క్రైమ్/లీగల్

రూ.5.07 కోట్ల కరెన్సీ సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఏప్రిల్ 5: ఇరవై ఐదు మంది ప్రయాణికులతో విశాఖపట్నం నుంచి పాలకొండకు కొద్ది నిమిషాల్లో చేరనున్న ఆర్టీసీ బస్సు నుంచి 5.07 కోట్ల నగదును రాజాం పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ బస్సులో మాజీ జడ్పీచైర్మన్ పాలవలస రాజశేఖరం తనయుడు, పాతపట్నం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి సోదరుడు పాలవలస విక్రాంత్ ఉండటంతో ఆయనకు చెందిన సొత్తే అన్న అనుమానాలను పోలీసులు వ్యక్తపరుస్తున్నారు. పక్కా సమాచారం పోలీసులకు అందడంతో రాజాం సమీపంలోని జెండాలదిబ్బ వద్ద విక్రాంత్ ప్రయాణిస్తున్న బస్సును పోలీసులు ఆపి సోదా చేయగా బస్సు లగేజ్ క్యారియర్‌లో మూడు బ్యాగ్‌లు లభ్యమయ్యాయి. ఇందులో భారీ ఎత్తున 2000, 500, 200, 100 నోట్లు కలిగిన కట్టలు ఉండడంతో దానిని రాజాం పోలీసు స్టేషన్ హౌస్‌కు తీసుకువెళ్ళి లెక్కించారు. కిలోమీటరు ప్రయాణానికి కూడా కారును వాడే విక్రాంత్ లాంటి నేత విశాఖపట్నం నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించడంతో ఈ సొమ్ము విక్రాంతివేనని పోలీసులు, స్థానికులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విక్రాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ సొమ్ము తనది కాదని విక్రాంత్ తేల్చేశారు. దీంతో బస్సులో ప్రయాణికులను, కండక్టర్, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇంటరాగేషన్ చేసారు.
అయితే, విక్రాంత్ తనది ఆ సొమ్ముకాదని చెప్పినప్పటికీ, పాలకొండ వైసీపీ అభ్యర్థి వి.కళావతి, రాజాం వైసీపీ అభ్యర్థి కంబాల జోగులు ప్రచార వ్యవహారాలన్నీ మాజీ జడ్పీ చైర్మన్ పాలవలస రాజశేఖరం ఇంటి నుంచే సాగుతుండడం గమనార్హం. దీంతోపాటు పాతపట్నం వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి సొంత ఇంటి నుంచే ఆమె ఎన్నికల మేనేజ్‌మెంటు అంతా సాగుతుండడం, ఆ ఇంటికి చెందిన విక్రాంత్ ఆ బస్సులో ప్రయాణం చేయడం, ఆ బ్యాగులపై రాజాం, పాలకొండ, పాతపట్నం అంటూ రాసివుండడంతో ఖచ్చితంగా రూ. 5 కోట్ల ఏడు లక్షల 88,900లు వైసీపీ పార్టీ సొమ్ముగానే పోలీసులు దృఢంగా నమ్మినప్పటికీ, ఈ సొమ్మును ఎవరూ క్లైమ్ చేయకపోవడంతో ఎవరిపై కేసు ఇంకా నమోదు చేయలేదు. రాజాం సీఐ రమణ ఆధ్వర్యంలో సిబ్బంది సోదాల్లో ఈ నగదు పట్టుబడగా, పాలకొండ డిఎస్పీ ప్రేమ్‌కాజల్ దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నవదీప్‌సింగ్ గ్రేవాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతిపెద్ద మొత్తంలో ఎన్నికల సమయంలో నగదు పట్టుబడిందన్నారు. అయితే, ఈ సొమ్ము అంతా ఎవరికి చెందినది అన్నది ఇంకా విచారణ జరుగుతుందన్నారు. వైసీపీ నేతలకు చెందిన రూ.కోట్లుగానే అనుమానాలు ఉన్నాయని సుస్పష్టం చేసారు. కానీ, ఈ నగదు మాదంటూ ఎవరూ క్లైమ్ చేయకపోవడంతో క్రైం నెం. 119/2019లో 102 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు వివరించారు. ఇంతమొత్తం నగదును స్వాధీనం చేసుకున్న రాజాం పోలీసులను ఎస్పీ అభినందించారు.