క్రైమ్/లీగల్

ఆర్టీసీ నాయకులతో చర్చలు జరపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: ఆర్టీసీ సమ్మెపై హై కోర్టు మరోసారి తీవ్రంగా స్పందించింది. సంస్థ నాయకులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. శనివారం ఉదయం 10.30 గంటలకు చర్చలు ప్రారంభించాలని ఆదేశించింది. చర్చలను మూడు రోజుల్లో ముగించాలని, సారాంశం ఏమిటో తమకు తెలపాలని ఆదేశిస్తూ కేసును 28వ తేదీకి వాయిదా వేసింది. సమ్మె, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తీవ్రంగా స్పందించింది. సమ్మెకు సంబంధించిన వివిధ పరిణామాలు, ప్రభుత్వ తీరుపై విచారణ సందర్భంగా న్యాయమూర్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎండీని ఎందుకు నియమించలేదని ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాత్కాలిక ఎండీగా సమర్థుడైన అధికారి వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం తరఫున వాదిస్తున్న అడిషినల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పేర్కోగా, ఆయననే ఎండీగా ఎందుకు కొనసాగించరాదని నిలదీశారు. సమ్మె చేపట్టిన కార్మికులతోనూ, కార్పొరేషన్‌తో ప్రభుత్వమే చర్చలు జరపాలని ప్రకటించారు. శనివారం ఉదయం 10.30 గంటలకు రెండు యూనియన్లను చర్చలకు పిలవాలని కేసును విచారిస్తున్న బెంచ్ పేర్కొంది. ఎండీ నియామకం జరిగి ఉంటే కార్మికులకు కాసింత నమ్మకం కలిగి ఉండేదని అభిప్రాయపడింది. అదే జరిగితే, సమ్మె ఇంత తీవ్రరూపం దాల్చేది కాదుకదా అని వ్యాఖ్యానించింది. ప్రజలు చాలా శక్తివంతులని, వారిని ఎవరూ ఆపలేరని, వారు తిరగబడితే ఆపే పరిస్థితి ఉండదని హైకోర్టు బెంచ్ పేర్కొంది. గత రెండు వారాలుగా ఆందోళనలు జరుగుతున్నప్పటికీ, ఆపేందుకు ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించింది. కార్మిక సంఘాలతో చర్చలు ఎందుకు జరపలేదని అడిగింది.
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో చాలా వరకూ సులభంగానే పరిష్కరించ తగినవని హైకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. వారికి ఆరోగ్యశ్రీ కల్పించడంలో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటని ప్రశ్నించింది. తక్షణం కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించాలని ఆదేశించింది. అదే విధంగా తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిని సైతం అభివృద్ధి చేయాలని సూచించింది. కార్మికుల డిమాండ్లలో 50 శాతం డిమాండ్లను ఎలాంటి చర్చలు అవసరం లేకుండానే పరిష్కరించవచ్చని, వాటిని సైతం ఆమోదించేందుకు ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటని నిలదీసింది. కార్మికుల డిమాండ్లు చాలా పెద్దవని పేర్కొంటూ ప్రభుత్వం వౌనంగా ఉంటే ఎలా అని కోర్టు వ్యాఖ్యానించింది. ఒక దశలో ప్రభుత్వ న్యాయవాది వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా, ప్రధాన న్యాయమూర్తి ఆయనను నిలువరించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలు ఇబ్బందులు పడరాదని వ్యాఖ్యానించారు.
ఆర్టీసీ కార్మికులు శనివారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌పై ప్రభుత్వ వైఖరి ఏమిటని న్యాయమూర్తులు ప్రశ్నించారు. అయితే, కార్మికులు శాంతియుతంగా బంద్ చేపడితే అభ్యంతరం లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం ఆర్టీసీ పీకల్లోతు అప్పుల్లో ఉందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు 67 శాతం జీతాలు పెరిగాయని ప్రభుత్వం వాదించింది. ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు భారంగా మారుతున్నాయన్నారు. కార్మికులతో చర్చలు జరపడానికి సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని పేర్కొన్నారు. చర్చలు జరుగుతుండగానే కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లాయని, వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని అన్నారు. ఆర్టీసీని కోలుకోలేని రీతిలో దెబ్బతీసిన సంఘాలు, సంస్కరణలకు అడుగడుగునా అడ్డుపడుతున్నాయని ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది.