క్రైమ్/లీగల్

పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్, ఏచూరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 4: పరువునష్టం కేసుపై దాఖలైన పిటిషన్‌పై విచారణకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారంనాడు ముంబయిలోని మజ్‌గాన్ సెవ్రీ మెట్రోపాలిటన్ కోర్టుకు హాజరయ్యారు. తాము దోషులుగా తేలనందున ఈ కేసును ఎదుర్కొంటామని వారు కోర్టుకు స్పష్టం చేశారు. ప్రముఖ జర్నలిస్టు గౌరీ లకేష్ బెంగళూరులోని తన ఇంటి ముందు హత్యకు గురికావడం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. ఈ హత్య కేసుతో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధాలు ఉన్నాయంటూ రాహుల్, ఏచూరి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో 2017లో వారిద్దరిపై ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త, న్యాయవాది దృష్టిమాన్ జోషి పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఎవరైనా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై ఒత్తిడి పెరుగుతుంది, దాడులు జరుగుతాయి, హత్య చేస్తారు అంటూ రాహుల్ అప్పట్లో వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త దృష్టిమాన్ జోషి పరవునష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసుపై ఏడాది ఫిబ్రవరిలో సమన్లు జారీ చేయడంతో గురువారంనాడు రాహుల్ గాంధీ, సీతారాం ఏచూరి గట్టి భద్రత మధ్య కోర్టుకు హాజరయ్యారు. ఈ ఇద్దరు నాయకులపై ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం మీరు తప్పు చేసినట్టు ఒప్పుకుంటారా? అని ప్రశ్నించింది. అయితే, ఈ కేసులో తాము దోషులం ఎంతమాత్రం కాదని, విచారణను ఎదుర్కొంటామని రాహుల్, ఏచూరి స్పష్టం చేయడంతో వారిద్దరి స్టేట్‌మెంట్లను కోర్టు రికార్డు చేసింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదుదారుతోపాటు కొంతమంది సాక్షుల స్టేట్‌మెంట్లను సైతం కోర్టు రికార్డు చేసింది. 15,000 రూపాయల వంతున పూచీకత్తుపై రాహుల్, ఏచూరికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసులో తదుపరి విచారణకు స్వయంగా హాజరుకావాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఇచ్చింది. మాజీ పార్లమెంటు సభ్యుడు ఏకనాథ్ గైక్వాడ్ రాహుల్ గాంధీకి పూచీకత్తు ఇచ్చి అండగా నిలిచారు. అనంతరం రాహుల్, ఏచూరి నిబంధనల ప్రకారం కొన్ని పత్రాలపై సంతకాలు చేసి కోర్టు నుంచి నిష్క్రమించారు. మహారాష్టల్రో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై పరువునష్టం కేసును ఎదుర్కోవడం ఇది రెండోసారి. మహాత్మాగాంధీ హత్యోదంతానికి సంఘ పరివార్ కారణమంటూ వ్యాఖ్యలు చేయడంతో థానే జిల్లా, భివండిలో స్థానిక ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త ఒకరు రాహుల్‌పై ఇంతకుముందు పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఇదిలావుండగా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారంనాడు ఇక్కడి మెట్రోపాలిటన్ కోర్టుకు హాజరైన సందర్భంగా దాదాపు 250 మంది పార్టీ మద్దతుదారులు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలన్న నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని నినాదాలు చేశారు. కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాహుల్ తన మద్దతుదారులకు అభినందనలు తెలిపారు. ‘కోర్టు జారీ చేసిన సమన్లను రాహుల్ గౌరవంగా స్వీకరించారు. తాను దోషిగా తేలనందున విచారణను ఎదుర్కొంటామని చెప్పారు. ఈ కేసుపై తదుపరి విచారణ సెప్టెంబర్ 21న జరుగుతుంది’ అని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ తరఫున కోర్టుకు హాజరైన న్యాయవాది కుశాల్ మోర్ తెలిపారు.
చిత్రం...గురువారం ముంబయిలోని సెవ్రీ కోర్టుకు హాజరైన అనంతరం బయటకు వస్తున్న రాహుల్ గాంధీ