క్రైమ్/లీగల్

ఐదుగురు మిలిటెంట్ల హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, మార్చి 22: జమ్మూకాశ్మీర్‌లోని బండిపొర, షోపియాన్ జిల్లాల్లో శుక్రవారం జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు మిలిటెంట్లు హతమయ్యారు. ఇందులో ఒక ఆపరేషన్ సందర్భంగా ఉగ్రవాదులు తమ వద్ద బందీగా ఉన్న ఒక బాలుడిని కిరాతకంగా హతమార్చారు. హతమయిన ఐదుగురు మిలిటెంట్లలో ఇద్దరు పాకిస్తాన్‌కు చెందిన వారు ఉన్నారు. ఈ ఐదుగురు మిలిటెంట్ల మృతితో రాష్ట్రంలో గత 24 గంటల్లో మృతి చెందిన మొత్తం మిలిటెంట్ల సంఖ్య అయిదుకు పెరిగింది. బండిపొర జిల్లా హాజిన్ ప్రాంతంలో గురువారం రాత్రి నుంచి జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్ ఎ తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ గురువారమే మొదలయినప్పటికీ మిలిటెంట్లు ఇద్దరు పౌరులను తమ వద్ద బందీలుగా ఉంచుకోవడం వల్ల భద్రతా బలగాలు అప్రమత్తంగా ఆచితూచి ముందడుగు వేశాయని వారు వివరించారు. ఉగ్రవాదుల వద్ద బందీగా ఉన్న ఒక పౌరుడిని
గురువారం సాయంత్రమే రక్షించినప్పటికీ, మరో బందీ 12 ఏళ్ల బాలుడు మాత్రం ఆపరేషన్ సందర్భంగా మృతి చెందాడని వారు వివరించారు. హతమయిన ఈ ఇద్దరు మిలిటెంట్లను పాకిస్తాన్ పౌరులయిన అలీ, హుబాయిబ్‌గా గుర్తించినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. అబ్దుల్ హమీద్ అనే బందీని సురక్షితంగా విడిపించినట్టు చెప్పారు. మృతి చెందిన బాలుడిని ఆతిఫ్ అహ్మద్‌గా గుర్తించారు. ఆ బాలుడిని కాపాడలేక పోయామని, ఉగ్రవాదులు అతడిని కిరాతకంగా హతమార్చారని తెలిపారు.
ఇదిలా ఉండగా, షోపియాన్ జిల్లాలో శుక్రవారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గుర్తు తెలియని ఒక ఉగ్రవాది మృతి చెందాడు. మిలిటెంట్లు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు ఇమామ్‌సాహిబ్ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయని ఒక ఆర్మీ అధికారి తెలిపారు. భద్రతా బలగాలను గమనించిన మిలిటెంట్లు కాల్పులు జరపడం ప్రారంభించారని, దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయని ఆయన తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మృతి చెందాడని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఆయన వివరించారు.
ఇదిలా ఉండగా, ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్ ప్రాంతంలో మిలిటెంట్లకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయని, ఈ ఆపరేషన్‌లో ఇప్పటి వరకు ఎవరూ చనిపోలేదని ఒక పోలీసు అధికారి తెలిపారు. కాగా, బారాముల్లా జిల్లాలోని కలంతర వద్ద గురువారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైష్ ఎ మహమ్మద్ (జేఈఎం)కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక అధికారి సహా ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి.