క్రైమ్/లీగల్

కట్నం వేధింపులకు ఇద్దరు పిల్లలు సహా తల్లి బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నవరం, జూన్ 10: అత్తింటి వరకట్న వేధింపులకు మూడు పదుల వయసు కూడా లేని ఒక యువతి ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు బలైపోయారు. భర్త, అత్తింటివారే వారిని హత్యచేశారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం గ్రామంలో సోమవారం ఉదయం ఈ ఘోరం చోటుచేసుకుంది.
మృతురాలి బంధువుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి... విశాఖ జిల్లా నాతవరం మండలం కొత్తనాయుడుపాలెం గ్రామానికి చెందిన కొరుప్రోలు రాజబాబు కుమార్తె సుష్మారాజ్యలక్ష్మి (25)ను తూర్పు గోదావరి జిల్లా అన్నవరం గ్రామానికి చెందిన తాళ్లపురెడ్డి వెంకటరమణ (రమేష్)కిచ్చి 2013లో వివాహం చేశారు. వివాహ సమయంలో ఖర్చులకు రూ.లక్ష, ఆడపడుచు లాంఛనాలకు మరో రూ.లక్ష, రెండు తులాల బంగారం రాజ్యలక్ష్మి తల్లిదండ్రులు సమర్పించుకున్నారు.
వారికి సాత్విక్ ప్రదీప్ (3), యువన్ (తొమ్మిది నెలలు) అనే మగపిల్లలు. కాగా గత కొంతకాలంగా రాజ్యలక్ష్మిని అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఇల్లు కట్టుకుంటుంటే రాజ్యలక్ష్మి మరో రూ.50వేలు సమర్పించుకున్నారు. అయినా వేధింపులు ఆగలేదు.
కొద్ది రోజుల క్రితం జాతర నిమిత్తం పుట్టింటికి వచ్చిన రాజ్యలక్ష్మి తాను వేధింపులు భరించలేకున్నాని, అత్తింటికి వెళ్లబోనని తల్లిదండ్రుల వద్ద వాపోయింది. అయితే తల్లిదండ్రులు ఆమెకు సర్దిచెప్పి, ఈ నెల 6వ తేదీన అత్తింట్లో వదిలివెళ్లారు. కాగా సోమవారం ఉదయం 10 గంటల సమయంలో రాజ్యలక్ష్మి తండ్రి రాజబాబుకు అన్నవరం నుండి ఆమె మామ చంద్రరావు నుండి ఫోన్ వచ్చింది. రాజ్యలక్ష్మి, ఇద్దరు పిల్లలు చనిపోయారనేది ఫోన్ సారాంశం. దీనితో రాజ్యలక్ష్మి తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో అన్నవరం చేరుకున్నారు. అనారోగ్యం కారణంగా తాము ఉదయం 8 గంటల సమయంలో గ్రామంలోని ఆసుపత్రికి వెళ్లామని, తిరిగివచ్చేసరికి రాజ్యలక్ష్మి తాడుతో ఫ్యానుకు ఉరివేసుకుందని, పిల్లలిద్దరూ చనిపోయివున్నారని రాజ్యలక్ష్మి భర్త, ఆత్తమామలు వారికి తెలిపారు.
అయితే తాము వచ్చేసరికే మృతదేహాన్ని కిందకు దించేశారని రాజ్యలక్ష్మి బంధువులు తెలిపారు.
అదనపు కట్నం కోసమే తమ కుమార్తె, పిల్లలను భర్త, అత్తింటి వారు హత్యచేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపించారు.
ఈమేరకు అన్నవరం పోలీసులకు ఫిర్యాదుచేశారు. పెద్దాపురం డీఎస్పీ చిలకా రామారావు, జగ్గంపేట సీఐ రాంబాబు, అన్నవరం ఎస్సై రావూరి మురళీమోహన్ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. రాజ్యలక్ష్మి తండ్రి రాజబాబు ఇచ్చిన ఫిర్యాదుమేరకు భర్త, అత్తింటి వారిపై కేసు నమోదుచేసి, దర్యాప్తుచేస్తున్నామని డీఎస్పీ రామారావు తెలిపారు.
మృతదేహాల తరలింపు అడ్డగింత
కాగా పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలను రాజ్యలక్ష్మి బంధువులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండు చేశారు. దీనితో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పోలీసులు వారికి నచ్చచెప్పి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
చిత్రం... తల్లీ పిల్లల మృతదేహాలు