క్రైమ్/లీగల్

ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపుల కుంభకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 18: ఆదిలాబాద్ జిల్లా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపుల కుంభకోణం గుట్టురట్టయింది. గత నాలుగేళ్ళుగా స్టాంప్స్ రిజిస్ట్రేషన్ విభాగంలో బాండ్ పేపర్లు, స్టాంపుల విక్రయాలకు సంబంధించి రూ.78 లక్షలు దిగమింగిన ఇద్దరు ఇంటి దొంగలపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. అవినీతి అక్రమాలకు నిలయంగా ముద్రపడ్డ ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నకిలీ చలాన్లతో భూముల రిజిస్ట్రేషన్ కుంభకోణం అలజడి రేపగా తాజాగా స్టాంపులు, బాండ్ దస్త్రాల విక్రయాల్లో రూ.78లక్షలు స్వాహా చేసిన వ్యవహారం రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని కుదిపేస్తోంది. 2014 నుంచి ఆదిలాబాద్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో క్యాషియర్‌గా పనిచేస్తున్న ఇంతియాజ్, జూనియర్ అసిస్టెంట్ కపిల్ కుమార్ స్టాంపుల విక్రయాల కౌంటర్‌లో విధులు నిర్వర్తిస్తూ విక్రయించిన సొమ్మును ప్రభుత్వ ఖాతాలో జమచేయకుండా కాజేసినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. ఈ వ్యవహారంపై గతంలో రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారుల బృందం విచారణజరిపి ఇద్దరు ఉద్యోగులకు షోకాజు నోటీసులు జారీ చేయగా రికవరీ కింద ప్రభుత్వానికి రూ.3లక్షలు మాత్రమే జమచేసి చేతులు దులుపుకున్నారు. నకిలీ చలానాలు, పాత బాండ్లను గుట్టుచప్పుడు కాకుండా రియల్టర్లకు విక్రయించి భారీ ఎత్తున సొమ్ము చేసుకోవడం, స్టాంపులతో పాటు రిజిస్ట్రేషన్ స్టాంపు దస్త్రాలను విక్రయించి లక్షల్లో డబ్బును కాజేసినట్లు ఇటీవల జరిపిన విచారణలో వెల్లడైంది. కరీంనగర్‌కు చెందిన స్టాంప్స్ రిజిస్ట్రేషన్ విభాగం డీఐజీ ట్వింకిల్‌జాన్ ఆదేశాల మేరకు విచారణ బృందం ఇటీవల ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి, రికార్డులను స్వాదీనం చేసుకొని కూపీ లాగగా రూ.78లక్షల విలువైన స్టాంపులను విక్రయించి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడమేకాక పలు అక్రమాలకు పాల్పడ్డట్లు బట్టబయలైంది. క్యాషియర్ ఇంతియాజ్‌తో పాటు జూనియర్ అసిస్టెంట్ కపిల్ కుమార్‌లపై సస్పెన్షన్ వేటు విధించగా జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి జయవంత్‌రావు ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ టూటౌన్ సీఐ నాగరాజు క్రిమినల్ కేసులు నమోదు చేసి మంగళవారం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఒకే చోట నాలుగేళ్లకు పైగా పనిచేస్తూ సర్కారు సొమ్మును స్వాహా చేసిన వీరిద్దరిపై వేటు పడడమే గాక ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు ఉద్యోగులు, ప్రైవేట్ ఏజెంట్లపై పోలీసులు కూపీ లాగుతున్నారు. గతంలో ఏసీబీ దాడుల్లో భారీ ఎత్తున అక్రమాలు బయటపడగా భూముల క్రయ విక్రయాల్లోనూ, అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం బయటపడ్డాయి. తాజాగా రూ.78లక్షల స్టాంపుల కుంభకోణం జిల్లాలో కలకలం రేపుతోంది.