క్రైమ్/లీగల్

ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొమరోలు: సంపాదనకు మించి అప్పులు చేయడం, వాటి భారం రోజురోజుకు పెరిగిపోతుండటంతో తీర్చే దారిలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లినగరం గ్రామంలో ఈ విషాద సంఘటన శనివారం వేకువజామున చోటు చేసుకుంది. ఈ ఘటనలో జక్కా రాఘవేంద్ర నాగరాజు (42), భార్య ఈశ్వరిదేవి (38), పెద్దకుమార్తె వైష్ణవి (15), చిన్నకుమార్తె వరలక్ష్మి (12) పురుగుల మందు తాగి తనువు చాలించారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన జక్కా రాఘవేంద్ర నాగరాజు డిగ్రీ చదివి ఉద్యోగాలు రాకపోవడంతో స్నేహితుడు బెంగళూరులో నిర్వహిస్తున్న రెస్టారెంట్‌లో ఉద్యోగం చేసేందుకు పదేళ్ల క్రితం వెళ్లాడు. అక్కడ నెలకు రూ.30 వేల జీతం సంపాదించేవాడు. సంపాదనకు మించి ఖర్చులు పెరగడంతో పాటు జూదాలకు కూడా బానిసై స్వగ్రామమైన అల్లినగరంలో ఇద్దరి వద్ద రూ.3 లక్షలు, బెంగళూరులో కూడా పరిచయం ఉన్న వారి వద్ద మరో రూ.10 లక్షల మేర అప్పులు చేసినట్లు సమాచారం. అప్పులు తీర్చేందుకు సొంత ఇంటిని కూడా రూ.3 లక్షలకు స్వయానా బావకు విక్రయించాడు. కానీ సకాలంలో డబ్బు సమకూరలేదని అందువల్ల తాను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోలేనని ఆయన బావ తెలిపాడు. అంతవరకు ఇంట్లోనే ఉండాలని సూచించారు. అప్పు తీర్చాలనే ఆశలు అడియాశలు కావడంతో నాగరాజు ఆవేదనకు గురయ్యాడు. దీంతో భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలను అల్లినగరంలోనే ఉంచి తాను బెంగళూరులో ఉంటూ వచ్చాడు. పెద్దకుమార్తె అదే గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతుండగా, చిన్న కుమార్తె వరలక్ష్మి అక్కడే ఎంపీపీ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఈక్రమంలో బెంగళూరులో అప్పు ఇచ్చిన వాళ్లు తీర్చాలని ఒత్తిడి పెంచారు. అక్కడ ఉండలేక తరచూ స్వగ్రామానికి వస్తుండేవాడు. అయితే ఇక్కడ అప్పులు ఇచ్చిన వాళ్లు కూడా తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. అన్నిచోట్లా అప్పుల భారం చుట్టుముట్టడం, సంపాదన నిలిచిపోవడంతో నాగరాజు కుటుంబాన్ని కూడా పోషించుకునేందుకు ఇబ్బందులు పడ్డాడు. అన్నివైపుల నుంచి సమస్యలు చుట్టుముట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యే శరణ్యమనే నిర్ణయానికి వచ్చాడు. తన కుటుంబం ఆత్మహత్య చేసుకునేందుకు అప్పుల భారమే ప్రధాన కారణమని, తన కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, తన ఇల్లు కొనుగోలు చేసిన తన బావ ఇవ్వవలసిన రూ.3 లక్షలు అల్లినగరంలో తాను అప్పుచేసిన ఇరువురికి ఇవ్వాలని వివరిస్తూ సూసైడ్ నోట్ రాశాడు. శుక్రవారం రాత్రి పురుగుల మందు డబ్బాతోపాటు ఒక మద్యం సీసా, కూల్‌డ్రింక్ బాటిళ్లను ఇంటికి తెచ్చుకున్నాడు. భార్య ఈశ్వరిదేవి, ఇద్దరు కుమార్తెలకు భోజనం పెట్టి అర్థరాత్రి వరకు వారితో మాట్లాడుతూ కాలం గడిపింది. ఈలోగా మద్యం సేవించిన నాగరాజు తన భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలకు పురుగుల మందు కలిసిన కూల్‌డ్రింక్‌ను తాగించాడు. అనంతరం నాగరాజు కూడా మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగాడు. దీంతో భార్య ఈశ్వరిదేవి పడకగదిలోనే మృతి చెందగా నాగరాజు మరో గదిలో చనిపోయాడు. ఇద్దరు కుమార్తెలు కొన ఊపిరితో ఉన్నారు. పక్కింటి వారికి నాగరాజు ఇంటి నుంచి పురుగుల మందు వాసన రావడంతో అనుమానించి అక్కడకు వెళ్లి తలుపుతట్టి పిలిచారు. ఎంతసేపటికి లోపలి నుంచి సమాధానం రాకపోవడంతో వెంటనే వారు గ్రామంలోని నాగరాజు బంధువులకు తెలియజేశారు. అందరూ కలిసి అర్థరాత్రి తర్వాత ఇంట్లోకి వెళ్లి చూడగా భార్యాభర్తలు మృతి చెంది ఉన్నారు. కుమార్తెలిద్దరూ కొన ఊపిరితో ఉండటంతో సమాచారాన్ని కొమరోలు ఎస్సై బ్రహ్మనాయుడుకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూసి గ్రామస్థుల సహకారంతో ప్రైవేటు వాహనంలో మృతుల కుమార్తెలను మండల కేంద్రంలోని వైద్యశాలకు తరలించారు. కానీ మార్గమధ్యంలోనే పెద్దకుమార్తె వైష్ణవి మృతి చెందింది. చిన్న కుమార్తె వరలక్ష్మిని గిద్దలూరు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది.