క్రైమ్/లీగల్

పక్కా పథకంతోనే ఆర్మీ ఉద్యోగి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేబ్రోలు, ఫిబ్రవరి 4: పవిత్రమైన దేశరక్షణ రంగం (ఆర్మీ)లో పనిచేస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి, మోసగించి చివరకు దారుణ హత్యకు గురైన ఓ ఆర్మీ ఉద్యోగి ఉదంతమిది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను డీఎస్పీ కె ప్రకాష్‌బాబు సోమవారం చేబ్రోలులో విలేఖర్లకు వెల్లడించారు. విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం, ధన్నానపేటకు చెందిన చందక సత్యనారాయణ అనే యువకుడు ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఇతను శ్రీకాకుళం జిల్లా జి సిగడం మండలం, పెనసం గ్రామానికి చెందిన లచ్చిరెడ్డి వెంకట రమణ అనే స్నేహితునితో కలిసి నిరుద్యోగ యువతకు రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ముగ్గురు వ్యక్తుల నుండి ఒక్కొక్కరి నుండి 12 లక్షల రూపాయల చొప్పున 36 లక్షల రూపాయలను వసూలు చేశారు. ఉద్యోగాలు రాకపోవడంతో బాధితుల ఒత్తిడి తీవ్రమైంది. ఈ నేపథ్యంలో డబ్బుల విషయంలో వెంకట రమణ, సత్యనారాయణ మధ్య మనస్పర్దలు వచ్చాయి. అంతేకాక సత్యనారాయణను అడ్డుతొలగించుకుంటే తానే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మరికొందరి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసుకోవచ్చని వెంకట రమణ పథకం రూపొందించాడు. ఇందుకు శ్రీకాకుళం జిల్లా జి సిగడం మండలం వాడ్రంకి గ్రామానికి చెందిన చింతాడ రమేష్ అనే మరో యువకుని సహాయం కూడా తీసుకున్నాడు. ఇందుకు ప్రతిఫలంగా రమేష్‌కు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని కూడా నమ్మబలికాడు. వీరిద్దరూ సత్యనారాయణను హత్య చేసేందుకు వ్యూహం రచించుకుని, గత నెల 26వ తేదీన సత్యనారాయణ సోదరుడికి మగబిడ్డ జన్మించగా అతన్ని చూసేందుకు సత్యనారాయణ నెల రోజుల సెలవుపై వెళ్లే క్రమంలో వెంకట రమణ అతనికి ఫోన్‌ చేశాడు. వెంటనే గుంటూరు రావాలని ఇక్కడ ఉద్యోగం కోసం డబ్బులు కట్టేందుకు మరికొందరు సిద్ధంగా ఉన్నారంటూ నమ్మించాడు. ఈ మాటలు నమ్మిన సత్యనారాయణ గుంటూరు వచ్చాడు. గుంటూరు బస్టాండ్ నుంచి వెంకట రమణ, మరో నిందితుడు రమేష్‌లిద్దరూ సత్యనారాయణను మోటారు బైకుపై మధ్యలో కూర్చోబెట్టుకుని వట్టిచెరుకూరు మండల పరిధిలోని కొర్నెపాడు - లింగాయపాలెం గ్రామాల మధ్యలోకి తీసుకెళ్లి పథకం ప్రకారం మట్టుబెట్టారు. ఒకరు బైకు నడుపుతుండగా, వెనుక కూర్చున్న వ్యక్తి కత్తితో సత్యనారాయణ గొంతుకోసి, పొడిచి హతమార్చి ఆనక మృతదేహాన్ని పంటకాల్వలో పడవేసి ఇద్దరూ పారిపోయారు. గత నెల 28వ తేదీన గుర్తించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పరిశీలించి అక్కడ లభించిన ప్రాథమిక ఆరాధాలను బట్టి చేబ్రోలు సిఐ డి నరేష్‌కుమార్, వట్టిచెరుకూరు ఎస్‌ఐ డి వినోద్‌కుమార్ దర్యాప్తు ముమ్మరం చేశారు. అంతేకాక గుంటూరు అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు ఆదేశాల మేరకు గుంటూరు సౌత్ డిఎస్‌పి ఆర్‌విఎస్‌ఎన్ మూర్తి, మరో డిఎస్‌పి ప్రకాష్‌బాబు పర్యవేక్షణలో కేసును త్వరితగతిన ఛేదించారు. ఇద్దరు నిందితులు వెంకట రమణ, రమేష్‌లను చేబ్రోలులో సోమవారం అరెస్ట్‌చేసి కోర్టుకు హాజరుపర్చారు. నిందితులిద్దరూ గుంటూరు మిర్చియార్డు వద్ద గల శీతలగిడ్డంగిలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తులతో పాటు సెల్‌ఫోన్‌లు, చెక్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు.