క్రైమ్/లీగల్

హత్య కేసులో ముగ్గురి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, అక్టోబర్ 31: ఒక యువకుడిని దారుణంగా కొట్టి చంపి ఆనవాళ్ళు లేకుండా కాల్చివేసిన సంఘటనలో నిందితులను పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను మైలవరం సీఐ చింతా సూరిబాబు, ఎస్‌ఐ జి రామకృష్ణ బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేఖర్లకు వివరించారు. మైలవరం బాలయోగి నగర్‌కు చెందిన మిరియాల తిరుపతమ్మకు సుమారు 20 ఏళ్ళ క్రితం గుంటూరుకు చెందిన నాగరాజుతో వివాహమైంది. పెళ్ళి తర్వాత వారికి ఒక మగ సంతానం కలిగింది. తర్వాత తిరుపతమ్మ రెండో సంతానం కోసం గర్భం దాల్చి ఉన్న సమయంలో భర్తతో విభేదాలు వచ్చి పుట్టింటికి వచ్చేసింది. అప్పటి నుండి ఇక్కడే ఉంటూ కూలి పనులు చేసుకుని తల్లి వద్దనే జీవిస్తోంది. సుమారు 8 ఏళ్ళ క్రితం ఈమె కూలి పనుల కోసం చాట్రాయి మండలం చిత్తపూరుకు వెళ్ళింది. అక్కడ పనులు చేసుకునే సమయంలో చిత్తపూరుకు చెందిన గరికే భిక్షాలు(25)తో ఈమెకు శారీరక సంబంధం ఏర్పడింది. అప్పటి నుండి వీరు కొంతకాలంపాటు సహజీవనం చేశారు. ఈ నేపధ్యంలో భిక్షాలు మద్యానికి బానిసై తిరుపతమ్మకు తీవ్రంగా కొడుతున్నాడు. దీంతో తిరుపతమ్మ, ఆమె తల్లి, కుమారుడు, కుటుంబ సభ్యులంతా భిక్షాలును ఇంటికి రావద్దని వెళ్ళగొట్టారు. రెండేళ్ళ నుండి వీరు వేర్వేరుగానే ఎవరి గ్రామంలో వారు ఉంటున్నారు. ఈ నెల 18న దసరా ఉత్సవాలను పురస్కరించుకుని పూటుగా మద్యం సేవించిన భిక్షాలు మైలవరం వచ్చాడు. అర్థరాత్రి సమయంలో మద్యం మత్తులో మంచం పట్టె తీసుకుని తిరుపతమ్మ ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో నిద్రిస్తున్న తిరపతమ్మను బయటికి రావాలని గొడవ చేశాడు. తిరపతమ్మతోపాటు ఆమె అల్లుడు రాఘవ బయటికి వచ్చి అతనితో గొడవ పడి చెక్కతో తలపై కొట్టారు. అంతటితో ఆగకుండా భిక్షాలు తెచ్చిన మంచం పట్టెను కూడా తీసుకుని దానితో కొట్టారు. అతను స్పృహతప్పి పడిపోవటంతో రాఘవ అతని బంధువు ఇబ్రహీంపట్నం మండలం మూలపాడుకు చెందిన సుబ్బారావు సాయంతో టీవిఎస్ ఎక్సెల్ మోపెడ్‌పై భిక్షాలును తీసుకువెళ్ళి పొందుగలలోని రాఘవ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ కాళ్ళు, చేతులు కట్టేసి కొట్టారు. అప్పటి వరకూ దసరా వేషాలలో ఉన్న తిరుపతమ్మ కుమారుడు సత్యనారాయణ కూడా పొందుగల వెళ్ళి అతను కూడా కొట్టాడు. కొన ఊపిరితో ఉన్న భిక్షాలును పొందుగల ఎర్రచెరువు సమీపంలో ఉన్న ముళ్ళ పొదల వద్ద పడేసి వెళ్ళిపోయారు. 19వ తేదీ సాయంత్రం సమయంలో సత్యనారాయణ భిక్షాలు వద్దకు వెళ్ళి పరిశీలించగా చనిపోయి ఉండటాన్ని గమనించి తన బావ రాఘవకు సమాచారం అందించాడు. శవాన్ని కనిపించకుండా చేస్తే సాక్షాలుండవని భావించిన వీరు పొందుగలలోనే పెట్రోల్ కొనుగోలు చేసి వచ్చి భిక్షాలు శవాన్ని సమీపంలో ఉన్న అండర్ టనె్నల్‌లో పడేసి తూము లోపలికి నెట్టి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈక్రమంలో నిప్పంటించిన సత్యనారాయణకు కూడా మంటలు పెద్దవై కాలటంతో అతను కేకలు వేయగా రాఘవ అతనిని రక్షించి మైలవరంలోని ఒక పీఎంపి వైద్యుని వద్ద ప్రాధమిక చికిత్స జరిపించుకున్నారు. అప్పటి నుండి భిక్షాలు ఆచూకీ కనిపించకపోవటంతో అతని తల్లి రమణ తెలిసిన చోట, బంధువుల ఇంట వెతక సాగింది. ఎంతకూ ఆచూకీ లభించలేదు. ఈ నెల 29న అక్కడ సగం కాలిన మృతదేహం ఉందని ఆ ప్రాంతానికి చెందిన కొందరు పోలీసులకు సమాచారం అందించటం, ఆ నోటా ఈ నోట ఈ విషయం మృతుని తల్లికి తెలియటంతో తమ కుమారునిదే ఆ శవం అని కనుగొని స్థానిక పోలీసులకు అదే రోజు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిందితులను 24 గంటలు కూడా గడవక ముందే మోపెడ్‌పై స్థానిక ప్రభుత్వాసుపత్రి సమీపం నుండి పారిపోతుండగా పట్టుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు సీఐ వెల్లడించారు. ఈ సంఘనతో సంబంధం ఉన్న తిరుపతమ్మ, రాఘవ, సత్యనారాయణలను అరెస్ట్ చేసి స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. మరో నిందితుడు సుబ్బారావు పరారీలో ఉన్నాడని అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్న ఎస్‌ఐ రామకృష్ణ, కానిస్టేబుల్ అన్నమయ్యలను ఆయన అభినందించారు.