క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్త మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూతలపట్టు, నవంబర్ 5: పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై పి.కొత్తకోట సమీపాన సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దీపావళికని తమ గ్రామంలో కుటుంబసభ్యుల తో కలిసి ఘనంగా జరుపుకోవాలని వస్తున్న భార్యాభర్తలను దారి మధ్యలో మృత్యువు కబలించగా, మరో కుటుంబం దీపావళి పర్యదినాన్ని తిరుమల స్వామిని దర్శించుకోవడానికి కారులో వెళ్తుండగా దారి మధ్యలో జరిగిన దుర్ఘటనతో తీవ్రగాయాలపాలయ్యారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తిరుపతి నగరంలో ఉన్న రమేష్‌బాబు(50), అతని భార్య అనూరాధ(42) కలసి బంగారుపాళ్యం మండలం నారాయణపురంలో ఉన్న బంధువుల ఇంటికి దీపావళి పండుగ కోసం కారులో బయలుదేరి వెళ్లారు. అయితే ఈ కారు పూతలపట్టు మండలం పి.కొత్తకోట సమీపాన వస్తుండగా తమిళనాడు రాష్ట్రం పుదుకోటై నుంచి తిరుమలకు వెళ్తున్న క్వాలీస్ కారు రహదారిపై వెళ్తున్న లారిని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. ఈ ఘటనలో ఒక కారు బోల్తా పడడంతో అందులో వున్న భార్యాభర్తలైన రమేష్‌బాబు, అనూరాధ అక్కడికక్కడే మృతి చెందగా, మరో కారులో ఉన్న తమిళనాడు రాష్ట్రం పుదుకోటైకు చెందిన చక్రవర్తి కుటుంబ సభ్యులైన మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చిత్తూరు ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లేష్‌యాదవ్ తెలిపారు.

నేరాలు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
* పోలీసు సిబ్బంది సమన్వయంతో పని చేయాలి
* అనంతపురం రేంజి డీఐజీ క్రాంతి రాణా టాటా

చిత్తూరు, నవంబర్ 5: జిల్లాలో నేరాల నివారణకు పోలీసు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అనంతపురం రేంజి డీఐజీ కాంత్రిరాణా టాటా చెప్పారు. సోమవారం చిత్తూరు పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు, ప్రస్తుతం జిల్లాలో అందరూ పోలీసు అధికారులు కొత్త కావడంతో జిల్లా పై అవగాహన పెంచుకోవాలన్నారు. వచ్చే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇప్పటి నుంచే తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అధికారుల మధ్య సమన్వయం ఉండాలన్నారు. నేరాలు నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంభించాలన్నారు. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో సాంకేతిక వ్యవస్థతో ముందుకు వెళ్తున్నామని, ఇప్పటికే మహిళా భద్రత మహిళా చట్టాలు తదిర కార్యక్రమాలపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. వచ్చే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసామన్నారు. ఈ సమావేశంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తాళికట్టిన భర్తనే ప్రియుడి మోజులో కడతేర్చిన ఇల్లాలు
* చంపి పాతేశారు - ఆరు మాసాల్లో కేసును ఛేదించిన పోలీసులు
* ముగ్గురు నిందితుల అరెస్ట్
తంబళ్ళపల్లె, నవంబర్ 5: అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి జీవితాంతం తోడునీడగా ఉంటానని ఏడడుగులు భర్త అడుగులో అడుగేసి తాళి కట్టించుకున్న ఓ ఇల్లాలు ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తనే కర్కశంగా గొంతునులిమి చంపి, ప్రియుడితో కలిసి పాతేసి, రాక్షసత్వం ప్రదర్శించి, మహిళాలోకానికే మచ్చతెచ్చిన సంఘటన మండలంలో సంచలనం సృష్టించింది. పోలీసులు వివరాల కథనం మేరకు తంబళ్ళపల్లె మండలం, కోటకొండ ఎగువతాండాకు చెందిన బుక్కే మారూనాయక్(60) ఓ నిరుపేద గిరిజన కుటుంబం. ఆయన భార్య రమణమ్మ(40)తో బాటు కుమారుడు హరినాయక్, తల్లి మునెమ్మ(85)తో ఉన్నారు. ఉన్నంతలో మారూనాయక్ తన కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. రతీ కోవలో గత కొనే్నళ్లుగా రేణుమాకులపల్లె పంచాయతీ, బందార్లపల్లెకు చెందిన మధన్‌మోహన్‌రెడ్డి, మారూనాయక్ భార్య రమణమ్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ అక్రమ సంబంధం గురించి ఆనోటా ఈ నోటా పడి భర్తకు తెలిసిపోయింది. దీంతో మారూనాయక్ తరచూ భార్య రమణమ్మ మీద అనుమానంతో మద్యం సేవించి గొడవకు దిగేవాడు. ఈ ఏడాది మే నెల 27న మారూనాయక్ షరా మామూలుగా భార్యతో ఘర్షణకు దిగాడు. అయితే రమణమ్మ తన భర్తను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా గడపవచ్చని తలంచి బరితెగించింది. రాత్రిపూట మద్యం మత్తులో ఉన్న మారూనాయక్‌ను చంపడానికి సిద్ధపడి ఇంటిలోని కాలం చెల్లిన మందు బిళ్ళలను దంచి, మధ్యంలో కలిపి తాగించింది. అయినా మారూనాయక్ ప్రాణం పోకపోవడంతో గొంతునులిమి చంపేసింది. తదనంతరం శవాన్ని గుట్టుచప్పుడు లేకుండా రెండు సంచుల్లో కూరి మూటగట్టి భద్రపరిచింది. వెంటనే ప్రియుడు మదన్‌మోహన్‌రెడ్డికి ఫోన్ ద్వారా విషయం తెలిపింది. ప్రియుడు తన సొంత ట్రాక్టర్‌ను తానే నడుపుకుంటూ ఎగువతాండాకు చేరుకున్నాడు. శవాన్ని మాయం చేయడానికి ప్రియుడు, ప్రియురాలు కలిసి మూడవ వ్యక్తికోసం ఆలోచించారు. కోసువారిపల్లె పంచాయతీ, చిన్నపరెడ్డిగారిపల్లెకు చెందిన సుబ్బారెడ్డి తాండా సమీపంలో ఓ కాంట్రాక్టర్ వద్ద పనిచేసేవాడు. గతంలో వీరిరువురికి అతను సుపరిచితుడు కావడంతో అతన్ని పిలిపించుకొని రాత్రికి రాత్రే శవాన్ని ట్రాక్టర్లో వేసుకొని రేణుమాకులపల్లె పంచాయతీ జోగివానిబురుజు సమీపంలో వంకలో గోయ్యి తీసి పాతేసి ఏమి తెలియనట్లు వెళ్లిపోయారు. ఆ మరుసటిరోజు నుండే రమణమ్మ తన భర్త కనపడలేదని నటిస్తూ కుమారుడు, అత్త గ్రామస్థులను సైతం నమ్మించింది. అయితే కుమారుడు హరినాయక్ 29-05-2018న తంబళ్ళపల్లె పోలీస్‌స్టేషన్‌లో తన తండ్రి మారూనాయక్ కనపడలేదని ఇచ్చిన ఫిర్యాదుతో అప్పటి పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు సైతం మిన్నకుండిపోయారు. ములకలచెరువు సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ శివకుమార్‌ల రాకతో ఆరుమాసాల కేసును ఛేదించి శభాష్ అనిపించుకున్నారు. సీఐ, ఎస్‌ఐ ఈ కేసును ఛేదించడానికి ములకలచెరువు ఎస్‌ఐ ఈశ్వరయ్య సైతం ప్రధాన భూమిక పోషించాడు. ఆయనతో బాటు ఐడి పోలీసులు వెంకటేశ్వర్లు, సిరాజ్, శ్రీకాంత్‌ల సాయంతో వారం రోజులలో కేసును మలుపు తిప్పి మారూనాయక్ హతమార్చిన భార్య, ప్రియుడు, సహాయకుడిని అరెస్ట్ చేసి ప్రజల మన్ననలు పొందారు. సోమవారం ఉదయం జోగావానిబురుజు వంకలో పూడ్చిన మారూనాయక్ శవాన్ని తహశీల్దార్ సురేష్‌బాబు, సీఐ శ్రీనివాసులు సమీక్షంలో బయటకు తీయగా డాక్టర్ రామచంద్ర, ప్రసాద్‌రావు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహం మూడు నుండి ఐదు మాసాల క్రితం ఊపిరాడకుండా చేయడంతో బాటు పక్కటెముకలపై కొట్టి చంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ కేసులో రమణమ్మ ఫోన్‌కాల్ డేటాతో బాటు ప్రియుడి కదలికలపై నిఘాపెట్టి ఓ మైండ్ గేమ్ ఆడి నిందితులను అరెస్ట్ చేసామన్నారు. ఈ కేసులో ఎస్‌ఐ శివకుమార్, ములకలచెరువు ఎస్‌ఐ ఈశ్వరయ్యలను అభినందిస్తూ ఐడి పోలీసులకు రివార్డు అందజేశారు. రమణమ్మ లొంగిపోవడంలో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ బాలాజీ కిలకపాత్ర పోషించినట్లు ప్రశంసించారు.