క్రైమ్/లీగల్

‘దొంగ’ అనుమానంతో యువకుడి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్15: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని జలాల్‌పూర్‌లో శనివారం తెల్లవారుజామున దొంగ అనే అనుమానంతో ఓ యువకుడిని గ్రామస్థులు కొట్టి చంపారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసు పికెటింగ్‌ను ఏర్పాటు చేశారు. సంఘటన వివరాలిలా ఉన్నాయి. వర్ని మండలం శంకోరా గ్రామానికి చెందిన కెతావత్ రాజేష్(26) అనే యువకుడు మేస్ర్తి పని చేసుకుంటూ జీవనం వెళ్లదీసేవాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన అనంతరం రాజేష్ బహిర్భూమికి అని కుటుంబీకులకు చెప్పి బయటకు వెళ్లాడు. రాజేష్ సమీపంలోనే ఉన్న జలాల్‌పూర్‌కి చేరుకుని భూమయ్య అనే వ్యక్తి ఇంటి వద్దకు వచ్చాడు. ఆ సమయంలో భూమయ్య తన కుటుంబీకులతో కలిసి డాబాపై నిద్రిస్తున్నాడు. నరేష్ వచ్చిన అలికిడికి నిద్ర నుండి మేల్కొన్న భూమయ్య, చప్పుడు కాకుండా డాబా నుండి కిందకు దిగి ఎంతో లాఘవంగా నరేష్‌ను పట్టుకున్నాడు. దొంగ.. దొంగ అని గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారంతా అక్కడికి చేరుకున్నారు. నరేష్‌ను స్తంభానికి కట్టేసి తీవ్రంగా చితకబాదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం ఉదయం ఈ విషయం తెలియడంతో మృతుడి కుటుంబీకులు, బంధువులతో పాటు శంకోరా గ్రామస్థులంతా జలాల్‌పూర్‌కు చేరుకున్నారు. కారణం తెలుసుకోకుండా తీవ్రంగా చితకబాది హత్య చేయడం ఎంతవరకు సమంజసమంటూ జలాల్‌పూర్ గ్రామస్థులతో మృతుడి కుటుంబీకులు వాగ్వాదానికి దిగారు. నరేష్ మృతదేహంపై పడి అతని భార్య, ఇద్దరు చిన్నారులు గుండెలవిసేలా రోదించడం జలాల్‌పూర్ గ్రామస్థులను మరింత ఆగ్రహావేశాలకు గురి చేసింది. భూమయ్య ఇంటి ఎదుటే నరేష్ శవానికి దహన సంస్కారాలు జరిపిస్తామని కట్టెలతో చితిని పేర్చడం ఉద్రిక్తతలకు దారి తీసింది. జలాల్‌పూర్ గ్రామస్థులు వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేయగా, స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న బోధన్ ఏసీపీ రఘు, వర్ని సీఐ దామోదర్‌రెడ్డి, ఎస్‌ఐ అనిల్‌రెడ్డిలు తమ సిబ్బందితో హుటాహుటిన జలాల్‌పూర్ గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇరు గ్రామాల వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూమయ్య ఇంటి ముందు నుండి తాము మృతదేహాన్ని తీసేది లేదని శంకోరా గ్రామస్థులు, బాధిత కుటుంబీకులు భీష్మించుకు కూర్చోగా, ఏసీపీ రఘు వారిని సముదాయించారు. కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరుపుతామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు శాంతించారు. దీంతో రాజేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జలాల్‌పూర్ గ్రామంలో పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేశారు. కాగా, అర్ధరాత్రి దాటిన తరువాత శంకోరా గ్రామానికి చెందిన రాజేష్ జలాల్‌పూర్‌కు ఎందుకు వెళ్లాడనే దానిపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.