క్రైమ్/లీగల్

చిత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, నవంబర్ 12: చిత్తూరు నగరం గిరింపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రిజిస్ట్రార్ కార్యాలయంలోని రు 59,300 అనధికారిక నగదును స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా కార్యాలయంలో పనిచేస్తున్న జాయింట్ సబ్ రిజిస్ట్రార్ - అశోక్, సబ్ రిజిస్ట్రార్ - 2 పద్మశేఖర్‌రెడ్డిలతో పాటు, పలువురు దస్తావేజులేఖర్లకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే... గిరింపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తరచూ జరుగుతున్న అవినీతి, కొందరు దస్తావేజు లేఖర్లు దళారుల అవతారం ఎత్తి సాగిస్తున్న వసూళ్ల దందాపై పక్కా సమాచారం అందుకున్న తిరుపతికి చెందిన ఏసీబీ ఏఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి, డీఎస్పీ నంజుండప్ప, సీఐ గిరిధర్, ఎస్సై విష్ణువర్థన్ సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు, కార్యాలయానికి ఎదురుగా ఏర్పాటు చేసుకున్న దస్తావేజు లేఖర్ల కార్యాలయాలపై ఏక కాలంలో ఆకస్మికంగా దాడులు చేశారు. ఈ క్రమంలో ఆయా కార్యాలయాల్లోని పలు దస్తావేజులు, అనధికార నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత గురు, శుక్రవారాలు రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆన్‌లైన్ సేవలు పనిచేయకపోవడంతో పాటు శని, ఆదివారాలు సెలవు దినాలు వచ్చాయి. సోమవారం పనిదినం కావడం, ఆన్‌లైన్ సేవలు పనిచేయడంతో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీంతో అటు క్రయ విక్రయదారులు, ఇటు దస్తావేజు లేఖర్లతో రిజిస్ట్రార్ కార్యాలయం కిటకిటలాడింది. సోమవారం ఒక్క రోజే దాదాపు 52 క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలిసింది. ఇదే అదునుగా భావించిన ఏసీబీ అధికారులు ఆకస్మికదాడులు చేపట్టి అవినీతిపరుల భరతం పట్టారు. సబ్ రిజిస్ట్రార్లు అశోక్, పద్మశేఖర్‌రెడ్డిలను అదుపులోకి తీసుకుని ప్రత్యేక గదిలో వేర్వేరుగా ప్రశ్నిస్తూ విచారణ చేపట్టారు. ఈ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇద్దరు రిజిస్ట్రార్లతో పాటు, బాహాటంగా తిరుగాడుతూ దళారుల్లా వ్యవహరించి ఏసీబీకి చిక్కిన దస్తావేజు లేఖర్లపై ఏసీబీ అధికారులు కేసులు సైతం నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు విశ్వనీయ సమాచారం. అయితే ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు ధ్రువీకరించలేదు. స్వాధీనం చేసుకున్న నగదు, ప్రత్యక్షంగా పట్టుబడ్డ రిజిస్ట్రార్లు, కార్యాలయ ఉద్యోగులు, సిబ్బందితో పాటు దస్తావేజు లేఖర్ల వివరణ తీసుకున్న అనంతరమే కేసులు నమోదు చేసే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు విలేఖరులకు తెలిపారు.
ఏడాది తిరగకుండానే మరోసారి ఆకస్మిక తనిఖీలు
చిత్తూరు గిరింపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గత ఏడాది కూడా ఇదే తరహాలో దాడులు జరిగి ఏసీబీ అధికారులు దాదాపు రూ. 75వేల అనధికార నగదును స్వాధీనం చేసుకుని సబ్ రిజిస్ట్రార్ అశోక్‌పై కేసు నమోదు చేశారు. సంబంధిత కేసు కోర్టులో నడుస్తుండగానే మరోసారి అదే రిజిస్ట్రార్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ వ్యవహారాలపై బహిరంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే అధికారి ఏళ్ల తరబడి అదే సీటును అంటిపెట్టుకొని ఉండటంతోనే ఇలా జరుగుతోందని ఆరోపణలు సైతం వినవస్తున్నాయి.
ప్రభుత్వ అధికారుల్లా దస్తావేజు లేఖర్లు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారుల తరహాలోనే దస్తావేజు లేఖర్లు కూడా పనిచేస్తున్నారు. వాస్తవానికి రిజిస్ట్రార్ కార్యాలయంలోకి దస్తావేజు లేఖర్లు, దళారులకు ప్రవేశం లేదు. కేవలం క్రయ, విక్రయదారులకు మాత్రమే కార్యాలయంలోకి అనుమతి ఉంది. అయితే చిత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహారాలు సాగిస్తుండటం గమనార్హం. దస్తావేజు లేఖర్లు రిజిస్ట్రార్ కార్యాలయానికి ఎదుటనే కార్యాలయాలు తెరచుకుని దస్తావేజులను తయారు చేయించడంతో పాటు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సైతం దర్జాగా వచ్చి రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పాలు పంచుకుంటున్నారు. మామూళ్లకు అలవాటు పడ్డ అధికారులు ఇచ్చిన చనువుతోనే ఇదంతా జరుగుతోందని తెలుస్తోంది. ఇకనైనా రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్లను బదిలీ, లేక వేరే శాఖకు పంపించడంతో పాటు, దళారి వ్యవస్థకు అడ్డుకట్ట వేయాలని వినియోగదారులు కోరుతున్నారు.