క్రైమ్/లీగల్

తిరుమలలో 3 నెలల బాలుడి కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 17: తిరుమలలో మూడు నెలల బాలుడు ఆదివారం తెల్లవారుజామున కిడ్నాప్‌కు గురయ్యాడు. తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న బాలుడిని ఓ గుర్తుతెలియని మహిళ తీసుకెళుతున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. ఆమెను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాగా గత నాలుగేళ్లలో ముగ్గురు చిన్నారులు కిడ్నాప్‌కు గురవడం గమనార్హం. ఈ సంఘటనలు శ్రీవారి భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తిరుమల పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం విల్లిపురం జిల్లా, నరికురువన్ కాలనీకి చెందిన మావీరన్, అతని భార్య కౌసల్యతో కలిసి తిరుమలలో అనధికారికంగా చిరు వ్యాపారం చేసుకుంటూ షాపింగ్ కాంప్లెక్స్‌లోని మొదటి అంతస్థులో ప్రతిరోజూ నిద్రిస్తుంటారు. తమ మూడు నెలల బిడ్డ వీరన్‌తో కలిసి శనివారం రాత్రి షాపింగ్ కాంప్లెక్స్‌లోనే నిద్రించారు. ఆదివారం తెల్లవారుజామున వీరన్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ బిడ్డ కోసం తిరుమల మొత్తం గాలించారు. అయితే బిడ్డ ఆచూకీ లభించకపోవడంతో కిడ్నాప్ జరిగిందేమోనన్న అనుమానంతో సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులకు తల్లితండ్రుల వద్ద నిద్రిస్తున్న మూడు నెలల వీరన్‌ను ఓ మహిళ ఆదివారం తెల్లవారుజామున 2.43 గంటలకు తీసుకెళుతున్న దృశ్యాలను గుర్తించారు. ఈసందర్భంగా తిరుమల ఏఎస్పీ మహేశ్వరరాజు విలేఖరులతో మాట్లాడుతూ ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామని, కిడ్నాప్ చేసిన మహిళను పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కిడ్నాప్ చేసిన మహిళ ఫొటోలు, వీడియోలను విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. డిఎస్పీ, సీఐలు, ఎస్‌ఐలతో కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కాగా తిరుమలలో గత నాలుగేళ్లలో ముగ్గురు చిన్నారులు కిడ్నాప్‌కు గురైతే అందులో ఓ బిడ్డను ఎత్తుకెళ్లిన భార్యాభర్తలు తమంతట తాము పోలీసుల ఎదుట లొంగిపోయారు. మరో సంఘటనలో కిడ్నాపర్‌ను మహారాష్టక్రు చెందిన స్థానికులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఇప్పడు జరిగిన కిడ్నాప్ ఎలా ముగుస్తుందో, కిడ్నాపర్‌ను ఎలా పట్టుకోవాలోనని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. తిరుమల కొండపై అధిక సంఖ్యలో అనధికార హాకర్లు, లడ్డూ దళారులు, యాచకులుగా జీవిస్తున్నవారు ఉన్నారు. తమ అవసరాలకు అనేక అసాంఘిక కార్యక్రమాలకు, నేరాలకు పాల్పడుతు అటు టీటీడీకి, ఇటు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. వీరిని గుర్తించి చర్యలు తీసుకోవడంలో అటు పోలీసులకు, ఇటు టీటీడీ విజిలెన్స్ అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుమలలో చోటుచేసుకుంటున్న చిన్నారుల కిడ్నాప్‌లు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు మాయని మచ్చగా మారుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.