క్రైమ్/లీగల్

‘రివర్స్’ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ/రాజమహేంద్రవరం, ఆగస్టు 22: పోలవరం ప్రాజెక్టులో భాగమైన జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి రివర్స్ టెండరింగ్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఏపీ జెన్‌కో జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేస్తూ రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిలిపివేయాలని గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవతకవలు జరిగాయన్న ఆరోపణలపై నియమించిన నిపుణుల కమిటీ సిఫారసు మేరకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 5080 కోట్ల రూపాయల విలువైన పనులకు రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. నవయగ సంస్థ చేపడుతున్న వివిధ పనులను ప్రీ-క్లోజర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జల విద్యుత్ ప్రాజెక్టు పునాది పనుల కాంట్రాక్టును రద్దు చేస్తూ ఏపీజెన్‌కో ఈ నెల 14న ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో నవయుగ సంస్థ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. వాదనలు బుధవారం ముగిసినప్పటికీ, తీర్పును రిజర్వు చేసింది. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు గురువారం జారీ చేసింది. రివర్స్ టెండరింగ్ ప్రక్రియపై ముందుకు వెళ్లవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జెన్‌కో జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తమకు అందచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
నిర్మాణ సంస్థ సమ్మతి తీసుకోని ప్రభుత్వం
బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న పవర్‌హౌస్‌కు రీటెండర్ల వ్యవహారంలో నిర్మాణ సంస్థ నవయుగ సమ్మతి తీసుకోకుండానే ముందుకు వెళ్లడంవల్లే రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలిందనే వాదన వినిపిస్తోంది. ప్రాజెక్టు హెడ్ వర్క్సు మాదిరిగానే పోలవరం పవర్ హౌస్ విషయంలో కూడా ప్రభుత్వం రీటెండర్లకు వెళ్ళింది. హెడ్ వర్క్సు నిర్మాణం కూడా నవయుగ సంస్థే చేస్తోంది. హెడ్ వర్క్సు విషయంలో రీటెండర్లకు వెళ్ళడానికి ముందు ప్రభుత్వం నవయుగ నుంచి ముందస్తు అంగీకారం తీసుకుంది. తమకు రావాల్సిన రూ.500 కోట్ల వరకు బిల్లులు చెల్లించి, రీటెండర్లకు వెళ్ళొచ్చని నవయుగ సంస్థ ప్రభుత్వానికి అంగీకారం తెలపడంతో ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. ఇక్కడ వరకూ బాగానేవున్నా పవర్‌హౌస్ విషయంలో
మాత్రం నిర్మాణ సంస్థ నవయుగ నుండి ఎటువంటి అంగీకారాన్ని తీసుకోకుండా ప్రభుత్వం రీటెండర్లకు ఉపక్రమించడంతో సంస్థ హైకోర్టును ఆశ్రయించినట్టు చెబుతున్నారు. ఈ మేరకు పవర్‌హౌస్ కాంట్రాక్టును తొలగించడానికి వీల్లేదని హైకోర్టు గురువారం ఆదేశాలుజారీచేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ నవయుగ సంస్థను తొలగింపుపై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించిది. పవర్‌హౌస్ విషయంలో ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అసలు పోలవరం పవర్ హౌస్ నిర్మాణ పూర్వాపరాలను ఒకసారి పరిశీలిస్తే... దేవీపట్నం మండలం అంగుళూరు గ్రామంలో సుమారు 450 ఎకరాల విస్తీర్ణంలో పోలవరం పవర్‌హౌస్ నిర్మించడానికి గ్రామాన్ని ఖాళీ చేయించి, భూమి అప్పగించారు. ప్రస్తుతం మట్టి తవ్వకం పనులు జరుగుతున్నాయి. ఈ పనులు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పోలవరం ప్రాజెక్టు ద్వారా నీటినీ తీసుకుని విద్యుత్ ఉత్పత్తి తర్వాత గోదావరి నదిలోకి నీటిని విడిచి పెడుతుంది. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేల నుంచే కాకుండా విద్యుత్ కేంద్రం నుంచి కూడా నిరంతరం నీరు కాటన్ బ్యారేజికి చేరుతుంది. 80 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 12 టర్బైన్లు ద్వారా 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు నిర్మాణ పనులు చేపట్టిన నుంచి 58 నెలల్లో పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించి ఏపీ జెన్కో గ్లోబల్ టెండర్లు పిలిచింది. 40 నెలల్లో మూడు యూనిట్లు, మిగిలిన 9 యూనిట్లు 18 నెలల్లో పూర్తిచేయాలనేది టెండరు నిబంధన. ఈ విద్యుత్ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి అతి తక్కువ ధరకు విద్యుత్ లభ్యం కావడంతో పాటు ఈ ప్రాజెక్టు తలమానికంగా నిలవనుంది. ధవళేశ్వరం ఎగువన 42 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. మొదటి మూడు యూనిట్‌లు మార్చి 2021 నాటికి, మిగతా యూనిట్‌లు నెలకు ఒక్కో యూనిట్‌ను గ్రిడ్‌కు అనుసంధానంచేస్తూ మొత్తం ప్రాజెక్టు 2022 నాటికి పూర్తిచేయాలని సంకల్పించారు. ఇదిలావుండగా నవయుగ సంస్థ ఈ పనులను సుమారు రూ.3058 కోట్లతో ఖరారు చేసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన అనంతరం ప్రాజెక్టుల రీటెండర్ల పేరిట పోలవరం పవర్‌హౌస్ నిర్మాణానికి కూడా రీటెండర్లు పిలవాలని నిర్ణయించడంతో వివాదం నెలకొంది.

చిత్రం...దేవీపట్నం మండలం అంగుళూరు వద్ద పోలవరం పవర్‌హౌస్ నిర్మాణ ప్రాంతం