క్రైమ్/లీగల్

కరీంనగర్‌లో దొంగతనం..పర్బనీలో అమ్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఫిబ్రవరి 9: కరీంనగర్‌లో యధేచ్ఛగా లారీలను ఎత్తుకెళ్తూ, మహారాష్ట్ర పర్బనీ జిల్లా కేంద్రంగా విడిభాగాల కింద అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు అయింది. ఎత్తుకెళ్లిన లారీకి జీపీఎస్ విధానం ఉండటంతో గత కొనే్నళ్లుగా చోరీలకు పాల్పడుతున్న ముఠా స్థావరం ఎట్టకేలకు చిక్కింది. దీంతో కరీంనగర్ రూరల్ పోలీసులు చాకచక్యంగా పర్బనీ జిల్లా కేంద్రంగా ఉన్న స్థావరంపై దాడిచేయగా, ముఠాలోని ఒకరు చిక్కగా, ఇద్దరు అసలు నిందితులు పరారయ్యారు. పోలీసులకు పట్టుబడిన మహారాష్ట్ర పర్బనీ జిల్లా పూర్ణ తాలూక సుహాగణ్ గ్రామానికి చెందిన గజానన్ సామ్బోజీ బోస్లే (28) అనే నిందితుడిని కరీంనగర్‌కు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి ముఠా వివరాలను వెల్లడించారు. సీపీ కథనం ప్రకారం...మహారాష్ట్ర పర్బనీ జిల్లా కేంద్రానికి చెందిన రహీంఖాన్ సాహెబ్ అనే వ్యక్తి పర్బనీ పట్టణంలోని సాగర్ సర్గం సొసైటీ ఏరియాలో జన సంచారం తక్కువగా ఉండి చుట్టు తుమ్మల పొదలతో ఉన్న ప్రదేశంలో నాలుగు గుంటల స్థలంలో ఎంత పెద్ద వాహనం పెట్టినా కనపడకుండా, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా పెద్ద ఎతె్తైన రేకులను కాంపౌడ్ వాల్‌గా కట్టి, దానికి ఒక గేట్ పెట్టి పెద్ద షెడ్డు నిర్మించాడు. ఆ తరువాత రహీం వివిధ రాష్ట్రాల్లో ఏజెంట్లను పెట్టుకుని వారి ద్వారా పార్కింగ్, కొద్ది రోజులుగా నిలిపి ఉంచిన లారీలు, ట్రక్‌లు, వ్యాన్‌లాంటి పెద్దపెద్ద వాహనాల వివరాలను సేకరించి, సమాచారమిచ్చిన ఏజెంట్‌కు ఒక్కో వాహనానికి రూ.10నుంచి రూ.20వేలు ఇస్తూ తన వద్ద ఉన్న డ్రైవర్‌లతో ఆయా వాహనాలను తన స్థావరానికి తెప్పించుకోవడం, షెడ్‌కు వచ్చిన కొద్ది గంటల్లోనే వర్కర్స్‌తో వాహనాలను విడి భాగాలుగా విడగొట్టి విలువైన వాటిని బయట మార్కెట్‌లో, మిగతా బాగాలను స్క్రాప్ కింద అమ్ముతూ సొమ్ముచేసుకుంటున్నాడు. కరీంనగర్‌తోపాటు వివిధ జిల్లాల్లో, రాష్ట్రాల్లో పెద్ద వాహనాల చోరీలు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ఇదే తరహాలో ఈ నెల 4న కరీంనగర్ శివారులోగల లారీ అసోసియేషన్ పార్కింగ్ స్థలంలో పార్క్ చేసిన రూ.7లక్షల విలువచేసే (ఎపి15ఎక్స్-9522) అనే నెంబరు గల లారీని అపహరించారు. దీంతో లారీ యజమాని నారదాసు మారుతీరావు రూరల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే, లారీకి జీపీఎస్ విధానం ఉండటం, మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసిగాలిస్తుండటంతో పాటు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఎట్టకేలకు దొంగిలించిన లారీ ఉన్న పర్బనీలోని స్థావరాన్ని గుర్తించారు. ఈ మేరకు కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ శశిధర్‌రెడ్డి నేతృత్వంలో మూడు బృందాలు వెళ్లి ఆ స్థావరంపై దాడిచేయగా, ముఠాలోని ఒకరు లారీ ఎత్తుకెళ్లిన గజానన్ సామ్బోజీ బోస్లే చిక్కగా, అసలు నిందితులు రహీం ఖాన్ సాహెబ్, విజయ్ పారిపోయారు. గజానన్‌ను అదుపులోకి తీసుకుని, దొంగిలించిన లారీకి సంబంధించిన విడి బాగాలను, లారీని విడగొట్టిన కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. గజానన్ సామ్బోజీ బోస్లేను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిస్తామని, పరారీలో ఉన్న ఇద్దరి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు పర్బనీ, నాందెడ్, ఔరంగాబాద్ జిల్లాలలో గాలిస్తున్నాయని సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. చోరీని ఛేదించిన రూరల్ పోలీసులను సీపీ అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, రూరల్ ఏసీపీ ఉషారాణి, సీఐ శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.