క్రైమ్/లీగల్

నెల్లూరు జిల్లాలో పార్ధీ గ్యాంగ్ కదలికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 15: దేశంలో అత్యంత కరుడుగట్టిన నరహంతక దోపిడీ ముఠాల్లో ఒకటైన పార్ధీ గ్యాంగ్ కదలికలు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కనిపిస్తున్నట్లు అందిన ఇంటెలిజెన్స్ సమాచారం మేర జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ ముఠా సంచారంపై ఇప్పటికే జిల్లా పోలీసులను ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ అప్రమత్తం చేశారు. పార్ధీ గ్యాంగ్ కదలికలపై దృష్టిపెట్టాలని, అనుమానాస్పద సంచార జాతుల వారిపై నిఘా ఉంచాలని ఆదేశించారు. ఈ పార్ధీ గ్యాంగ్ పూర్వాపరాలను, వారు చేసే అకృత్యాలను పరికిస్తే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. మహారాష్టల్రోని పూణే, నాందేడ్, డోన్డ్ తదితర ప్రాంతాలకు చెందిన ఈ ముఠాలో 8 నుండి 10 మంది సభ్యులు ఉంటారు. ఫార్సే పార్ధీ తెగకు చెందిన వీరు ప్రస్తుతం మహారాష్టత్రో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల్లోనూ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లే వారిని, ఇండిపెండెంట్ ఇళ్లల్లో నివసించే వారిని లక్ష్యంగా చేసుకుని వీరు దాడులకు దిగి దోచుకుంటారు. ముఖ్యంగా నిర్మానుష్యమైన కాలనీల్లోనూ, వీధుల్లో చిట్టచివరన ఉన్న ఇళ్లలో ఇంటి సభ్యులు ఉన్నప్పటికీ దోపిడీకి పాల్పడతారు. శరీరానికి ఒండ్రుమట్టి, నూనె వంటివి రాసుకుని దోపిడీలకు దిగుతారు. పగలు మాత్రం లుంగీ, కుర్తా వంటివి ధరించి తిరుగుతారు. పగటిపూట బిచ్చగాళ్ల మాదిరిగానో, చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే వ్యాపారులుగానో వీధుల్లో తిరుగుతూ ఇళ్లను పరిశీలిస్తూ వెళతారు. రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలు, రహదారిపై ఉన్న చెట్ల కింద గుడారాలు వేసుకుని జీవిస్తుంటారు. హిందీ, మరాఠీ భాషలు అనర్గళంగా మాట్లాడుతూ తెలుగులో సమాధానం చెబితే అర్థం చేసుకోగలిగి ఉంటారు. ఓసారి దొంగతనానికి వెళ్లారంటే ఒకేసారి రెండు మూడు ఇళ్లల్లో దోపిడీలు పూర్తిచేసుకుని వెళతారు. కిటికీలు తెరవడంలో వీరు దిట్ట. చాకచక్యంగా కిటికీలు తొలగించి లోనికి ప్రవేశించి దొరికిన వస్తువులను దోచుకెళతారు. ఆ సమయంలో ఇంట్లోని సభ్యులు మేల్కొని ఉంటే వారిపై తీవ్ర దాడులకు దిగుతారు. వీరు చేసే దాడులు ఎంత తీవ్రంగా ఉంటాయంటే గాయాల పాలైనవారు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కత్తులు, రాడ్లు, బ్లేడ్లు, తుపాకులు వెంటబెట్టుకొని ఉంటారు. తమ వెంట తమ ఆరాధ్యదైవం అమ్మవారి ప్రతిమను వెంట ఉంచుకునే వారు దేవాలయాల్లోనూ దొంగతనాలకు వెనకాడరు. పోలీసులకు ఈ గ్యాంగ్ సభ్యులను పట్టుకోవడం అంత తేలిక కాదు. గత రెండేళ్లుగా వీరి కదలికలు పలు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ పట్టుబడిన దాఖలాలు లేవు. ప్రస్తుతం వీరు నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు సమాచారం అందుకున్న నెల్లూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. గస్తీని ముమ్మరం చేయాలని ఎస్పీ ఆదేశించడంతో గత రెండు రోజులుగా రాత్రిపూట పోలీసుల తనిఖీలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా రైల్వేస్టేషన్, బస్టాండ్ వంటి రద్దీ ప్రాంతాల్లో నిరంతరం పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. అనుమానాస్పదంగా వీధుల్లో తిరుగుతూ వస్తువులు అమ్మేవారు గ్రామాల్లో, తమ వీధుల్లోనూ ఎదురైతే వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎక్కడైనా పార్ధీ గ్యాంగ్ ముఠా కదలికలు పోలీసులకు కనబడితే వారిని కాల్చి వేసేందుకు కూడా వెనుకాడవద్దని ఉన్నతాధికారుల నుండి ఎస్‌హెచ్‌ఓలకు వౌఖిక ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం. జిల్లా ప్రజలు కూడా ఇటువంటి అపరిచత వ్యక్తులు తమ ప్రాంతాల్లో గుడారాలు వేసుకొని నివశిస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి భయంకరమైన ఈ ముఠా నుండి తప్పించుకోవాల్సిన అవసరం ఉంది.