క్రైమ్/లీగల్

ఆన్‌లైన్ ఆర్‌టీఐ పోర్టళ్ల మాటేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 26: దరఖాస్తులను వ్యక్తిగతంగా దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా ఆర్‌టీఐ కార్యకర్తలు సమాచారం పొందే విధంగా ఆన్‌లైన్ పోర్టల్స్‌ను ప్రారంభించాలంటూ దాఖలైన అభ్యర్థనను పురస్కరించుకుని సుప్రీం కోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి, 25 రాష్ట్రాలకు నోటీసులు పంపించింది. ఈ అప్పీలుపై ఢిల్లీకి చెందిన ప్రవాసీ లీగల్ సెల్ దాఖలు చేసిన ప్రజాహిత పిటీషన్‌పై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తులు ఎన్వీ రమణ, అజయ్ రస్తోగిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ నోటీసులు జారీ చేసింది. సమాచార హక్కు చట్టం అన్నది అత్యంత శక్తివంతమైన ఆయుధమని, పౌరులు అడిగే సమాచారాన్ని సకాలంలో ఇస్తేనే దీనికి విలువ ఉంటుందని, దీని లక్ష్యాలు నెరవేరుతాయని సుప్రీం బెంచ్ పేర్కొంది. ఎన్‌ఆర్‌ఐలతో సహా భారతీయ పౌరులు సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా విభాగం నుంచి సమాచారం సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించిందని పిటీషనర్ తెలిపారు. అలాగే తమతమ రాష్ట్రాల్లో ఆన్‌లైన్ ఆర్‌టీఐ పోర్టల్‌ను ప్రారంభించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని 2013 డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరిందని పిటీషనర్ తెలిపారు. అయితే కేవలం మహారాష్ట్ర, ఢిల్లీలో మాత్రమే ఆన్‌లైన్ పోర్టల్‌లు ప్రారంభమయ్యాయని ఈ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాల నుంచి సమాచారం పొందాలంటే సదరు పిటీషనర్లు భౌతికంగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, ఆన్‌లైన్‌లో వీటిని దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని పిటీషనర్ తెలిపారు. సుప్రీం కోర్టులో ఈ పిటీషన్‌ను న్యాయవాది జోసెఫ్ అబ్రహం దాఖలు చేశారు. ఆన్‌లైన్‌లో ఆర్‌టీఐ దరఖాస్తులకు అవకాశం ఇవ్వడం ద్వారా సత్వర సమాచారానికి ఆస్కారం ఉంటుందని, పాలనా వ్యవస్థలోనూ పారదర్శకత పెరుగుతుందని పిటీషనర్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అనేక మంది అధికారులను కలిసినప్పటికీ వారి నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని, అందుకే సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు.