క్రైమ్/లీగల్

తిరుమలలో రెచ్చిపోయిన దొంగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 1: తిరుమలలో దొంగలు రెచ్చిపోయారు. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఒకేసారి మూడు గదుల్లో చోరీలు చేసి టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ అధికారులకు, పోలీసులకు సవాల్ విసిరారు. తిరుమలలోని ఎస్‌ఎన్‌సిలోని 375-ఏ లోని గదిలో భక్తులకు చెందిన నాలుగు సెల్‌ఫోన్లను ఎత్తుకెళ్లారు. అలాగే పక్కనే ఉన్న 373-ఏ లోకి ప్రవేశించి అక్కడున్న ఒక పట్టుచీర, రూ. 4వేలు నగదు చోరీ చేశారు. ఆ తరువాత 356-ఏ గదిలోకి ప్రవేశించి రూ. 20వేలు విలువ చేసే నికాన్ కెమెరాలను ఎత్తుకెళ్లారు. అంతా దాదాపు ఒక గంటలోనే ఈ మూడు గదుల్లో చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. తలుపులకు వేసిన తాళాలను పగలగొట్టడంలో ఆరితేరినవారు, ఆ ప్రాంతంపై పట్టున్నవారే ఈ చోరీలకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. చూడటానికి భక్తుల రూపంలో తిరుగుతూ, భక్తులు తాము బస చేసిన గదిలో నుంచి బయటకు వెళ్లిన తరువాత కొద్దిసేపు ఆగి ఆ తరువాత చోరీలకు పాల్పడుతున్నారు. ఈ చోరీలకు పాల్పడుతున్నవారు ముగ్గురుకన్నా ఎక్కువ ఉండవచ్చని తెలుస్తోంది. ఒకరు భక్తులు ఎక్కడకు వెళుతున్నారో తెలుసుకునేందుకు వారిని వెంబడిస్తూ, మరికొందరు భక్తుల బస చేసిన గదుల వద్ద ఉంటూ సెల్‌ఫోన్ ద్వారా పరస్పర సమాచారం అందించుకుంటూ ప్రశాంతంగా చోరీలు చేస్తున్నారని తెలుస్తోంది. అలాగే తెల్లవారుజామున స్వామివారికి జరిగే అభిషేకాలు, ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు వెళ్లే భక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఒకేసారి మూడు గదుల్లో చోరీలు జరిగిన తీరుపై పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గతంలోను ఇదే తరహాలో చోరీలకు పాల్పడ్డ దొంగలను పట్టుకున్నా మళ్లీ అదే తరహాలో చోరీలు జరగడంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో తిరుమలలో భారీగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి ఉన్నా వాటికి చిక్కకుండా చోరీలకు పాల్పడుతున్న వారిని ఎలా పట్టుకోవాలో అర్థం కాని పరిస్థితిలో పడ్డారు. అయితే చోరీలు జరిగిన తీరును పరిశీలించి ఈ చోరీలకు పాల్పడ్డ వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.