క్రైమ్/లీగల్

చంద్రగిరి పనబాకం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 1: తమ పిల్లలను డాక్టర్లను చేయాలని, అందుకు అవసరమైన ప్రవేశ పరీక్షలను రాయించడానికి తిరుపతికి వచ్చి తిరిగివెడుతూ చంద్రగిరి పనబాకం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థుల తండ్రులిద్దరు కానరానిలోకానికి వెళ్లారు. దీంతో వారి కుటుంబంలోనూ, వారి స్వస్థలం వి.కోటలోనూ విషాదఛాయలు అలముకున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో నాయుడుపేట-చంద్రగిరి జాతీయ రహదారిపై పనబాకం పంచాయతీ బోటి గుట్టవారి పల్లె వద్ద సంపంగిరెడ్డి, ఆయన బావమరిది గోవిందరెడ్డి, వారి కుమార్తెలు ప్రయాణిస్తున్న ఏపీ 03 సీడీ 2797 నెంబరుగల వేగనార్ కారును తమిళనాడు తిరువన్నామలై నుంచి వస్తున్న టీఎన్ 63 యు 4444 నెంబరు కలిగిన ఎండోవర్ కారు ఎదురుగా బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో వీ.కోటలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సంపంగిరెడ్డి(46) ఆయన బావమరిది గోవిందరెడ్డి(40) అక్కడికక్కడే మృతిచెందారు. అదే వాహనంలో ఉన్న సంపంగిరెడ్డి కుమార్తె పూజలతారెడ్డి, గోవిందరెడ్డి కుమార్తె తేజలతారెడ్డి, బీఎం తేజలతో పాటు మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని 108లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి వారికి ప్రాణాపాయం లేదని రుయా వైద్యులు తెలిపారు. వివరాల్లోకెళితే... వీ.కోట మండలం దుర్గానగర్‌కు చెందిన సంపంగిరెడ్డి (46) సమీపంలోని చింతమాకులపల్లెలో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన కుమార్తె పూజాలతారెడ్డి బైపీసీ గ్రూపులో ఇంటర్ పరీక్షలు రాసింది. త్వరలో ఎంసెట్, నీట్ పరీక్షలు రాయాల్సి ఉంది. ఈ క్రమంలో పరీక్షల శిక్షణ కోసం తిరుపతిలోని శ్రీచైతన్య డాక్టర్ అకాడమీలో చేర్చేందుకు సంపంగిరెడ్డి తన వాహనంలో తిరుపతికి చేరాడు. వీరితోపాటు ఆయన బావమరిది గోవిందరెడ్డి (40), ఆయన కుమార్తెలు తేజలతారెడ్డి, బీఎం తేజలతోపాటు వారి తల్లులు ఆదివారం ఉదయం తిరుపతికి చేరుకున్నారు. శ్రీ చైతన్య డాక్టర్ అకాడమీకి వెళ్లి అక్కడ ప్రవేశ పరీక్షలు రాయించారు. అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. అయితే మార్గమధ్యంలో పనబాకం వద్ద ఎదురుగా వస్తున్న తిరువన్నామలైకు చెందిన ప్రయాణీకులున్న ఎండోవర్ వాహనం డ్రైవర్ అతివేగంతో వచ్చి వేగనార్ కారును ఢీకొన్నాడు. దీంతోకారు నడుపుతున్న సంపంగిరెడ్డి, ముందుసీటులో ఉన్న ఆయన బావమరిది గోవిందరెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. వారిద్దరి పిల్లలు, మరో ఇద్దరు తీవ్రగాయాలకు గురయ్యారు. అయితే తిరువన్నామలైకు చెందిన తొమ్మిదిమంది ప్రయాణీకులు మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను రుయాకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. మృతదేహాలను ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. నడిరోడ్డుపై రోడ్డుప్రమాదం జరగడంతో ఇరువైపులా వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. చంద్రగిరి పోలీసులు ఎండోవర్ కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.