క్రైమ్/లీగల్

ఎ.సి.బి.కి చిక్కిన వి.ఆర్.ఒ.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడుగుల, నవంబర్ 14: వ్యవసాయ భూమికి పట్టాదారు పాస్ పుస్తకాన్ని మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన గ్రామ రెవిన్యూ అధికారి అవినీతి నిరోధక శాఖ (ఎ.సి.బి.) అధికారులకు బుధవారం చిక్కారు. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం మండలంలోని కస్పాజగన్నాధపురం గ్రామానికి చెందిన బీశెట్టి జగ్గారావు తండ్రికి చెందిన పది ఎకరాల వ్యవసాయ భూమి వంటర్లపాలెం గ్రామంలో ఉంది. అయితే జగ్గారావుతో పాటు మరో ఇద్దరు అన్నదమ్ములు ఈ భూమిని పంచుకోవలసి ఉండడంతో ఇందుకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు కోసం కస్పాజగన్నాధపురం వి.ఆర్.ఒ. శివరామక్రిష్ణను ఆశ్రయించగా పది వేల రూపాయల లంచం డిమాండ్ చేసారు. తాను అడిగిన డబ్బులు ఇస్తేనే పట్టాదారు పాస్‌పుస్తకాన్ని మంజూరు చేయిస్తానని వి.ఆర్.ఒ. చెప్పడంతో జగ్గారావు అడ్వాన్స్ రూపేణా ముందుగా వెయ్యి రూపాయలు చెల్లించారు. మిగిలిన తొమ్మిది వేల రూపాయలు ఇస్తేనే పని జరుగుతుందని, లేకుంటే లేదని వి.ఆర్.ఒ. నిర్మోహమాటంగా చెప్పడంతో జగ్గారావు చేసేదేమి లేక తరువాత మిగిలిన మొత్తాన్ని ఇస్తానని చెప్పారు. అయితే ఇటీవల జగ్గారావు వి.ఆర్.ఒ.ను సంప్రదించి తమ భూమికి పట్టాదారు పాస్‌పుస్తకం మంజూరు చేయాలని కోరగా తనకు ఇవ్వాల్సిన తొమ్మిది వేల సంగతేమిటని నిలదీసారు. దీంతో జగ్గారావు తన వద్ద ఉన్న రెండు వేల రూపాయలను వి.ఆర్.ఒ. శివరామక్రిష్ణకు ఇచ్చేందుకు ప్రయత్నించగా ఈ రెండు వేలు కంప్యూటర్ ఆపరేటర్‌కే సరిపోవని, మొత్తం డబ్బులు ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేసారు. తమ భూమికి పట్టాదారు పాస్‌పుస్తకం మంజూరు చేసేందుకు వి.ఆర్.ఒ. లంచం కోసం పెడుతున్న ఇబ్బందులతో విసిగిపోయిన జగ్గారావు విశాఖపట్నంలోని అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఎ.సి.బి. అధికారులు ఇచ్చిన సూచనల మేరకు మాడుగులలోని రావిచెట్టు జంక్షన్ వద్ద కొప్పాకవీధిలో నివాసం ఉంటున్న వి.ఆర్.ఒ. ఇంటికి జగ్గారావు బుధవారం వెళ్లి తొమ్మిది వేల రూపాయలను చెల్లించారు. వి.ఆర్.ఒ.కు డబ్బులు ఇచ్చిన వెంటనే ఎ.సి.బి. అధికారులు రంగంలోకి దిగి శివరామక్రిష్ణను పట్టుకున్నారు. అంతేకాకుండా శివరామక్రిష్ణ ఇంటిలో ఉన్న కంప్యూటర్‌ను ఎ.సి.బి. అధికారులు పరిశీలించారు. ఈ విషయమై ఎ.సి.బి. డి.ఎస్.పి. రామక్రిష్ణప్రసాద్ మాట్లాడుతూ లంచం తీసుకుంటూ పట్టుబడిన వి.ఆర్.ఒ. శివరామక్రిష్ణను అరెస్ట్ చేస్తున్నట్టు తెలిపారు. విశాఖపట్నంలోని ఎ.సి.బి. ప్రత్యేక న్యాయస్థానం మెజిస్ట్రేట్ ఎదుట వి.ఆర్.ఒ.ను గురువారం హాజరు పరిచి రిమాండ్‌కు తరలించనున్నట్టు ఆయన చెప్పారు. కాగా వి.ఆర్.ఒ. శివరామక్రిష్ణ ఎ.సి.బి.కి చిక్కిన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించడమే కాకుండా రెవిన్యూ అధికార, ఉద్యోగ వర్గాలను కలవరానికి గు రిచేసింది.