క్రైమ్/లీగల్

నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: హైదరాబాద్ నగరంలో ఓ నకిలీ పోలీసు అధికారిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆర్మీ, ఎన్‌ఐఏ, ఐపీఎస్‌ను అంటూ అనేక మోసాలకు పాల్పడిన నకిలీ అధికారి వివరాలను బషీర్‌బాగ్‌లోని సిటీ పోలీసు కమిషనరేట్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. కడప జిల్లాకు చెందిన కార్‌నాటి గురువినోద్ కుమార్ రెడ్డి(25) నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తాడు. ఎన్‌ఐఏ అదనపు ఎస్పీనంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. నిందితుడి నుంచి నకిలీ తుపాకీ, ల్యాప్‌టాప్, ఎన్‌ఐఏ, ఆర్మీతో పాటు వివిధ సంస్థలకు చెందిన రబ్బర్ స్టాంపులు, ఆరు సెల్‌ఫోన్లు, హెడీ ప్రొజెక్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడు గతంలోనూ నకిలీ గుర్తింపు కార్డులతో కొందరిని బెదిరించి జైలుకు వెళ్లాడు. జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ బెదిరింపులు, మోసాలకు పాల్పడ్డాడని సీపీ వివరించారు. ఐపీఎస్ కావాలనేది అతడి కల నెరవేరకపోవడంతో వక్రమార్గం పట్టాడు. 2017 సంవత్సరంలో అశోక్ నగర్‌లోని ఆర్‌సీ రెడ్డి సివిల్స్ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందాడు.
సివిల్స్‌కు ఎంపిక కాకపోవడంతో తప్పుడు గుర్తింపు కార్డులు సృష్టించి నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తాడు. ఈక్రమంలో అనేక మార్లు వివిధ కేసుల్లో జైలుకు వెళ్లాడు. 2016లో సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ఫెయిలయ్యాడు. అయినా తన ఇంటి వద్ద ఉన్న స్నేహితులకు మాత్రం పరీక్ష పాసయ్యానని, ఐపీఎస్ శిక్షణకు వెళ్తున్నట్లు నమ్మబలికాడు. ఓ కేసులో 2019లో జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడ్డాడు. కాగా ఆర్‌సీ రెడ్డి కోచింగ్ సెంటర్‌లో సోషియాలజీ అధ్యాపకునిగా పనిచేస్తున్న రిటైర్డ్ ఆర్మీ మేజర్ గేదాల శ్రీనివాసరావుతో నిందితుడు పరిచయం పెట్టుకున్నాడు. దాన్ని ఆసరా చేసుకుని ఆయన ఇంట్లోంచి తుపాకీతో ఇతర వస్తువులు తస్కరించాడు.
శ్రీనివాస రావుకు అనుమానం వచ్చి ఎన్‌ఐఏ ఆశ్రయించారు. దీంతో గురువినోద్ కుమార్ రెడ్డి అసలు విషయం బయటపడింది. అతడిపై శ్రీనివాస రావుగాంధీనగర్ పోలీసు స్టేషన్‌లో కేసుపెట్టారు. కాగా జనవరి 12న తిరుమల్‌గిరిలోని డిఫెన్స్ మేనేజ్‌మెంట్ కాలేజీ (సీడీఏం) క్యాంపస్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అక్కడ ఎన్‌ఐఏ అసిస్టెంట్ కమాండంట్ అన్న నకిలీ ఐడీ కార్డును చూపడంతో గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది పరిశీలించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కూడా కేసు నమోదైంది. వినోద్‌ను చిక్కడపల్లి గోల్కొండ క్రాస్ రోడ్డులో టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి పిస్టల్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు. విలేఖరుల సమావేశంలో టాస్క్ఫోర్స్ డీసీపీ పీ రాధా కిషన్ రావు, ఇన్‌స్పెక్టర్ ఎస్ శ్రీనివాస రావు, ఎస్‌ఐ కే శ్రీనివాసులు పాల్గొన్నారు.

చిత్రం... నకిలీ ఐపీఎస్ అధికారి నుంచి స్వాధీనం చేసుకున్న పిస్టల్, నకిలీ
రబ్బర్ స్టాంపులు, ఐడీ కార్డులను పరిశీలిస్తున్న సీపీ అంజనీ కుమార్