క్రైమ్/లీగల్

ఫిర్యాదు దారుడిని చితకబాదిన నవీపేట ఏఎస్‌ఐ సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 19: భూ తగాదాకు సంబంధించిన ఫిర్యాదు విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన నవీపేట ఏఎస్‌ఐ జాన్సన్ తగిన మూల్యాన్ని చెల్లించుకున్నారు. ఓ బాధితుడిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించుకుని, అతని పట్ల కరడుగట్టిన నేరస్థుడి తరహాలో తీవ్రంగా చితకబాదడాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు సదరు ఏఎస్‌ఐను సస్పెండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి నిజామాబాద్ రేంజ్ డీఐజీ శివశంకర్‌రెడ్డి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ మండలం పాల్ద గ్రామానికి చెందిన కిరణ్‌రావుకు ఆయన బంధువు అయిన మధుసూదన్‌రావుకు మధ్య గత కొన్నాళ్ల నుండి భూ తగాదా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మధుసూదన్‌రావు నవీపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో నవీపేట ఎస్‌ఐ సెలవుపై ఉండగా, ఏఎస్‌ఐ జాన్సన్ ఎస్‌హెచ్‌ఓగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదు అందిందే తడవుగా కిరణ్‌రావును మంగళవారం సాయంత్రం ఠాణాకు పిలిపించుకున్నారు. ఫిర్యాదుదారుడు మధుసూదన్‌రావు సమక్షంలోనే కిరణ్‌రావును రబ్బర్ బెల్టుతో ఏఎస్‌ఐ జాన్సన్ తీవ్రంగా చితకబాదాడు. పరుష పదజాలంతో దూషిస్తూ, బట్టలు విప్పించి సెల్‌లో నిర్బంధించాడు. ఏఎస్‌ఐ కొట్టిన దెబ్బలకు కిరణ్‌రావు శరీరంపై వాతలు తేలి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయమై బాధితుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో, స్పందించిన పోలీస్ కమిషనర్ కార్తికేయ విచారణకు ఆదేశించారు. బుధవారం ఉదయం నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, రూరల్ సీఐ శ్రీనాథ్‌రెడ్డి నవీపేట పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఈ ఉదంతంపై విచారణ జరిపారు. స్టేషన్‌లోని సిబ్బంది నుండి వివరాలు సేకరించడమే కాకుండా, బాధితుడు, ఏఎస్‌ఐల నుండి వాంగ్మూలాలు నమోదు చేశారు. సీ.సీ కెమెరా ఫుటేజీలను కూడా పరిశీలించగా, ఏఎస్‌ఐ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ కిరణ్‌రావును తీవ్రంగా చితకబాదినట్టు నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఏసీపీ సమర్పించిన నివేదిక ఆధారంగా సీ.పీ కార్తికేయ చేసిన సిఫార్సు మేరకు ఏఎస్‌ఐ జాన్సన్‌ను సస్పెండ్ చేస్తూ డీఐజీ శివశంకర్‌రెడ్డి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.