క్రైమ్/లీగల్

‘రివ్యూ’ కుదరదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 7: యాభై శాతం వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలంటూ రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితర 21 ప్రతిపక్ష పార్టీల నాయకులకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నాయకత్వంలోని ధర్మాసనం మంగళవారం ప్రతిపక్షాల రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ వ్యవహారాన్ని ధర్మాసనం కేవలం ఒక నిమిషంలో ముగించటం చర్చనీయాంశమైంది. రంజన్ గొగోయ్ నాయకత్వంలోని ధర్మాసనం ప్రతిపక్షాల రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించినప్పుడు చంద్రబాబు, ఫరూక్ అబ్దుల్లా, సీపీఐ నాయకుడు డీ.రాజా మరికొందరు ప్రతిపక్ష నాయకులు కోర్టులోనే ఉండటం గమనార్హం. ప్రతి శాసనసభ పరిధిలోని ఐదు పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను వీవీ ప్యాట్ స్లీప్పులతో పోల్చి చూడాలన్న తమ (ఏప్రిల్ 8వ తేదీ) ఆదేశాన్ని పునఃపరిశీలించే ప్రసక్తే లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. యాభై శాతం వీవీ ప్యాట్ స్లిప్పులను ఈవీఎంలతో పోల్చి చూడాలని చంద్రబాబు తదితర ప్రతిపక్ష నాయకులు ఇటీవల రివ్యూ పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే. ప్రతి శాసనసభ నియోజకవర్గంలోని ఒక వీవీ ప్యాట్ స్లప్పులకు బదుల ఐదు వీవీ ప్యాట్ స్లిప్పులను ఈవీఎంలతో పోల్చి చూడాలన్న తమ ఆదేశాన్ని పునఃపరిశీలించాలనే ఆలోచన తమకు ఎంత మాత్రం లేదని ఉన్నత న్యాయస్థానం ప్రకటించటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఉన్నత న్యాయ స్థానం ప్రకటించిన ఈ నిర్ణయంతో ప్రతిపక్షాలు చేస్తున్న ఈ డిమాండ్‌కు ఇక తెర పడుతుందని ఆశిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వి ప్రతిపక్షాల తరపున వాదిస్తూ 25 లేదా 33 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించేందుకు ఆదేశించినా తాము సంతోషిస్తామని కోర్టుకు విన్నవించుకున్నారు. ఈవీఎంలతో వీవీ ప్యాట్ స్లిప్పులను పోల్చి చూడాలన్న ప్రతిపక్షాల వాదనతో ఏకీభవించిన మీరు కేవలం రెండు శాతం వీవీ ప్యాట్ స్లిప్పులను పోల్చి చూడాలని ఆదేశించారు.. అయితే ఈ రెండు శాతాన్ని ఇరవై ఐదు లేదా ముప్పై మూడు శాతానికి పెంచినా తమకు సంతోషం కలుగుతుందని అభిషేక్ సింఘ్వి వాదించారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజల విశ్వాసం పెరగాలంటే ఈవీఎంలను వీవీ ప్యాట్ స్లిప్పులతో పోల్చి చూడవలసిన అవసరం ఎంతో ఉన్నదని సింఘ్వి సూచించారు. ప్రతివాదులు ఈ ప్రక్రియకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని కోర్టుకు అందజేశారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఇదిలా ఉంటే యాభై శాతం వీవీ ప్యాట్ స్లిప్పులను ఈవీఎంలతో పోల్చి చూడడం వలన ఎన్నికల ఫలితాల ప్రకటన చాలా ఆలస్యమవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తమ పిటిషన్‌లో వాదించటం తెలిసిందే. యాభై శాతం స్లిప్పులను లెక్కించటం సాధ్యం కాదనేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పలు సాంకేతికపరమైన అంశాలను కోర్టు ముందు పెట్టింది.
తీర్పును గౌరవిస్తాం
సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు గౌరవిస్తాయని చంద్రబాబు చెప్పారు. తీర్పు అనంతరం చంద్రబాబు, తదితర ప్రతిపక్ష నాయకులు విలేఖరులతో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను మరింత పెంచాలనే లక్ష్యంతోనే తాము సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేసినట్లు తెలిపారు. చంద్రబాబుతోపాటు ఎన్‌సీ అధినాయకుడు ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్, టీఎంసీ నాయకుడు డెరిక్ ఒబ్రేన్, లోక్ తాంత్రిక్ జనతాదళ్ సీనియర్ నాయకుడు శరద్ యాదవ్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, రాజ్యసభలో బీఎస్పీ పక్షం నాయకుడు సతీష్ చంద్ర మిశ్రా, డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులు రివ్యూ పిటిషన్‌పై సంతకాలు చేసిన విషయం తెలిసిందే.
చిత్రం... సుప్రీం కోర్టు వెలుపల విలేఖరులతో మాట్లాడుతున్న విపక్షాల తరఫు లాయర్, కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి. చిత్రంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, సీపీఐ నాయకుడు డి.రాజా తదితరులు