్మను ఆసుపత్రికి తరలించారు. కొత్తపేట సిఐ ఎన్ శ్రీకాంత్‌బాబు నిందితులను అరెస్ట్ చేయగా, మరో సిఐ వంశీధర్ ఛార్జిషీటు దాఖలు చేశారు. ఏపీపీ పారి బాబురావు నిందితులు నలుగురిపై నేరం రుజువు చేయడంతో ఒక్కొక్కరికీ ఏడేళ్ల చొప్పున జైలుశిక్షతో పాటు 1000 రూపాయల జరిమానా కూడా విధిస్తూ న్యాయమూర్తి బాలప్రసాద్ తీర్పుచెప్పారు.