క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్రిపాడు, జనవరి 17: కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుండి రెండు కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొన్న దుర్ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఈఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం జాతీయ రహదారిపై గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగింది. గ్రామంలోని ఆదర్శపాఠశాల సమీపంలో గల ముంబై జాతీయ రహదారిపై కట్టెల లోడుతో ట్రాక్టర్ నాయుపల్లి నుండి ఆత్మకూరు వైపుకు వస్తోంది. బద్వేలు వైపు నుండి వస్తున్న మారుతి షిఫ్ట్ కారు ట్రాక్టర్‌ను వెనుకవైపు నుండి ఢీకొంది. దాని వెనుకనే వస్తున్న మరో కారు క్షణాల వ్యవధిలో ముందు ఉన్న మారుతి షిఫ్ట్‌ను వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో రెండు కార్లూ నుజ్జు నుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో మారుతీ షిఫ్ట్ కారును మహిళ డ్రైవ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ముందు కూర్చుని ఉన్న సుమారు 50 ఏళ్ల వృద్ధురాలు కారులోనే మృతిచెందింది. ఆమెతో పాటు డ్రైవింగ్ చేస్తున్న మహిళ మరో ముగ్గురు కారులో ఇరుక్కుపోయారు. తీవ్ర గాయాలపాలైన ముగ్గురినీ నందవరం గ్రామస్తులతో పాటు అటుగా వెళ్లే ప్రయాణికులు అతి కష్టం మీద బైటకు తీశారు. అలాగే మరో కారులో ఉన్న నలుగురిలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించగా వారిలో ఒక పురుషుడు, ఒక యువతి అత్యవసర చికిత్స పొందుతూ మృతిచెందారు. మిగిలిన ఆరుగురికి ప్రాథమిక చికిత్స అందించి నెల్లూరుకు తరలించారు. కాగా మొదట ప్రమాదానికి గురైన కారులో ఉన్నవారంతా బళ్లారికి చెందిన ముస్లిం కుటుంబంగా పోలీసులు భావిస్తున్నారు. నెల్లూరులో ఓ వివాహ వేడుకకు వెళ్ళే ప్రయత్నంలో ఈ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. మరో కారులోని వారి వివరాలు వెల్లడి కాలేదు. ట్రాక్టర్ ట్రాలీ డోర్లు సైడుకు దించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముందు వెళ్తున్న కారు ప్రమాదానికి గురైన క్షణాల వ్యవధిలోనే రెండవ కారు వేగంగా వచ్చి ముందు కారును ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు.
ఆత్మకూరు డి ఎస్పీ రామాంజనేయరెడ్డి, ఎస్ ఐ నరేష్, మర్రిపాడు ఎస్ ఐ తిరుపతయ్యలు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రోడ్డుకు అడ్డుగా పడి ఉన్న కట్టెలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.