క్రైమ్/లీగల్

చిదంబరానికి నిరాశే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 26: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరానికి సోమవారం సుప్రీం కోర్టులో నిరాశే ఎదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను రద్దుచేసి ఢిల్లీ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేసింది. ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసుకున్న పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసి ఉన్నందున పిటిషన్‌కు విచారణ అర్హత లేదని న్యాయమూర్తులు ఆర్ బానుమతి, ఎఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. సీబీఐ అరెస్టుకు ముందే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని చిదంబరం తరఫుసీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వీలు వాదించినా ఫలితం లేకపోయింది. ఆ పిటిషన్ చెల్లుబాటు కాదని బెంచ్ ప్రకటించి కాంగ్రెస్ నేత ఆశలపై నీళ్లు చల్లింది. సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసి ఉన్నందున ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ అర్హత కోల్పోయినట్టేనని న్యాయమూర్తులు వెల్లడించారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో సీబీఐ కస్టడీ గడువుకు సోమవారంతో ముగిసిపోయింది. ఆయనను మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ విజ్ఞప్తి చేసింది.
సీబీఐ అరెస్టు చేయడానికి ముందే చిదంబరం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే పిటిషన్ అత్యవసరంగా విచారించలేమన్న ధర్మాసనం దాన్ని ప్రధాన న్యాయమూర్తికి పంపింది. ఆ సమయంలో ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ అయోధ్య కేసు విచారణలో ఉంది. ఇదే విషయాన్ని సిబాల్, సింఘ్వీ సోమవారం సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చారు. హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన వెంటనే సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు వారు వాదించారు. కేసు విచారణ శుక్రవారానికి వాయిదా పడిందని, బుధవారమే చిదంబరాన్ని అరెస్టు చేశారని వారన్నారు. ముందస్తు పిటిషన్‌పై విచారణ 23వ తేదీకి వాయిదా పడగ, 21 సాయంత్రమే ఆయనను అరెస్టు చేశారని సీనియర్ న్యాయవాదులు ఇద్దరూ అన్నారు. ఆగస్టు 20-21 తేదీల మధ్య జరిగిన విషయాలన్నీ సిబాల్ కోర్టు దృష్టికి తెచ్చారు. ‘మా క్లయింట్ ప్రాధమిక హక్కులను సీబీఐ అణచివేసింది. రాజ్యాంగం ఆయనకు కల్పించిన స్వేచ్ఛను హరించింది. మా పిటిషన్‌ను కనీసం గురువారం విచారించి ఉండాల్సింది’అని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించలేమన్న సుప్రీం కోర్టు ధర్మాసనం తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ‘చిదంబరం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నాం’అని న్యాయమూర్తులు ప్రకటించారు. కాగా మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేయకుండా సుప్రీం కోర్టు విధించిన గడువుకూడా సోమవారంతో ముగిసింది.
కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఐఎన్‌ఎక్స్ మీడియా విదేశీ పెట్టుబడులు స్వీకరించేందుకు చిదంబరం సహకరించారని అభియోగం. 2017 మే 15న సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అదే ఏడాది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసింది. 2018 జననవరి 21, 2019 జనవరి 1, 21 తేదీల్లో చిదంబరాన్ని ఈడీ ప్రశ్నించిందని, ఆయన ప్రమేయం ఉన్నట్టు ఎక్కడా పేర్కొనలేదని సిబాల్ కోర్టుకు తెలిపారు. విదేశీ పెట్టుబడుల స్వీకారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆరుగురు కార్యదర్శులతో ఓ కమిటీని వేసిందని, అక్కడ ఆమోదం పొందిన తరువాతే ఆర్థిక మంత్రిగా ఫైలుపై చిదంబరం సంతకం చేశారని న్యాయవాది వాదించారు.